బోధన్‌ స్కాం.. ప్రధాన సూత్రధారికి గుండెపోటు!

18 Mar, 2017 02:58 IST|Sakshi
బోధన్‌ స్కాం.. ప్రధాన సూత్రధారికి గుండెపోటు!

ఏ–1 నిందితుడు శివరాజ్‌ పరిస్థితి విషమం.. గుట్టుచప్పుడు కాకుండా చికిత్స
ఏ–2గా ఉన్న శివరాజ్‌ కుమారుడు సునీల్‌ కోసం వేట సాగిస్తున్న సీఐడీ


సాక్షి, హైదరాబాద్‌: బోధన్‌ వాణిజ్య పన్నుల శాఖ కుంభకోణంలో ప్రధాన సూత్రధారి శివరాజ్‌కు గుండెపోటు వచ్చినట్టు విశ్వసనీ యంగా తెలిసింది. గత పదిహేను రోజుల నుంచి సీఐడీ బృందాలు శివరాజ్‌ కోసం మూడు రాష్ట్రాలను జల్లెడ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి కొయంబత్తూర్‌ సమీపంలోని ఓ గెస్ట్‌హౌజ్‌లో శివరాజ్‌ ఉన్న సమాచారం అందుకున్న అధికారులు.. ఎట్టకేలకు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే అక్కడి నుంచి హైదరాబాద్‌ వస్తుండగా మార్గమధ్యంలోనే శివరాజ్‌ తీవ్ర గుండెపోటుకు గురైనట్టు సీఐడీ వర్గాలు తెలిపాయి. దీంతో హుటాహుటిన హైదరాబాద్‌ తరలించి ఓ కార్పొరేట్‌ ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే మూడు స్టంట్లు వేశారని, అయినా పరిస్థితి విషమంగా ఉందని సీఐడీ దర్యాప్తు బృందాల అధికారులు స్పష్టంచేశారు.

గుట్టు చప్పుడు కాకుండా..
రూ.వంద కోట్ల కుంభకోణంలో ఏ–1గా ఉన్న శివరాజ్‌కు గుండెపోటు వచ్చిన విషయాన్ని సీఐడీ అధికారులు బయటకు పొక్కనివ్వలేదు. గతంలో ఎంసెట్‌ కేసులోనూ కీలక నిందితుడు కమిలేశ్‌ కుమార్‌ సింగ్‌ కూడా సీఐడీ కస్టడీలోనే మృతి చెందాడు. ముందుగా కమిలేశ్‌ గుండెపోటు వచ్చినట్టు నటించాడు. అయితే తర్వాత కొద్ది సేపటికే అతడికి నిజంగా గుండెపోటు వచ్చినా, సీఐడీ అధికారులు డ్రామాగా భావించి ఆస్పత్రికి తరలించడంలో నిర్లక్ష్యం వహించారు. ఆస్పత్రికి ఆలస్యంగా తీసుకెళ్లడం వల్లే కమిలేశ్‌ మృతి చెందాడని తర్వాత తెలిసింది. ఇప్పుడు కమర్షియల్‌ స్కాంలోనూ ఇదే రీతిలో ఏ–1గా ఉన్న శివరాజ్‌ గుండెపోటుకు గురవడం సంచలనంగా మారింది. కుంభకోణంలో ప్రధాన పాత్ర పోషించిన శివరాజ్‌ కుమారుడు, ఏ–2 సునీల్‌ కోసం సీఐడీ ముమ్మరంగా గాలిస్తోంది.

కార్యాలయం అతడి హ్యాండోవర్లోనే!
కమర్షియల్‌ ట్యాక్స్‌ సర్కిల్‌ ఆఫీస్‌ పేరుకు మాత్రమేనని, కార్యకలాపాలు మొత్తం నిర్వహించేది శివరాజేనని నిందితులు సీఐడీకి పూసగుచ్చినట్టుగా తెలిపారని సమాచారం. ఏ అధికారి ఏసీటీవోగా సర్కిల్‌ ఆఫీస్‌కు వచ్చినా, శివరాజ్‌ హవానే కొనసాగేదనని, ఎవరెవరకి ప్రతీ నెలా ఎంత పంపాలో అతడికి బాగా తెలుసని వివరించినట్లు సమాచారం. కేంద్ర కార్యాలయంలో ఉన్న ఆడిటింగ్‌ అధికారులను సైతం శివరాజ్‌ మ్యానేజ్‌ చేశారని, 2010 నుంచి ఇప్పటివరకు ట్యాక్స్‌ లెక్కలను ఆడిటింగ్‌ చేయకపోవడమే ఇందుకు ఉదాహరణ అని కస్టడీలో ఉన్న నిందితులు సీఐడీకి స్పష్టం చేసినట్టు తెలిసింది.

ఇప్పటికే ముగ్గురి అరెస్ట్‌
బోధన్‌ స్కాంలో నిందితులతో కుమ్మకైన ఏసీటీవో, సీనియర్‌ అసిస్టెంట్, మరో జూనియర్‌ అసిస్టెంట్‌ వారం రోజుల కిందటే కోర్టులో లొంగిపోయా రు. సీఐడీ వీరిని వారం రోజులపాటు కస్టడీలోకి తీసుకుంది. ఈ కుంభకోణంలో సీటీవోలు, డీసీటీవోలు, జాయింట్‌ కమి షనర్లు, అదనపు కమిషనర్ల పాత్ర కూడా ఉందని కస్టడీలో ఉన్న నిందితులు వాంగ్మూలం ఇచ్చినట్టు విశ్వసనీయంగా తెలిసింది. తాము కేవలం ఏసీటీవో, డీసీటీవోలు చెప్పిన వివరాలను రికార్డుల్లోకి ఎక్కిస్తామని, అంతకు మించి తమ పాత్ర పెద్దగా ఏమీ లేదని వెల్లడించినట్లు సమాచారం.

మరిన్ని వార్తలు