హెచ్సీయూ ఘటనలో 28మంది విద్యార్థుల అరెస్ట్

23 Mar, 2016 16:16 IST|Sakshi
హెచ్సీయూ ఘటనలో 28మంది విద్యార్థుల అరెస్ట్

హైదరాబాద్ : హెచ్సీయూలో రెండోరోజు కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.  నిన్న హెచ్సీయూలో జరిగిన ఘటనకు సంబంధించి 28మంది విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేసి, కోర్టులో హాజరుపరిచారు. కోర్టు వారికి రిమాండ్ విధించడంతో చర్లపల్లి జైలుకు తరలించారు. మరోవైపు తమకు అనుమతి ఇవ్వకపోయినా హెచ్సీయూలో నిరసన కార్యక్రమం నిర్వహించి తీరతామని విద్యార్థులు స్పష్టం చేశారు. నిరసన తెలపటం తమ హక్కు అని, వీసీ అప్పారావును తొలగించేవరకూ తమ ఆందోళన కొనసాగుతుందని వారు తెలిపారు.

 

తమకు మద్దతు తెలిపే అందరినీ వర్శిటీకి ఆహ్వానిస్తామన్నారు. విద్యార్థుల నిరసన కార్యక్రమానికి జేఎన్ యూ విద్యార్థి సంఘం నేత కన్హయ్య కుమార్ హాజరు కానున్నారు. అయితే నిరసన కార్యక్రమానికి అనుమతి లేదని, బయటవారిని వర్శిటీలోకి అనుమతించేది లేదని పోలీసులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో పోలీసు బందోబస్తు కొనసాగుతోంది.

హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్ వేముల ఈ ఏడాది జనవరి 17న ఆత్మహత్య చేసుకోవడంతో వర్శిటీలో ఆందోళనలు మిన్నంటిన సంగతి తెలిసిందే. తనపై వ్యతిరేకత వెల్లువెత్తడంతో వీసీ అప్పారావు దాదాపు రెండు నెలలుగా దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు. మంగళవారం తిరిగి వర్సిటీకి వచ్చారు. తనకు అనుకూలంగా ఉన్న పలు విభాగాల డీన్లు, ప్రొఫెసర్లతో సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడేందుకు సిద్ధమయ్యారు.

ఈ విషయం తెలియడంతో అందడంతో విద్యార్థి జేఏసీ నేతృత్వంలో పెద్దఎత్తున విద్యార్థులు వీసీ నివాసం(లాడ్జ్) వద్దకు ర్యాలీగా తరలివచ్చారు. రోహిత్ మృతికి బాధ్యులైన వారిపై కఠిన చర్యల్లేకుండా వీసీ మళ్లీ ఎలా విధుల్లోకి ఎలా చేరతారంటూ ఆగ్రహంతో ఆయన నివాసంపై దాడి చేశారు. అక్కడున్న కంప్యూటర్లు, టీవీలు, ప్రింటర్లు, అలంకరణ సామాగ్రి, అద్దాలు, ఇతర వస్తువులను ధ్వంసం చేశారు. ఇందుకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి, 28మంది విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు.

మరిన్ని వార్తలు