సంక్రాంతి ఎఫెక్ట్.. భారీగా ట్రాఫిక్ జాం

13 Jan, 2017 13:30 IST|Sakshi
సంక్రాంతి ఎఫెక్ట్.. భారీగా ట్రాఫిక్ జాం

హైదరాబాద్‌: సంక్రాంతి పండుగను పురస్కరించుకుని భాగ్యనగరం నుంచి గ్రామాలకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివెళ్తున్నారు. దీంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌ నుంచి ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాలకు వేల సంఖ్యలో వెళ్తున్న వాహనాలతో రద్దీ వాతావరణం కనిపిస్తోంది. దీంతో హైదరాబాద్‌-విజయవాడ హైవేపై నల్గొండజిల్లా చౌటుప్పల్‌ మండలం పంతంగి టోల్‌గేట్‌ దగ్గర భారీగా ట్రాఫిక్‌ జాం ఏర్పడింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పన్ను చెల్లించేందుకు వాహనాలు టోల్ ప్లాజాల వద్ద ఆగడంతో రద్దీ చాలా పెరిగిపోతుందని వాహనదారులు చెబుతున్నారు.

ఒకవైపు సొంత వాహనాలున్న వారు, మరోవైపు ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాల్లో ఆంధ్ర ప్రాంతాలకు వెళ్లే వారి సంఖ్య నేడు అధికంగా ఉంది. నేడు భోగి పండుగ కాగా, రేపు (శనివారం) మకర సంక్రాంతిని కుటుంబసభ్యులతో జరుపుకోవాలని ఇళ్లకు పయనమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఓవైపు నగరం ఖాళీ అవుతుంటే.. పండక్కి గ్రామాలకు వెళ్లేవారితో టోల్ ప్లాజాల వద్ద వాహనాలు బారులు తీరుతున్నాయి.

మరిన్ని వార్తలు