హైదరాబాద్‌ను ముంచెత్తిన భారీ వర్షం

14 Sep, 2017 06:37 IST|Sakshi
హైదరాబాద్‌ను ముంచెత్తిన భారీ వర్షం

సాక్షి, హైదరాబాద్ : ఎడతెరిపి లేకుండా బుధవారం సాయంత్రం నుంచి కురుస్తున్న భారీ వర్షానికి హైదరాబాద్ మహానగరం తడిసి ముద్దయింది. ముఖ్యంగా అర్ధరాత్రి దాటిన తర్వాత కురిసిన వర్షంతో లోతట్టుప్రాంతాలు జలశయాలను తలపిస్తున్నాయి. నగరంలోని కొన్ని ప్రాంతాలు రాత్రి నుంచి విద్యుత్ సరఫరా లేకపోవడంతో అంధకారంలో మగ్గిపోయాయి. నగరంలోని సికింద్రాబాద్, బేగంపేట, పంజాగుట్ట, అమీర్‌పేట, ఎర్రగడ్డ, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, వనస్థలిపురం, ఎల్బీనగర్, ఉప్పల్ సహా పలు ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది.

కుండపోత వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలతో పాటు పలు కాలనీలను వరద నీరు ముంచెత్తడంతో లాలాపేటలోని ఫంక్షన్‌హాల్‌లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. మోకాళ్లలోతు నీళ్లలోనూ రాష్ట్ర మంత్రి పద్మారావు పునరావాస కేంద్రాన్ని, చుట్టుపక్కల ప్రాంతాలలో సహాయక చర్యలను పర్యవేక్షించారు. నిరాశ్రయులుగా మారిన వారి గురించి చర్యలు తీసుకునే దిశగా జీహెచ్ఎంసీ అధికారులకు పద్మారావు ఆదేశాలు జారీచేశారు. నగరంలోని పలు అపార్ట్‌మెంట్స్‌లోకి భారీగా వర్షపు నీరు చేరుతుండటంతో అందులోని అపార్ట్‌మెంట్ వాసులు కిందకు వచ్చేందుకు అవకాశాలు లేని పరిస్థితి నెలకొంది.

ఎడతెరిపి లేకుండా వర్షం పడటంతో పలు కాలనీల్లో భారీగా వరద నీరు చేరుకోవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వర్షపు నీళ్లలో వెళ్తున్న ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మల్కాజ్‌గిరిలోని బండ్ల చెరువు పొంగి పొర్లుతుండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. పటేల్‌నగర్, దుర్గానగర్, సాయిపురి కాలనీల్లోకి భారీగా వరద నీరు చేరుతోంది.

జీహెచ్ఎంసీ కమిషనర్ సమీక్ష
హైదరాబాద్‌లో కురుస్తున్న భారీ వర్షాలపై జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్ధన్‌రెడ్డి సమీక్ష జరిపారు. ఈఈ, సర్కిల్ కమిషనర్లు ఫీల్డ్‌లో ఉండాలని కమిషనర్ ఆదేశించారు. ఎమర్జెన్సీ టీంలకోసం 040-21111111 నెంబర్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు.