అక్కాచెల్లెళ్ల హత్య కేసు నిందితునికి చుక్కెదురు

4 Nov, 2015 19:58 IST|Sakshi

అమిత్ బెయిల్ పిటిషన్‌ను కొట్టేసిన హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అక్కాచెల్లెళ్లు సింగిరెడ్డి యామినీ సరస్వతి, శ్రీలేఖల హత్య కేసులో నిందితుడు అమిత్ కుమార్ సింగ్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. బెయిల్ కోసం అతను దాఖలు చేసుకున్న పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టేసింది. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ డి.రామిరెడ్డి వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో మంగళవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఇంటర్ చదువుతున్న సమయంలో శ్రీలేఖ, అమిత్ స్నేహితులు. కొన్నాళ్లకు అమిత్ ప్రేమిస్తున్నానంటూ శ్రీలేఖ వెంటపడటం ప్రారంభించాడు.

పెద్దల జోక్యంతో శ్రీలేఖ అతని ప్రేమను తిరస్కరించి మాట్లాడటం మానేసింది. దీంతో అమిత్ ఆమెపై కక్ష పెంచుకున్నాడు. ఈ ఏడాది జూలైలో ఆమె తల్లిదండ్రులు ఉద్యోగరీత్యా బయటకు వెళ్లిన సమయంలో శ్రీలేఖ ఇంటికి వెళ్లాడు. అతన్ని ఇంటి నుంచి వెళ్లిపోవాలని శ్రీలేఖ కోరింది. మాట్లాడేందుకు సైతం ఆమె ఇష్టపడకపోవడంతో తన వెంట తెచ్చుకున్న కత్తితో అమిత్ శ్రీలేఖ కడుపు, గుండె, భుజాల్లో విచక్షణారహితంగా పొడిచాడు.
 
శ్రీలేఖ అరుపులు విని బయటకు వచ్చిన ఆమె సోదరి యామినిని సైతం విచక్షణారహితంగా పొడిచాడు. ఇరుగు పొరుగువారు రావడంతో పారిపోయాడు. స్థానికులు వెంటనే అక్కాచెల్లెళ్లను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ వారు మరణించారు. ఈ జంట హత్యలపై చైతన్యపురి పోలీసులు కేసు నమోదు చేశారు. విస్తృత గాలింపు తర్వాత అమిత్ సింగ్‌ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. బెయిల్ కోసం అతను దాఖలు చేసిన పిటిషన్‌ను పదకొండో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు తోసిపుచ్చింది.
 
కింది కోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ అతను హైకోర్టులో బెయిల్ పిటిషన్‌ను దాఖలు చేశారు. దీనిని న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో మంగళవారం విచారించారు. పోలీసుల తరఫున అదనపు పీపీ రామిరెడ్డి వాదనలు వినిపిస్తూ అక్కాచెల్లెళ్లను నిందితుడు అత్యంత కిరాతకంగా హత్య చేశాడని, శ్రీలేఖ ఒంటిపై 17 చోట్ల కత్తిపోట్లు ఉన్నాయని కోర్టుకు నివేదించారు. పక్కా పథక రచనతోనే హత్యలు చేశాడని తెలిపారు. హత్య తర్వాత పారిపోయిన అమిత్, ఇప్పుడు బెయిల్ ఇస్తే మరోసారి పారిపోయే అవకాశం ఉందని, సాక్షులను, ఫిర్యాదుదారులను బెదిరించే అవకాశం ఉందని తెలిపారు. ఈ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి అమిత్ బెయిల్ పిటిషన్‌ను కొట్టేశారు.

మరిన్ని వార్తలు