హెల్మెట్ పెట్టుకోవాల్సిందే..

30 Dec, 2015 01:58 IST|Sakshi
హెల్మెట్ పెట్టుకోవాల్సిందే..

⇒ ప్రస్తుతం ఆ నిబంధన అమలులోనే ఉంది
⇒ ధరించకుంటే రూ.100 జరిమానా
⇒ మరోసారి ఉల్లంఘనకు పాల్పడితే
⇒ రూ. 300 ఫైన్ స్పష్టం చేసిన హైదరాబాద్, సైబరాబాద్ ట్రాఫిక్ అధికారులు


 సాక్షి, హైదరాబాద్: ద్విచక్ర వాహనచోదకులు కచ్చితంగా హెల్మెట్ ధరించాల్సిందే అని హైదరాబాద్, సైబరాబాద్ ట్రాఫిక్ విభాగాల అధికారులు స్పష్టం చేశారు. మోటారు వాహనాల చట్టంలో ఉన్న ఈ నిబంధన ప్రస్తుతం అమలులోనే ఉందని, ఉల్లంఘించిన వారికి రూ.100 జరిమానా విధిస్తున్నామని పేర్కొన్నారు. అదే వ్యక్తి మరోసారి ఉల్లంఘనకు  పాల్పడినట్లు తేలితే ఈ జరిమానా రూ.300 వరకు విధించే అవకాశం ఉందని తెలిపారు. హెల్మెట్ ధరించని, నిషేధిత స్థలాల్లో వాహనాలు పార్కింగ్ చేసిన 300 మంది వాహనచోదకులకు మంగళవారం గోషామహల్‌లోని ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్(టీటీఐ)లో హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ ఏవీ రంగనాథ్ నేతృత్వంలో కౌన్సెలింగ్ నిర్వహించారు.

 రోజుకొకరు చనిపోతున్నారు..: హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడపటం వల్ల హైదరాబాద్‌లో రోజుకొకరు చొప్పున మృత్యువాత పడుతుండగా.. నలుగురైదుగురు క్షతగాత్రులవుతున్నారని రంగనాథ్ చెప్పారు. మృత్యువాత పడుతున్న వారిలో దేశానికి వెన్నెముకగా నిలవాల్సిన 20 నుంచి 40 ఏళ్ల వయసువారే అధికంగా ఉంటున్నారన్నారు. వాహనచోదకుల సంక్షేమం కోసమే ట్రాఫిక్ పోలీసు విభాగం పని చేస్తోందని రంగనాథ్ చెప్పారు. టూవీలర్స్ డ్రైవ్ చేసే వ్యక్తి కచ్చితంగా హెల్మెట్ ధరించాలనే నిబంధన మోటారు వాహనాల చట్టంలోనే పొందుపరిచి ఉందని, ఆ చట్టం అమలులోకి వచ్చినప్పటి నుంచి ఈ నిబంధనా అమలులో ఉన్నట్లే అని నగర ట్రాఫిక్ చీఫ్ జితేందర్ చెప్పారు.

దీనికోసం ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేకంగా ప్రకటన చేయాల్సిన అవసరం లేదన్నారు. అతిక్రమించిన వారికి జరిమానా విధిస్తున్నామని, ఇటీవల న్యాయస్థానం దృష్టికీ ఈ విషయాన్ని తీసుకువెళ్ళామని చెప్పారు. కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది 70 వేల కేసులు నమోదు చేశామని, వాహనచోదకుల్లో అవగాహన కోసం మూడు లక్షల కరపత్రాలు, పోస్టర్లు ముద్రించి ప్రచారం చేస్తున్నామని సైబరాబాద్  ట్రాఫిక్ చీఫ్ అవినాష్ మహంతి స్పష్టం చేశారు.
 

>
మరిన్ని వార్తలు