కరెన్సీపై చెట్ల నినాదాన్ని లిఖించాలి

29 Jan, 2017 00:36 IST|Sakshi
కరెన్సీపై చెట్ల నినాదాన్ని లిఖించాలి

‘సాక్షి’తో పద్మశ్రీ అవార్డు గ్రహీత రామయ్య

రాజేంద్రనగర్‌: పర్యావరణం మీద అందరికీ అవగాహన కల్పించేందుకు కరెన్సీ నోట్లపై ‘మొక్కలను నాటి సంరక్షించాలి’ అనే నినా దాన్ని చేర్చితే ప్రపంచంలోనే భారతదేశం గ్రీన్‌ కరెన్సీగా గుర్తింపు పొందుతుందని పద్మశ్రీ అవార్డు గ్రహీత దరిపల్లి రామయ్య పేర్కొన్నారు. రాజేంద్రనగర్‌లో జరిగిన వ్యవసాయ సదస్సుకు ప్రత్యేక అతిథిగా హాజరైన ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే..

ప్రశ్న: మొక్కలు నాటాలనే ఆలోచన ఎప్పటి నుంచి వచ్చింది.?
జవాబు: కుండలు తయారు చేసి విక్రయిస్తే నా ఒక్కడికే ఉపయోగపడుతుంది. అదే మొక్కను నాటితే నా చుట్టూ ఉన్న వారికి ఉపయోగపడుతుందని గ్రహించి మొక్కలు నాటడం ప్రారంభించాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు మొక్కలను నాటుతూనే ఉన్నాను.
ప్రశ్న:  హైదరాబాద్‌ నగరం ఎలా ఉంది.?
జవాబు: ఎక్కడ చూసినా భవనాలు, రహదారులే కనిపిస్తున్నాయి. బస్సు నుంచి చూస్తే చెట్లు కనిపించలేదు. ఇక్కడే చెట్లు కనిపించాయి. ప్రతి ఇంటి ముందు ఒక మొక్కను నాటాలి. రోడ్డులకు ఇరువైపులా మొక్కలను నాటితే అంతా హరితహారమే అవుతుంది. హైదరాబాద్‌ లో ఉన్న ప్రతి ఒక్కరు ఒక మొక్కను నాటితే అడవే అవుతుంది.
ప్రశ్న: ఇప్పటి వరకు ఎన్ని మొక్కలు నాటారు.?
జవాబు: ఇప్పటి వరకు కోటికిపైగా మొక్కలు నాటాను. అలాగే అడవులకు వెళ్లే సమయంలో విత్తనాలు తీసుకువెళ్లి చల్లుతుంటాను. ఇప్పటికే నేను నాటిన మొక్కలెన్నో చెట్లయి నేను ఆ దారి గుండా వెళ్లే సమయంలో పలకరిస్తుంటాయి.
ప్రశ్న:  మొక్కలు నాటేందుకు ఆర్థిక వనరులు ఎలా.?
జవాబు: నేను మొక్కలు నాటేందుకు డబ్బును ఖర్చు చేయలేను. ఆయా ప్రాంతాలలో ఉన్న అటవీ శాఖ, ప్రభుత్వం ఏర్పాటు చేసిన నర్సరీల నుంచి మొక్కలను సేకరించి నాటుతా.
ప్రశ్న:  మొక్కలను నాటడం మీ వరకేనా.. లేక మీ ఇంట్లో ఎవరైనా ఇలా నాటుతున్నారా.?
జవాబు: మొదట్లో నేను ఒక్కడినే నాటే వాడిని. తర్వాత నా భార్య జానమ్మ నా ఆశయాన్ని గమనించి సహకరిస్తోంది. మొక్కలు నాటాలని వారి మనస్సు నుంచి రావాలి. మొక్కలు నాటితే పద్మశ్రీ వస్తుందని నాకే తెలీదు యువత దీనిని స్ఫూర్తిగా తీసుకొని మొక్కలు నాటాలి. మొక్కలు నాటినవారే నా వారసులు.

మరిన్ని వార్తలు