అమెరికా న్యాయస్థానం ఉత్తర్వులున్నా..ఇక్కడి కోర్టులు విచారించొచ్చు

29 Oct, 2016 03:12 IST|Sakshi
అమెరికా న్యాయస్థానం ఉత్తర్వులున్నా..ఇక్కడి కోర్టులు విచారించొచ్చు

ఎన్నారై కేసులో స్పష్టం చేసిన హైకోర్టు
 
 సాక్షి, హైదరాబాద్: ఎన్నారై దంపతులకు చెందిన పిల్లల సంరక్షణపై అమెరికా కోర్టులు ఇచ్చే ఉత్తర్వుల అమల్లో తీవ్ర జాప్యం జరిగినప్పుడు ఆ వివాదానికి సంబంధించిన కేసులను విచారించే పరిధి భారత్‌లోని కోర్టులకు ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. ఎన్నారై అరవింద్ గోపాలకృష్ణ కేసులో జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్, జస్టిస్ ఎం.సీతారామ్మూర్తిలతో కూడిన ధర్మాసనం తాజాగా ఈ మేరకు తీర్పు వెలువరించింది. తన భార్య తనకు చెప్పకుండా అమెరికా నుంచి పిల్లలను భారత్‌కు తీసుకొచ్చిందని, దీనిపై అమెరికా కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను పట్టించుకోలేదని, అందువల్ల పిల్లలను తనకు అప్పగించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ గోపాలకృష్ణ వేసిన పిటిషన్‌ను కొట్టేసింది.

 ఇదీ నేపథ్యం..: అరవింద్ గోపాలకృష్ణ, సునీతరాణికి 2002లో వివాహమైంది. అమెరికాకు వెళ్లిన తర్వాత వీరికి 2005లో కాష్వీ, 2011లో క్రిష్ జన్మించారు. మనస్పర్థలతో 2013లో సునీత పిల్లలతో సహా హైదరాబాద్‌కు తిరిగి వ చ్చారు. దీనిపై అరవింద్ అదే ఏడాది అమెరికా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 2014లో అక్కడి కోర్టు పిల్లలను కస్టడీకి తీసుకోవాలని ఆదేశాలిచ్చింది. సునీతకు ఆ కోర్టు ఉత్తర్వులు గురించి తెలియదు.  తన పిల్లలను కోర్టు ముందు హాజరుపరిచి, వారిని తన సంరక్షణకు అప్పగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ అరవింద్ గత ఏడాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అమెరికా కోర్టు ఉత్తర్వులున్నందున వాటిని అమలు చేయాలని కోరారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన ధర్మాసనం.. అమెరికా కోర్టు 2014లో ఉత్తర్వులు జారీ చేస్తే దాని అమలు కోసం చర్యలు తీసుకోవడంలో అరవింద్ తీవ్ర జాప్యం చేశారని తేల్చింది.

అమెరికా కోర్టు ఉత్తర్వులున్నా.. ఆ వివాదానికి సంబంధించి వ్యాజ్యాన్ని విచారించే అధికారం ఇక్కడి కోర్టులకు ఉంటుందని స్పష్టం చేసింది. అంతేకాక క్వాష్వీ, క్రిష్‌లు హైదరాబాద్‌కు వచ్చి ఇక్కడి వాతావరణానికి అలవాటుపడ్డారని, ఇక్కడే చక్కగా చదువుకుంటున్నారని తెలిపింది. వారితో మాట్లాడినప్పుడు వారు కూడా ఇదే విషయాన్ని చెప్పారని, అమెరికా వెళ్లేందుకు వారు సుముఖత వ్యక్తం చేయడం లేదని వివరించింది. అందువల్ల వారు తల్లి సంరక్షణలో ఉండటం మేలని పేర్కొంది. వారిని కలుసుకునే హక్కులు కావాలంటే సంబంధిత కోర్టును ఆశ్రయించి ఉత్తర్వులు పొందవచ్చునని అరవింద్‌కు స్పష్టం చేసింది.

మరిన్ని వార్తలు