23న హెచ్‌సీయూ విద్యార్థుల చలో ఢిల్లీ

9 Feb, 2016 01:25 IST|Sakshi

- 11 నుంచి తెలంగాణ, ఏపీల్లో బస్సు యాత్ర
- కేంద్ర ప్రభుత్వ వైఖరిపై నిరసన కార్యక్రమాలు
 
హైదరాబాద్: హెచ్‌సీయూలో రోహిత్ ఆత్మహత్య ఘటనపై కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా విద్యార్థులు మరిన్ని ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఇందులో భాగంగా చలో ఢిల్లీ కార్యక్రమంతోపాటు తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో బస్సు యాత్రలు చేపట్టాలని నిర్ణయించారు. అయితే తొలుత పేర్కొన్నట్లుగా చలో ఢిల్లీని ఈ నెల 20కి బదులుగా 23వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు విద్యార్థి జేఏసీ నాయకులు సోమవారం ప్రకటించారు. దీంతోపాటు పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఢిల్లీలో పలు నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు జేఏసీ కన్వీనర్ వెంకటేశ్ చౌహన్ చెప్పారు.
 
 దేశవ్యాప్తంగా కదిలి వచ్చే విద్యార్థులతో మూడు రోజుల పాటు ఆందోళనలు చేపడతామన్నారు. ఇక ఈనెల 11వ తేదీ నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో బస్సు యాత్ర చేపడతామని తెలిపారు. ఈ యాత్రలో భాగంగా వారం రోజుల పాటు ఉస్మానియా, కాకతీయ, మహత్మా గాంధీ, శాతవాహన, తెలంగాణ, ఆంధ్రా, ఎస్వీ, నాగార్జున, పద్మావతి, జేఎన్టీయూ, ద్రావిడ, శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలతో పాటు ప్రధాన విద్యాసంస్థలకు వెళ్లనున్నట్లు చెప్పారు.
 
 రిలే దీక్షలలో బిహార్ విద్యార్థులు
రోహిత్ ఘటనకు సంఘీభావంగా హెచ్‌సీయూలో బిహార్ రాష్ట్రానికి చెందిన విద్యార్థులు రిలే నిరాహార దీక్షలలో పాల్గొన్నారు. ఈ విద్యార్థులకు ఉస్మానియా విద్యార్థి జేఏసీ నాయకులు, మధ్యప్రదేశ్ గిరిజన సంఘాల నాయకులు సంఘీభావం ప్రకటించారు. దీక్షలో జిక్రుల్లాఖాన్, విషాల్ కుమార్, జితేంద్ర కుమార్, కుమార్ సౌరభ్, ఆశుతోష్ పాండే, ఫైజుల్ ఇస్లాం, మృత్యుంజయ్ పాండే, దివాకర్ ఉపాధ్యాయ తదితరులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు