‘గుండె’ గోడు పట్టదా?

22 Oct, 2016 02:07 IST|Sakshi
‘గుండె’ గోడు పట్టదా?

జీవన్‌దాన్ కింద 256 గుండె దాతల నుంచి 26 మాత్రమే స్వీకరణ
మిగిలినవన్నీ వృథా... బాధితుల వివరాలు నమోదు చేయని ఫలితం
గుండె మార్పిడి చేసే అత్యాధునిక వసతులు కూడా కరువు

 సాక్షి, హైదరాబాద్: ‘అవయవ దానాలు చేయండి... బాధితుల జీవితాల్లో వెలుగు నింపండి... పునర్జన్మ ఎత్తండి’ అంటూ చేసే నినాదాలు దాతలకు ‘ఆత్మ’ఘోషను మిగిలిస్తున్నాయి. అత్యాధునిక మౌలిక వసతులు లేక దాతల హృదయాలు కకావికలమవుతున్నాయి. రాష్ట్రంలో అవయవ దానంపై చైతన్యం పెరుగుతోంది. దాతల వివరాలనూ జీవన్‌దాన్ వెబ్‌సైట్లో పెడుతున్నారు. ఇప్పటివరకు 8 వేల మంది తాము అవయవదానాలు చేస్తామని వాగ్దానం కూడా చేశారు.

కానీ దాతల నుంచి గుండెలను తీసుకొని మార్పిడి చేసే పరిస్థితి, అత్యాధునిక వైద్య సదుపాయాల లేమి రాష్ట్రంలో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత నుంచి ఇప్పటివరకు 256 మంది దాతల నుంచి అవయవాలు స్వీకరించడానికి వీలు కలిగింది. అందులో 444 కిడ్నీలు, 248 కాలేయాలు, 166 గుండె వాల్వులు, 193 కళ్లు, 5 ఊపిరితిత్తులు బాధితులకు మార్పిడి చేశారు. కానీ బ్రెయిన్ డెడ్ అయిన దాతలు 256 మంది ఉన్నా గుండె మార్పిడి మాత్రం కేవలం 26 మందికే చేయడం గమనార్హం. మరోవైపు ఇదేకాలంలో అనేకమంది గుండె అవసరమైనవారు సకాలంలో గుండె మార్పిడి లేక మృత్యువాత పడ్డారు.

ఐదు గంటల్లోగా..
బ్రెయిన్ డెడ్ అయిన దాత నుంచి స్వీకరించే గుండెను ప్రత్యేకమైన అత్యాధునిక నిల్వ సాంకేతిక పరిజ్ఞానంతో తరలించాలి. దాన్ని బాధిత వ్యక్తికి ఐదు గంటల్లోగా అమర్చాలి. అప్పుడే అది విజయవంతం అవుతుంది. దాతల నుంచి వచ్చే గుండెలను బాధితులకు చేరవేయడం ఒక పద్ధతైతే డిమాండ్ మేరకు మార్పిడి చేసే ప్రత్యేక ఆపరేషన్ థియేటర్లు, అత్యాధునిక వైద్యపరమైన మౌలిక వసతులు అందుబాటులో ఉండాలి. కానీ రాష్ట్ర రాజధానిలోనే అటువంటి పరిస్థితి లేదు.

నగరంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నిమ్స్, గాంధీ, మరో నాలుగైదు ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రుల్లోనే గుండె మార్పిడి శస్త్ర చికిత్సలు జరుగుతున్నాయి. కానీ దాతల నుంచి వచ్చే స్పందనతో పోలిస్తే బాధితులకు గుండె మార్పిడి చేసే సంఖ్య అత్యంత తక్కువ ఉండటం గమనార్హం. ఉదాహరణకు నిమ్స్‌లో గుండెమార్పిడి చేసే ప్రత్యేకమైన ఆపరేషన్ థియేటర్లు అవసరం మేరకు లేవు. నిమ్స్‌లో ఇప్పటివరకు కేవలం ఐదు గుండె మార్పిడులు జరిగాయంటే పరిస్థితి ఏంటో అర్థమవుతుంది.

ఇవన్నీ కొరవడటం వల్లే..
గుండె అవసరమైన బాధితుల రిజిస్టర్‌ను పక్కాగా నిర్వహించాలి. వారిని అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. సీరియల్ ప్రకారం బ్రెయిన్‌డెడ్ అయినవారి నుంచి గుండె తీసుకోవాల్సి వస్తే తక్షణమే సమాచారం ఇచ్చి ఆగమేఘాల మీద బాధితులను పిలిపించి వారికి అమర్చే ప్రక్రియ, పరిజ్ఞానం ఉండాలి. ఇవన్నీ కొరవడటం వల్లే దాతలు, బాధితులున్నా గుండెలు వృథాగా పోతున్నాయి. డిమాండ్‌ను, స్వీకరించే డిమాండ్‌నూ రెండింటినీ ఉపయోగించుకునే వ్యవస్థ లేకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడుతోందని ఒక ప్రభుత్వ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. నిమ్స్‌లో రూ.10.50 లక్షలకు గుండె మార్పిడి చేస్తుండగా, ప్రైవేటులో రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు