ట్రిబ్యునల్‌ తీర్పులంటే లెక్కలేదా: హైకోర్టు

7 Sep, 2017 02:56 IST|Sakshi
ట్రిబ్యునల్‌ తీర్పులంటే లెక్కలేదా: హైకోర్టు
- తీర్పుని అమలు చేయని అధికారులపై చర్యలు తీసుకోండి 
- ఇరురాష్ట్రాలకు హైకోర్టు ఆదేశాలు 
- ఇల్లందు మున్సిపల్‌ ఉద్యోగి హోదా తగ్గింపు పిటిషన్‌పై విచారణ 
 
సాక్షి, హైదరాబాద్‌: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆంధ్రప్రదేశ్‌ పరిపాలనా ట్రిబ్యునల్‌ (ఏపీఏటీ) ఇచ్చిన తీర్పుని అమలు చేయని అధికారులపై చర్యలు తీసుకోవాలని ఏపీ, తెలంగాణ రాష్ట్రాలను ఉమ్మడి హైకోర్టు ఆదేశించింది. ట్రిబ్యునల్‌ ఉత్తర్వులను అమలు చేయకపోవడానికి సరైన న్యాయపరమైన కారణాలు ఉంటే వేరే విషయమని, అయితే నిర్లక్ష్యం కారణంగా అమలు చేయని అధికారులపై చర్యలు తీసుకోవడమే సరైందని హైకోర్టు అభిప్రాయపడింది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మున్సిపాలిటీలో అకౌంటెంట్‌గా పనిచేసే విజయానంద్‌ ఇతర సిబ్బందితో కలసి అక్రమాలకు పాల్పడ్డారన్న కారణంతో ఆయన హోదాను సీనియర్‌ అసిస్టెంట్‌ స్థాయికి తగ్గించడం చెల్లదని ఐదేళ్ల క్రితం ట్రిబ్యునల్‌ తీర్పునిచ్చింది. దీనిని అధికారులు అమలు చేయకపోవడంతో విజయానంద్‌ హైకోర్టులో రిట్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తులు సీవీ నాగార్జునరెడ్డి, జి.శ్యాంప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ జరిపి తెలుగు రాష్ట్రాలకు సూచన చేసింది. ట్రిబ్యునల్‌ ఉత్తర్వులను అమలు చేయని అధికారుల జీతాల నుంచి పిటిషనర్లకు కోర్టు ఖర్చు చెల్లించే ఉత్తర్వులు ఇవ్వాల్సివస్తుందని ధర్మాసనం హెచ్చరించింది.

ట్రిబ్యునల్‌ ఉత్తర్వులను అమలు చేయకపోతే ఈ తరహా వ్యాజ్యాలు దాఖలవుతూనే ఉంటాయని.. కక్షిదారుడు కింది కోర్టులో గెలిచి కూడా కేసు ఓడిపోయిన వాడి మాదిరిగా హైకోర్టుకు రావాల్సిన పరిస్థితులకు బాధ్యులైన అధికారులపై చర్యలు ప్రారంభించాలని ధర్మాసనం తేల్చి చెప్పింది. కాగా ఈ కేసులో ట్రిబ్యునల్‌ అదేశాలను అమలు చేసినట్లు తెలంగాణ పురపాలక శాఖ డైరెక్టర్‌ టి.కె.శ్రీదేవి కోర్టుకు చెప్పారు. అంతకుముందు ట్రిబ్యునల్‌ ఆదేశాల సమాచారం తన దృష్టికి రాకపోవడం వల్లే అమలులో జాప్యానికి కారణమని వివరించారు.   
మరిన్ని వార్తలు