నిప్పుల ‘సన్’డే

4 Apr, 2016 01:57 IST|Sakshi
నిప్పుల ‘సన్’డే

భానుడి భగభగలు.. రాష్ట్రంలో సెగలు
 సాక్షి, హైదరాబాద్/విశాఖపట్నం: రాష్ట్రం నిప్పుల కొలిమిలా మారింది. భానుడి భగభగలతో ఆదివారం రాష్ట్రంలో అనేకచోట్ల 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా నిర్మల్‌లో అత్యధికంగా 46.08 డిగ్రీలు, దండేపల్లిలో 45.05, వాంక్డిలో 45.08 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్‌లో 41.3, రామగుండంలో 41.8, నిజామాబాద్‌లో 43.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో దాదాపు 20 చోట్ల 43 డిగ్రీల కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడం గమనార్హం. మెట్‌పల్లిలో 43.76, పెద్దపల్లిలో 43.22, సారంగాపూర్‌లో 44.69, లింగంపల్లిలో 43.13 డిగ్రీలు నమోదయ్యా యి. మొత్తమ్మీద రాష్ట్రంలో 90 శాతానికిపైగా ప్రాంతాల్లో 40 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
 
 సాధారణం కంటే నాలుగైదు డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో తీవ్రమైన వడగాడ్పులు వీస్తున్నాయి. ఉదయం 10 గంటల తర్వాత బయటకు రావాలంటే జనం హడలిపోతున్నారు. వడగాడ్పుల నుంచి రక్షణ కోసం ప్రభుత్వం నామమాత్ర చర్యలు తీసుకుంటోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కొన్నిచోట్ల పాఠశాలలను కూడా తీవ్రమైన ఎండ వేడిమిలో నడిపిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. విద్యార్థులకు కనీసం ఫ్యాన్లు, మంచినీటి వసతి కూడా కల్పించడం లేదని చెబుతున్నారు.
 
 రేడియేషన్ ప్రభావం పదింతలు
 తీవ్రమైన ఎండ కారణంగా రేడియేషన్ ప్రభా వం ప్రజలపై తీవ్రంగా పడుతోంది. రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సంఘం విడుదల చేసిన వివరాల ప్రకారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య రేడియేషన్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. ఒక చదరపు మీటర్‌లో నమోదైన రేడియేషన్‌ను వాట్స్‌లో లెక్కిస్తారు. మహబూబ్‌నగర్ జిల్లా దామరగిడ్డలో ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటకు రాష్ట్రంలోనే గరిష్టంగా 662 వాట్స్ రేడియేషన్ నమోదైంది.
 
 ఆ తర్వాత అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లా ముధోల్‌లో 597 వాట్స్ నమోదైంది. సాధారణం కంటే రాష్ట్రంలో అనేకచోట్ల పదిం తలు ఎక్కువగా రేడియేషన్ నమోదవుతోంద ని తెలంగాణ వైద్య విద్యా మాజీ సంచాలకు డు, ప్రముఖ చర్మ వైద్య నిపుణుడు డాక్టర్ పుట్టా శ్రీనివాస్ ‘సాక్షి’కి తెలిపారు. రేడియేషన్‌తో చర్మానికి సంబంధించిన సమస్యలే కాకుండా కిడ్నీలపై ప్రభావం ఉంటుందని ఆయన చెప్పారు. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
 
 చల్లని కబురు
 మధ్యప్రదేశ్ నుంచి కర్ణాటక వరకు ఉపరితల ద్రోణి కొనసాగడంతో రానున్న రెండు, మూడ్రోజులపాటు తెలంగాణ, ఏపీల్లో అక్కడక్కడ తేలిక పాటి వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు గాని కురిసే అవకాశం ఉంది. భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఆదివారం రాత్రి విడుదల చేసిన నివేదికలో ఈ మేరకు తెలిపింది.
 
 ఏపీలోనూ భగభగలు
 ఏపీలోనూ శని, ఆదివారాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. అనంతపురం జిల్లా పుట్టపర్తిలో శనివారం రికార్డుస్థాయిలో 45.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆదివారం అనంతపురంలో 43.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కర్నూలులో 42, కడపలో 41, తిరుపతిలో 39.5 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆయా జిల్లాల్లోని వివిధ పట్టణాల్లో ఇంతకంటే అధికంగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. వైఎస్సార్ జిల్లా ఎర్రగుంటలో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కోస్తాంధ్రలోనూ పలుచోట్ల 38 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రేవతి కార్తెలోనే పరిస్థితి ఇలా ఉంటే రోహిణీ కార్తె(మే నెల)లో ఎండలు ఉంటాయోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
 
 జాగ్రత్తలు తప్పనిసరి
 ఎండల తీవ్రత పెరిగిన నేపథ్యంలో వడదెబ్బ తగలకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వారిస్తున్న సూచనలివీ..
 -    పిల్లలు, వయోవృద్ధులు, గుండెజబ్బు బాధితులు, ఇతర వ్యాధిగ్రస్తులు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల మధ్య బయటికి వెళ్లకపోవడం మంచిది.
 -    తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సివస్తే సాధ్యమైనంతవరకూ తలకు, ముఖానికి వేడి తగలకుండా జాగ్రత్తలు
 తీసుకోవాలి.
 -    లేత రంగు కాటన్ దుస్తులు ధరించడం మేలు.
 -    అధిక మోతాదులో మంచినీరు తాగాలి. వేడి వల్ల చెమట రూపంలో ఎక్కువ నీరు, ఉప్పు బయటికెళ్తాయి. అందువల్ల డీహైడ్రేషన్ కాకుండా ఉండటానికి ఉప్పు వేసిన నీటిని తీసుకోవాలి. ఎండ వల్ల పోయే శక్తిని తిరిగి పొందేందుకు, చల్లదనం కోసం పండ్ల రసాలు, మజ్జిగ, కొబ్బరి నీటితోపాటు తాజా పండ్లు తీసుకోవడం మంచిది.
 -    పొలాల్లో పనిచేసే వ్యవసాయ కూలీలు తప్పనిసరిగా తలపాగా ధరించాలి.
 -    నివాస ప్రాంతాన్ని సాధ్యమైన మేరకు చల్లగా ఉండేలా చూసుకోవాలి. కిటికీలకు వట్టివేళ్ల కర్టెన్లు లేదా గోనె పట్టలు వేలాడదీసి నీరు చల్లితే చల్లని గాలి వస్తుంది.
 

మరిన్ని వార్తలు