తెలంగాణ నుంచి ఏపీకి వచ్చిన వారు స్థానికులే

14 Aug, 2016 08:54 IST|Sakshi
తెలంగాణ నుంచి ఏపీకి వచ్చిన వారు స్థానికులే

వారికి సామాజిక రిజర్వేషన్లు వర్తింప జేయాలి: ఏపీ సర్కార్‌కు హైకోర్టు ఆదేశం

సాక్షి, హైదరాబాద్: విభజన తర్వాత తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వలస వచ్చిన వారి పిల్లలకు ఏపీ విద్యా సంస్థల(ప్రవేశాల నియంత్రణ) సవరణ ఉత్తర్వుల ప్రకారం స్థానికతతో పాటు ఆ రాష్ట్రంలో అమలవుతున్న సామాజిక రిజర్వేషన్లను కూడా వర్తింపజేయాలని ఏపీ సర్కారును హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ అనిస్‌లతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది.

విభజన చట్టం అమల్లోకి వచ్చిన నాటి నుంచి మూడేళ్లలోపు ఏపీకి వలస వెళ్లే వారిని స్థానికులుగా గుర్తించాలంటూ రాష్ట్రపతి జారీ చేసిన ఉత్తర్వులను అమలు చేయాలని ఆదేశించింది. ఏపీకి చెందిన తన తండ్రి ఉద్యోగరీత్యా తెలంగాణకు వచ్చారని, ఆ తర్వాత బదిలీపై ఏపీకి వెళ్లారని, అయితే ఎంసెట్ ప్రవేశాల సందర్భంగా తనను స్థానికేతరురాలిగా పరిగణిస్తూ బీసీ-ఏ కింద రిజర్వేషన్లు కల్పించేందుకు నిరాకరిస్తున్నారంటూ శ్రీకాకుళం జిల్లాకు చెందిన బొడ్డేపల్లి జోత్స్న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

దీనిపై జస్టిస్ రామసుబ్రమణియన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు విన్న ధర్మాసనం, జోత్స్నను స్థానికురాలిగా పరిగణించి ఎంబీబీఎస్ కోర్సులో ప్రవేశం కల్పించాలని ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ అధికారులను ఆదేశించింది. అలాగే రిజర్వేషన్లు వర్తింపజేయాలంది.
 

>
మరిన్ని వార్తలు