రథయాత్రకు అనుమతి నిరాకరణపై నేడు తీర్పు

22 Mar, 2018 01:06 IST|Sakshi

వెలువరించనున్న హైకోర్టు

సాక్షి, హైదరాబాద్‌: ఉగాది నుంచి హనుమజ్జయంతి వరకు తాము తలపెట్టిన శ్రీరామ రథయాత్రకు పోలీసులు అనుమతిని నిరాకరించడాన్ని సవాలు చేస్తూ విశ్వహిందూ పరిషత్‌(వీహెచ్‌పీ) తెలంగాణ కార్యదర్శి ఎం.గాల్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై బుధవారం న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.సీతారామమూర్తి విచారణ జరిపారు. వీహెచ్‌పీ కార్యకలాపాలను అడ్డుకునే ఉద్దేశంతోనే పోలీసులు రథయాత్రకు అనుమతిని నిరాకరించారని పిటిషనర్‌ తరఫు న్యాయవాది ఎన్‌.హరినాథ్‌రెడ్డి అన్నారు.

కోర్టు షరతులు విధిస్తే వాటికి అనుగుణంగా యాత్రను శాంతియుతంగా కొనసాగిస్తామని తెలిపారు. ఈ నెల 18న బాసర నుంచి యాత్రను ప్రారంభించి 31న సికింద్రాబాద్‌ తాడ్‌బండ్‌ హనుమాన్‌ దేవస్థానం వద్ద ముగించేలా ప్రణాళిక సిద్ధం చేసుకున్నామని చెప్పారు. ఈ మేరకు పోలీసుల అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నామని చెప్పారు. హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా గ్రామీణ యువతలో అవగాహన కల్పించేందుకు ఈ యాత్రను చేపడుతున్నామని వివరించారు.

అయితే, పోలీసులు శాంతిభద్రతలను, ప్రస్తుతం విద్యార్థులకు జరుగుతున్న వార్షిక పరీక్షలను కారణంగా చూపుతూ అనుమతి నిరాకరించారని, కానీ అసలు ఉద్దేశం వీహెచ్‌పీ కార్యకలాపాలను అడ్డుకోవడమేనని వివరించారు. ఈ సమయంలో న్యాయమూర్తి స్పందిస్తూ, ఈ యాత్రలో ఎంత మంది పాలుపంచుకుంటారు? ఎన్ని వాహనాలుంటాయి? అని ప్రశ్నించగా జనం అనుసరించే యాత్ర కాదని, ఈ యాత్రలో గరిష్టంగా పది మంది ఉంటారని, యాత్ర ఒక్కో ఊరికి చేరుకోగానే ఆ ఊరి ప్రజలు యాత్రలో పాల్గొని వెళ్లిపోతుంటారని హరినాథ్‌ చెప్పారు.

అయితే, ఈ యాత్ర వల్ల శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశముందని ఇంటెలిజెన్స్‌ వర్గాల నుంచి సమాచారం అందిందని పోలీసుల తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎస్‌.శరత్‌కుమార్‌ తెలిపారు. మైనారిటీల్లో భయాందోళలను సృష్టించేందుకే ఈ యాత్ర చేపడుతున్నారని తెలిపారు. జిల్లాలు, డివిజన్ల వారీగా సమా చారం తెప్పించుకోవాల్సిన అవసరముందని, దీనిని విశ్లేషించాక పూర్తి వివరాలను కోర్టు ముందుంచగలనని చెప్పారు. కౌంటర్‌ దాఖలు చేసే వరకు ఎటువంటి ఉత్తర్వులు ఇవ్వొద్దని అభ్యర్థించారు. వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును గురువారం వెలువరిస్తానని ప్రకటించారు.   

మరిన్ని వార్తలు