ఆర్కే చనిపోయారా? పోలీసుల కస్టడీలో ఉన్నారా?

31 Oct, 2016 15:01 IST|Sakshi
ఆర్కే చనిపోయారా? పోలీసుల కస్టడీలో ఉన్నారా?

హైదరాబాద్ : మావోయిస్టు అగ్రనేత ఆర్కే భార్య శిరీష వేసిన పిటిషన్పై విచారణను హైకోర్టు గురువారానికి వాయిదా వేసింది. ఈ సందర్భంగా న్యాయస్థానం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ కేసును తాము చాలా తీవ్రంగా పరిగణిస్తున్నామని, సాధారణ పౌరుడైనా, మావోయిస్టు అయినా మనిషే అని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఎన్ కౌంటర్ పేరుతో మనుషులను చంపటం సరికాదని అభిప్రాయపడింది.

ఆర్కే చనిపోయారా?...లేక పోలీసుల కస్టడీలో ఉన్నారో తెలపాలని హైకోర్టు ఈ సందర్భంగా  ఏపీ ప్రభుత్వాన్ని సూటిగా  ప్రశ్నించింది. ఒకవేళ పోలీసుల కస్టడీలో ఉంటే  ఆర్కేకు ఎలాంటి ప్రాణహానీ తలపెట్టవద్దని ఆదేశించింది. ఎన్ కౌంటర్ జరిగి ఇన్నిరోజులు అయినా వివరాలు తెలిపేందుకు ఇంత సమయం ఎందుకు పడుతుందని న్యాయస్థానం ప్రశ్నలు సంధించింది. ఆర్కే ఎక్కడున్నారన్న దానిపై తక్షణమే ప్రభుత్వం సమగ్ర సమాచారంతో కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఈ సందర్భంగా ఆర్కే భార్య శిరీష మాట్లాడుతూ తన భర్త పోలీస్ కస్టడీలోనే ఉన్నారని, ఆర్కేను వెంటనే కోర్టులో హాజరు పరచాలని డిమాండ్ చేశారు. ఎన్ కౌంటర్పై చాలా అనుమానాలు ఉన్నాయని, ఎన్ కౌంటర్ తర్వాత మరుసటి రోజుకు మృతుల సంఖ్య పెరగడం, కొన్ని మృతదేహాలను గుర్తించకుండా ఖననం చేయడం అనేక అనుమానాలు తలెత్తుతున్నాయని శిరీష తరఫు న్యాయవాది అన్నారు. కాగా తన భర్త ఆర్కేను తక్షణమే కోర్టులో హాజరు పరచాలని ఆయన భార్య హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు ఈ నెల 24 ఏవోబీ ఎన్ కౌంటర్ అనంతరం ఆర్కే ఆచూకీ లేదు.

మరిన్ని వార్తలు