మూసీ కినారే.. కానూన్ హవేలీ

24 Nov, 2014 00:08 IST|Sakshi
మూసీ కినారే.. కానూన్ హవేలీ

మూసీ నదీ తీరంలో, నయాపూల్ బ్రిడ్జికి దగ్గర్లో, ఎరుపు-తెలుపు రంగుల్లో ఉన్న రాష్ట్ర హైకోర్టు భవనం గంభీరంగా ఎంతో హుందాగా కన్పిస్తుంది. మతసామరస్యానికి ప్రతీకగా అన్నట్లు హైకోర్టు భవనంపై ‘రాం-రహీం’ అని రాసి ఉన్నాయి. రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన శంకర్‌లాల్ హైకోర్టు భవనానికి ప్లాన్‌ను రూపొందించగా, ఏడో నిజాం మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ ఆస్థానంలోని ఇంజనీర్, మెహెర్ అలీ ఫజల్ పర్యవేక్షణలో నిర్మాణం పూర్తయింది. 1915 ఏప్రిల్ 15న హైకోర్టు భవనానికి శంకుస్థాపన  జరిగింది. నాలుగేళ్లకు అంటే 1919 మార్చి 31 నాటికి ఈ నిర్మాణ ం పూర్తయింది. 1920 ఏప్రిల్ 20న ఏడో నిజాం ఈ భవనాన్ని లాంఛనంగా ప్రారంభించారు.
 
చల్లని నీడలో లా..

ఇక్కడ ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఉంది. హైకోర్టు భవన నిర్మాణం కోసం పునాదులు తవ్వుతుండగా.. కుతుబ్‌షా రాజులు నిర్మించిన హీనా మహల్-నాడీ మహల్ తాలుకా అవశేషాలు బయల్పడ్డాయని చరిత్రకారులు తమ రచనలలో పేర్కొన్నారు. ఏడో నిజాం పరిపాలనకు 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 1937లో జరిగిన సిల్వర్ జూబ్లీ వేడుకల సమయంలో నిజాం ప్రభువుకు సుమారు వంద కిలోల బరువున్న వెండితో చేసిన హైకోర్టు భవన నమూనాను వెండి తాళం చెవితో సహా బహూకరించారు. ఈ నమూనా నేటికీ పురానీ హవేలీలోని నిజాం మ్యూజియంలో భద్రంగా ఉంది. విశాలమైన కోర్టు గదులు, భవనం చుట్టూ ఎత్తయిన వృక్షాలతో చల్లని నీడలో ఉన్న హైకోర్టు భవనం సందర్శకులను ఆకట్టుకుంటోంది.

సమన్యాయం..

1956 నవంబర్ 1న హైదరాబాద్ రాజధానిగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు కొత్త రాష్ట్రం హైకోర్టును ఇదే భవనంలో కొనసాగించారు. 1956 నవంబర్ 5 నుంచి ఏపీ హైకోర్టు పనులు ప్రారంభం అయ్యాయి. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 2005 నవంబర్‌లో అదే భవన ప్రాంగణంలో స్వర్ణోత్సవాలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత హైకోర్టు ప్రాధాన్యం మరింత పెరిగింది. ఇటు తెలంగాణకు, అటు ఆంధ్రప్రదేశ్‌కు ఈ భవనమే
 హైకోర్టుగా భాసిల్లుతోంది.

మరిన్ని వార్తలు