ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదు?

25 Nov, 2015 02:14 IST|Sakshi
ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదు?

 వివరణ ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వం, వర్సిటీలకు హైకోర్టు నోటీసులు
 విచారణ ఆరు వారాలకు వాయిదా

సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని విశ్వవిద్యాలయాలు, కాలేజీల్లో విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహించకపోవడంపై హైకోర్టు స్పందించింది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి, పలు యూనివర్సిటీలకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.రవికుమార్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఉత్తర్వుల ప్రకారం అన్ని వర్సిటీలు, కాలేజీల్లో విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని, ఆ దిశగా ప్రభుత్వంగానీ, వర్సిటీలుగానీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ హైదరాబాద్‌కు చెందిన సయ్యద్ వలీలుల్లా ఖాప్రీతోపాటు మరో నలుగురు వ్యక్తులు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు.
 

మరిన్ని వార్తలు