సూపర్ స్ట్రార్

12 Mar, 2016 00:41 IST|Sakshi
సూపర్ స్ట్రార్

తలమీద వెంట్రుకలు కాసిన్ని ఎక్కువ పెరిగితేనే చిరాగ్గా ఉండే ఈ సీజన్‌లో.. ఏమిటీ కుర్రాడు తల నిండా కూల్‌డ్రింక్ స్ట్రాలు గుచ్చుకున్నాడు? అని చిరాకు పడితే మీరు డస్ట్‌బిన్‌లో కాలేసినట్టే. అదేదో ముదిరి రోకలి తలకి చుట్టుకున్నాడనేది పాత సామెత అయితే.. రికార్డుల సరదా ముదిరి స్ట్రాలు తల నిండా చుట్టుకున్నాడని మనవాణ్ని చూశాక కొత్తగా రాసుకోవచ్చు. ఇంతకీ రికార్డుల వేటలో ఉన్న ఈ జగద్గిరిగుట్ట కుర్రాడు సూపర్ ‘స్ట్రా’ర్ అవ్వాలనుకుంటున్న వెనుక ఉన్న కథా కమామిషు ఇది.  - సాక్షి, లైఫ్‌స్టైల్ ప్రతినిధి
 
ఇప్పుడు సిటీ కుర్రాళ్లు రికార్డులు బ్రేక్ చేసే పనిలో ఉన్నారు. అదీ ఇదీ అని కాదు అందుకోసం ఎంత కష్టానికైనా రెడీ అంటున్నారు. అదే కోవలో నగరానికి చెందిన భానుప్రకాష్ (25) కూడా ఈ రికార్డుల క్రేజ్‌ని బాగా తలకెక్కించుకున్నాడు. బీకామర్స్ పూర్తి చేసి హెల్త్‌కేర్‌లో వర్క్ చేస్తున్న ఈ కుర్రాడు ఇప్పటికే గంటలో అత్యధిక సెల్ఫీలు దిగడమనే ఫీట్ సాధించి బాగా పాపులర్ అయ్యాడు. అదే ఊపులో మరో అటెంప్ట్‌కి రెడీ అవుతున్నాడు. ప్లాస్టిక్ స్ట్రాలను అత్యధిక సంఖ్యలో తల వెంట్రుకల మధ్య పెట్టుకోవడమే ఈ అటెంప్ట్.  
 
టార్గెట్ ‘గిన్నిస్’..
తల వెంట్రుకల మధ్య అత్యధిక స్ట్రాలను పెట్టుకోవడంలో ఇప్పటికే పలు రికార్డులు నమోదయ్యాయి. పాత రికార్డుల సంగతి అటుంచితే తాజాగా రికార్డు మాత్రం అమెరికాకు చెందిన స్టీఫెన్ రిఫర్టీ పేరు మీద ఉంది. ఆయన 2014 ఫిబ్రవరి 14న ఒకేసారి 312 స్ట్రాలను తన వెంట్రుకల మధ్య పెట్టుకొనిత గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కారు. భానుప్రకాష్ ఈ రికార్డును తిరగరాయాలని నిశ్చయించుకున్నాడు. అయితే 350 స్ట్రాలతో మరో రికార్డు కూడా ఉందని, ఆ వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని భాను చెప్పారు. కనీసం 400-500 స్ట్రాలను తాను వెంట్రుకల మధ్య ఇమడ్చగలనని భానుప్రకాష్ ధీమాగా చెబుతున్నాడు. ఇప్పటికే పలు దఫాలు దీనికి సంబంధించిన ప్రదర్శనలిచ్చిన భాను తన గిన్నిస్ రికార్డు ఫీట్‌ను వారం రోజుల్లో చేపట్టనున్నట్టు ‘సాక్షి’కి తెలిపారు.

గిన్నిస్ షరతుల ప్రకారం...ఈ రికార్డు కోసం వినియోగించే స్ట్రాలు ప్రత్యేక సైజును కలిగి ఉంటాయి. స్ట్రాలు పెట్టుకున్నాక 10 సెకన్లు అలాగే ఉండాలి. ఈలోగా వాటిలో ఏ ఒక్కటి కిందపడినా అది కౌంట్ కాదు. ఇప్పటికే రెండు వీడియోలను రూపొందించిన ఈ కుర్రాడు తన ఫ్రెండ్స్ గ్రూప్ మధ్య మరోసారి ఈ ఫీట్ చేసి ఇంకో వీడియో తీస్తున్నానని చెప్పాడు. ‘మన దగ్గర దొరికే స్ట్రాలు ఎక్కువ సైజు ఉంటాయి. అందుకని వీటిని వెతికి ప్లాస్టిక్ షాప్ వాళ్ల దగ్గర కొన్నాను. లాంగ్ హెయిర్ ఉంటే ఎన్నో స్ట్రాలు పెట్టుకోవచ్చనుకుంటాం. కానీ ప్లాస్టిక్ కదా అన్నీ జారిపోతుంటాయి. చాలా జాగ్రత్తగా జడ అల్లినట్లు పెట్టాల’ని తన రికార్డు కష్టాలను వివరిస్తున్నాడీ కుర్రాడు. ఏదేమైనా ఈ కుర్రాడి ఫీట్ మనల్ని మరోసారి గిన్నిస్‌కు ఎక్కిస్తుందని ఆశిద్దాం.
 
 

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు