బండి కనిపిస్తే బాదుడే..!

10 Apr, 2016 03:18 IST|Sakshi
బండి కనిపిస్తే బాదుడే..!

♦ ఎన్నడూ లేనట్టుగా తనిఖీల కేలండర్ సిద్ధం చేస్తున్న రవాణా శాఖ
♦ ఖజానాకు రూ.2,900 కోట్లు జమ చేయాలని సర్కారు ఆదేశించటమే కారణం
♦ నిరుటి కంటే రూ.700 కోట్లు అధిక వసూళ్లే లక్ష్యం  
♦ చెకింగ్‌లతో వాహనాల నుంచి పిండుకోవాలని నిర్ణయం
 
 సాక్షి, హైదరాబాద్: లెసైన్సుందా.. ఆర్సీ బుక్కేది.. పొల్యూషన్ సర్టిఫికెట్ లేదా.. హెల్మెట్ ఎందుకు పెట్టుకోలేదు... ఇదీ ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడితే కురిసే ప్రశ్నల వర్షం. ఇప్పుడు ట్రాఫిక్ పోలీసులకు రవాణా శాఖ అధికారులు తోడు కానున్నారు. పర్మిట్లు, లైఫ్ ట్యాక్స్, ఫిట్‌నెస్ సర్టిఫికెట్.. ఇలా తనిఖీలతో హోరెత్తించనున్నారు.

 రవాణాశాఖ అధికారుల తనిఖీల్లేక ఆటోలు, క్యాబ్‌లు, ఇతర భారీ వాహనాల ఆగడాలకు అంతేలేదనే విమర్శలు నిత్యం వినిపిస్తుంటాయి. ఓవర్‌లోడ్, ఫిట్‌నెస్ లేని వాహనాలు.. భారీ ప్రమాదాలు.. ప్రాణనష్టం.. ఇవే విమర్శలకు కారణం. రవాణా శాఖ అధికారులను ఇప్పుడు ప్రభుత్వమే పరిగెత్తించబోతోంది.. ఎందుకంటే ఆ తనిఖీలతో ఖజానా బరువు పెంచుకోవాలన్నది ప్రభుత్వ ఆరాటం.

 రవాణా శాఖకు 2015-16 ఆర్థిక సంవత్సరంలో రూ.2,500 కోట్లు లక్ష్యాన్ని నిర్దేశించగా... రూ. 2,216 కోట్లు వసూలు చేసింది. అంతకుముందు ఏడాది వసూళ్లు రూ. 1,864 కోట్లు మాత్రమే. దీనితో పోలిస్తే 2015-16లో 20 శాతం అధికంగా వసూలు కావడంతో... ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 30 శాతం పెరుగుదలతో రూ. 2,900 కోట్లు ఖజానాకు జమ చేయాలని ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇది చాలా పెద్ద లక్ష్యం. ఉమ్మడి రాష్ట్రంలోనూ ఇంత  ఆదా యం సాధించిన దాఖలా లేదు. ఈ లక్ష్యాన్ని చేరుకోవడం కష్టమని అధికారులు పేర్కొం టున్నా... తనిఖీలు చేసి పాత ఫీజు లు, బకాయిలు వసూలు చేసైనా లక్ష్యాన్ని సాధించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో రోడ్డెక్కిన అధికారులు... గతంలో ఎన్నడూ లేని రీతిలో ఏకంగా తనిఖీల క్యాలెండర్‌నే రూపొందిస్తున్నారు. సంవత్సరం పొడవునా స్పెషల్ డ్రైవ్‌లతో పాటు నిరంతరాయంగా తనిఖీలకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

 
 అన్ని మార్గాలూ ఉపయోగించి...
 సాధారణంగా రవాణా శాఖకు కొత్త వాహనాల లైఫ్‌ట్యాక్స్ ప్రధాన ఆదాయ వనరు. వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరం కార్ల కొనుగోలులో ఢిల్లీ, ముంబైలకు పోటీనిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో లైఫ్ ట్యాక్స్ రూపంలో ఏకంగా రూ. 1,400 కోట్లు వసూలైంది. మొత్తం ఆదాయంలో మూడొంతులు ఇదే. ఆ సంవత్సరం వాహనాల పెరుగుదల రేటు 12 శాతంగా నమోదైంది. ఈసారి అది కనీసం 14 శాతం ఉన్నా ఆ రూపంలో ఆదాయం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. అయినా కూడా ప్రభుత్వం విధించిన టార్గెట్ కష్టం. దీంతో మిగతా లోటును కచ్చితంగా తనిఖీల రూపంలో వాహనాల నుంచి వసూలు చేయాల్సిన పరిస్థితి.

గత సంవత్సరం తనిఖీలతో కేవలం రూ. 150 కోట్లు మాత్రమే వచ్చాయి. ఈసారి ఆ మొత్తాన్ని రూ. 500 కోట్లు దాటించాలని రవాణా శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్రంలో చాలా వాహనాలు త్రైమాసిక పన్ను చెల్లించడం లేదు. పర్మిట్ ఫీజు కట్టకుండా తిరుగుతున్న వాహనాలు కూడా ఉన్నాయి. ఫిట్‌నెస్ సర్టిఫికెట్ లేని వాహనాల సంఖ్యే ఎక్కువ. ఇలాంటి వాటినన్నింటినీ తిరగదోడి బకాయిలు వసూలు చేయడం ద్వారా ప్రభుత్వ లక్ష్యాన్ని సాధించేందుకు రవాణా శాఖ సిద్ధమైంది. వెరసి ఎక్కడపడితే అక్క డ తనిఖీలు జరిపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఓవైపు ట్రాఫిక్ పోలీసులు, మరోవైపు రవాణాశాఖ అధికారులు.. తని ఖీలు చేస్తున్న క్రమంలో వాహనదారులూ బహుపరాక్... పన్ను, ఫీజు ఎగవేతలుంటే వెంటనే క్లియర్ చేసుకోండి. కాదంటే పెనాల్టీ రూపంలో రంగు పడుతుంది. 

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా