దుర్గం చెరువు ఆక్రమణలపై హైకోర్టు ఆందోళన

4 Jun, 2016 19:57 IST|Sakshi

హైదరాబాద్ : దుర్గం చెరువులో ఆక్రమణలు పెరిగిపోతుండటంపై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఆక్రమణలతో దుర్గం చెరువుకు జరుగుతున్న నష్టంపై సవివర నివేదిక సమర్పించాలని గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ), హైదరాబాద్ పట్టణాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) తదితరులను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ ఎ.శంకరనారాయణలతో కూడిన ధర్మాసనం రెండు రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. దుర్గం చెరువు దుర్గతిపై 2009లో పత్రికల్లో ప్రచురితమైన వార్తా కథనాలను హైకోర్టు తనంతట తానుగా (సుమోటో) ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)గా పరిగణించింది.

ఇదే అంశంపై కెప్టెన్ జె.రామారావు కూడా 2008 ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ రెండు వ్యాజ్యాలను సంయుక్తంగా ఇప్పటికే పలుమార్లు విచారించిన హైకోర్టు తాజాగా వీటిపై మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా.. దుర్గం చెరువు దుస్థితి ధర్మాసనం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికైనా మేలుకోకపోతే చెరువుల మనుగడు సాధ్యం కాదన్న హైకోర్టు, దుర్గం చెరువు పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలను వివరించాలంది. దుర్గం చెరువు చుట్టూ వెలసిన ఆక్రమణలు ఎన్ని... చెరువులోకి విడుదలవుతున్న వ్యర్థాలు.. అందుకు బాధ్యతలు ఎవరు తదితర వివరాలతో నివేదికలను తమ ముందుంచాలని జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏలను ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

మరిన్ని వార్తలు