ఆవిర్భావ దినోత్సవానికి భారీ ఏర్పాట్లు

10 May, 2016 01:24 IST|Sakshi

కార్యాచరణ రూపొందిస్తున్న టీజేఏసీ

 సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి(జేఏసీ) రాష్ట్రావిర్భావ దినోత్సవాన్ని భారీగా నిర్వహించాలని యోచిస్తోంది. ఉద్యమ ఘట్టాలను, సన్నివేశాలను ఆవిష్కరించడంతో పాటు రాష్ట్ర ఏర్పాటు స్ఫూర్తిని, వివిధ వర్గాల ఆకాంక్షలను ప్రతిఫలించేలా పెద్ద ఎత్తున కార్యక్రమాలను చేపట్టనుంది. తెలంగాణ ఉద్యమానికి ఆయువుపట్టుగా ఉన్న ఓయూలోనే జూన్ 2న భారీ కార్యక్రమానికి జేఏసీ రూపకల్పన చేస్తోంది. జూన్ 1నే మండల, నియోజకవర్గ, రెవెన్యూ డివిజన్, జిల్లా కేంద్రాల్లో వేడుకలను నిర్వహించాలని యోచిస్తోంది.

అమరవీరుల కుటుంబాలకు సన్మానం, 2 సాయంత్రం నుంచి సాంస్కృతిక కార్యక్రమాల తెలంగాణ ధూంధాం నిర్వహించడానికి ఏర్పా ట్లు చేస్తోంది. ఇందులో తెలంగాణ కవులు, రచయితలు, కళాకారులు, వివిధ రంగాల నిపుణులు, ఉద్యమ సంఘాల నేతలను భాగస్వామ్యం చేయాలని జేఏసీ భావి స్తోంది. విదేశీ పర్యటనలో ఉన్న జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం ఈ నెల 25న తిరిగి రానున్నారు. ఆయన హైదరాబాద్‌కు చేరుకున్న తర్వాత దీనిపై పూర్తిస్థాయి ప్రకటన వెలువడనుంది.

మరిన్ని వార్తలు