కల్తీ పాల వ్యవహారంపై హైకోర్టు విచారణ 

27 Jan, 2018 03:14 IST|Sakshi

సాక్షి కథనంపై స్పందన  

‘పాలు కాదు.. పచ్చి విషం’కథనంపై  హైకోర్టుకు పాఠకుడి లేఖ 

ప్రజాహిత వ్యాజ్యంగా విచారణకు స్వీకరణ  

ఈ నెల 30న విచారణ 

సాక్షి, హైదరాబాద్‌: కల్తీ పాలపై ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై ఉమ్మడి హైకోర్టు స్పందించింది. ‘పాలు కాదు.. పచ్చి విషం’శీర్షికతో సాక్షి పత్రికలో గత ఏడాది డిసెంబర్‌ 12న ప్రచురితమైన కథనాన్ని హైకోర్టు ప్రజాప్రయోజన వ్యాజ్యంగా (పిల్‌) పరిగణనలోకి తీసుకుంది. సాక్షి కథనాన్ని చదివిన నల్లగొండకు చెందిన పాఠకుడు కె.నర్సింహారావు లేఖ రూపంలో కల్తీ విషయాన్ని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్‌ దృష్టికి తీసుకొచ్చారు. కాగా, ఈ వ్యాజ్యంలో పశు సంవర్ధక, డెయిరీ డెవలప్‌మెంట్‌ శాఖ ముఖ్య కార్యదర్శి, డెయిరీ డెవలప్‌మెంట్‌ లిమిటెడ్‌ ఎండీ, ఫుడ్‌ సేఫ్టీ లేబొరేటరీ చీఫ్‌ పబ్లిక్‌ అనలిస్ట్‌ను ప్రతివాదులుగా చేర్చారు. ఈ వ్యాజ్యంపై ఈ నెల 30న ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరపనుంది.  

వెలుగులోకి తెచ్చిన ‘సాక్షి’ 
గ్రేటర్‌ హైదరాబాద్‌లో సాక్షి బృందం పర్యటించి పలు కంపెనీల పాల ప్యాకెట్ల శాంపిల్స్‌ను సేకరించింది. వాటిని నాచారంలోని రాష్ట్ర ప్రభుత్వ ఆహార పరీక్షా కేంద్రంలో పరీక్షలు చేయించింది. ఈ పాలు హానికరమని, ప్రజారోగ్యాన్ని దెబ్బతీసే రసాయనాలను పాలల్లో కలుపుతున్నారని పరీక్షల్లో తేలింది. ‘ఇలాంటి పాలను వినియోగిస్తే టైఫాయిడ్, డయేరియా, గ్యాస్ట్రో ఎంటరైటిస్‌.. వంటి రోగాల బారినపడే ప్రమాదం ఉంది’అని సాక్షి కథనంలో వచ్చిన అంశాలను పిటిషనర్‌ తన లేఖలో పేర్కొన్నారు.

>
మరిన్ని వార్తలు