ఇక్కడ అందరూ ఆత్మీయులే..

28 Jul, 2014 00:16 IST|Sakshi
ఇక్కడ అందరూ ఆత్మీయులే..

ఆమె గొంతు కోకిలలనే సవాలు చేస్తుంది. ఆమె పాట స్వర‘చిత్ర’ విన్యాసంతో శ్రోతలను ఉర్రూతలూగిస్తుంది. మూడు దశాబ్దాలుగా పాటలు పాడుతున్నా, తరగని మాధుర్యం ఆమె సంగీతానిది. ఆబాల గోపాలాన్ని తన గాత్రంతో మైమరపిస్తున్న గాయని చిత్ర శనివారం పుట్టినరోజు జరుపుకున్నారు. రవీంద్ర భారతిలో ఆదివారం ఓ భక్తి ఆల్బమ్ ఆవిష్కరించిన ఆమె  ‘సిటీప్లస్’తో కొద్దిసేపు ముచ్చటించారు. విశేషాలు ఆమె మాటల్లోనే..
 
కేరళ రాజధాని తిరువనంతపురంలో 1963 జూలై 27న పుట్టాను. అక్కడే పెరిగాను. ఈసారి పుట్టినరోజున తిరువనంతపురాన్ని మిస్ అవుతున్నా, ఇక్కడ హైదరాబాద్‌లో నా ఆత్మీయులైన సునీతా బాలాజీ, రావు బాలసరస్వతీదేవి, జానకమ్మల మధ్య జరుపుకొంటున్నందుకు ఆనందంగా ఉంది. హైదరాబాద్‌తో నాది విడదీయలేని బంధం. ఇక్కడకొస్తున్నానంటేనే చాలా సంతోషంగా ఉంటుంది. ఇక్కడి గాయనీ గాయకులందరూ నాకు అక్కచెల్లెళ్లు, అన్నదమ్ముల్లాంటి వాళ్లు. వాళ్ల ఆప్యాయతానురాగాలు వెలకట్టలేనివి. అందుకే తరచు వస్తుంటాను. ఇక్కడి వాతావరణం, తెలుగుదనం నన్ను కట్టిపడేస్తుంటాయి.

శాస్త్రీయ సంగీతం నేర్చుకోవడం మంచిది...

నా కెరీర్ తొలినాళ్లకు ఇప్పటికీ చాలా తేడాలొచ్చాయి. ఇప్పుడంతా టెక్నాలజీ మహిమే. అది ఈ తరం గాయనీ గాయకులకు పాడటాన్ని సులభతరం చేస్తుంది. ఇది మంచి పరిణామమే. అయితే, పాటలో లిరిక్స్‌ని బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ డామినేట్ చేస్తోంది. దీనివల్ల వాయిస్ ప్రాధాన్యం తగ్గుతోంది. చాలామంది డెరైక్టర్స్ చెబుతుంటే విన్నా... కొత్తతరంలో డెడికేషన్ లేదని. ఏ పనికైనా కమిట్‌మెంట్, డెడికేషన్ ముఖ్యం. అవి ఉంటేనే రాణిస్తాం. పబ్లిక్ ఫంక్షన్స్‌లో ఎవరైనా కొత్త గాయనీగాయకులు పాడినప్పుడు ఏవైనా తప్పులుంటే, వెంటనే కరెక్షన్స్ చెబుతాను. లేట్‌నైట్ ప్రోగ్రామ్స్‌కి, దూరప్రయాణాలకు దూరంగా ఉంటేనే మంచిదని నా సూచన. ఇక సింగర్స్ కావాలనుకునే వాళ్లు ముందుగా శాస్త్రీయ సంగీతం నేర్చుకోవడం మంచిదని నా అభిప్రాయం.

స్టేజ్ షోస్‌లో కంఫర్ట్‌గా ఫీలవను...

స్టేజ్ షోస్ అంటే అంత కంఫర్ట్‌గా ఫీలవను. స్టేజ్ అంటే డెరైక్ట్‌గా శ్రోతలను చూస్తూ పాడాలి. సాధారణంగా కొన్ని సౌండ్స్ టెన్షన్ కలిగిస్తాయి. అందుకే నేను స్టేజ్ మీద పాడుతుంటే కొంత అనీజీగా అనిపిస్తుంది. ఇక సహ గాయనీ గాయకులతో పాడటం అరుదనే చెప్పాలి. ఎప్పుడో ఇలా షోల్లో కలుసుకోవడం, సీడీ రిలీజ్ కార్యక్రమాల్లో పాడటమే. అయితే, ఇది అటు నా ముందు తరం వారితో పాడే అవకాశాన్ని, ఇటు నా తర్వాతి తరం వారితో గొంతు కలిపే అవకాశం ఇస్తోంది. దీనివల్ల నాకు రెండు తరాల వారితోనూ ఫ్రెండ్‌షిప్ ఏర్పడుతోంది.    

కోన సుధాకర్ రెడ్డి
 
 

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా