ఓయూలో నిర్వహించేలా ఆదేశాలివ్వండి

2 Jan, 2018 03:29 IST|Sakshi

ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ సమావేశాలపై హైకోర్టులో పీహెచ్‌డీ విద్యార్థుల పిల్‌

ప్రభుత్వ తప్పుడు నివేదికల వల్ల గొప్ప అవకాశం కోల్పోయాం

సాక్షి, హైదరాబాద్‌: ప్రతిష్టాత్మక ‘ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌’ సమావేశాలను ముందుగా నిర్ణయించిన విధంగా ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ)లో నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వడంతోపాటు, ఈ సమావేశాలకు పూర్తి సహాయ సహకారాలు అందించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలైంది.

ఈ సమావేశాలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన, నిధులు విడుదల చేయడంలో విఫలమైన రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వానికి తప్పుడు నివేదికలు ఇచ్చిందని, దీనివల్ల ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ సమావేశాలు మరో చోటుకు తరలిపోయాయంటూ పీహెచ్‌డీ విద్యార్థులు కిరణ్‌కుమార్, విజయకుమార్‌లు హైకోర్టులో ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం, ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ కార్యదర్శి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ ముఖ్యకార్యదర్శి, ఓయూ వీసీ, డీజీపీ, నగర పోలీస్‌ కమిషనర్‌లను ప్రతివాదులుగా పేర్కొన్నారు.

రూ.50 కోట్లు వెచ్చించి ఓయూలో ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ సమావేశాలకు యూనివర్సిటీ అన్ని ఏర్పాట్లు చేసిందని, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ తీరు వల్ల ఆ డబ్బు, శ్రమ, విద్యార్థుల ప్రయోజనాలు అన్నీ బూడిదలో పోసిన పన్నీరు అయ్యాయని పిటిషనర్లు తెలిపారు. ప్రభుత్వ వ్యవహారశైలితో యూనివర్సిటీ ప్రతిష్ట కూడా దెబ్బతిన్నదని వివరించారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో వస్తున్న మార్పులపై చర్చించేందుకు గత 70 సంవత్సరాలుగా ప్రతి ఏడాదీ ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ సమావేశాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు.

షెడ్యూల్‌ ప్రకారం ఈనెల 3 నుంచి 7 వరకు ఓయూలో జరగాల్సి ఉందన్నారు. ఈ సమావేశాల్లో పాల్గొనేందుకు దాదాపు 13వేల మంది శాస్త్రవేత్తలు రిజిష్టర్‌ చేసుకున్నారని తెలిపారు. ఈ సమావేశాల వల్ల యూనివర్సిటీకి దాదాపు రూ.300 కోట్ల మేర ఆర్థిక ప్రయోజనం ఉండేదని, ప్రభుత్వ తీరు వల్ల ఈ గొప్ప అవకాశం చేజారిపోయిందని పిటిషనర్లు వ్యాజ్యంలో పేర్కొన్నారు.

>
మరిన్ని వార్తలు