రోణంకి గోపాలకృష్ణకు హైకోర్టు నోటీసులు

28 Jun, 2017 01:22 IST|Sakshi
రోణంకి గోపాలకృష్ణకు హైకోర్టు నోటీసులు
- కేంద్రం, యూపీఎస్‌సీ, ఏపీ సర్కార్‌లకు కూడా
పూర్తి వివరాలను తమ ముందుంచాలని ఆదేశం
 
సాక్షి, హైదరాబాద్‌: సివిల్‌ సర్వీసెస్‌–2016 పరీక్షల్లో తప్పుడు అంగవైకల్య ధ్రువీకరణ పత్రం సమర్పించి వికలాంగుల కోటాలో ర్యాంకు సాధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రోణంకి గోపాలకృష్ణకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. గోపాలకృష్ణ తప్పుడు అంగవైకల్య ధ్రువీకరణ పత్రం వ్యవహా రంలో పూర్తి వివరాలను కౌంటర్ల రూపంలో తమ ముందుంచాలని కేంద్ర సిబ్బంది శిక్షణ వ్యవహారా లశాఖ కార్యదర్శి, యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్‌సీ) సంయుక్త కార్యదర్శి, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తదితరులను ఆదేశిం చింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.

ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్‌ తెల్లప్రోలు రజనీ లతో కూడిన ధర్మాస నం మంగళవారం ఉత్త ర్వులు జారీ చేసింది. సివిల్‌ సర్వీసెస్‌ పరీ క్షలో తప్పుడు అంగ వైకల్య ధ్రువీకరణ పత్రంతో లబ్ధి పొందడం వల్లే గోపాలకృష్ణ జాతీయ స్థాయిలో మూడో ర్యాంకు సాధించారని, దీనిపై విచారణకు ఆదేశించాలని కోరుతూ సికింద్రాబాద్‌ కు చెందిన న్యాయవాది ఎం.మురళీకృష్ణ హైకోర్టు లో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై మంగళవారం ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్‌ మురళీకృష్ణ స్వయం గా వాదనలు వినిపిస్తూ, అంగవైకల్యం లేనప్పటికీ తప్పుడు సర్టిఫికెట్‌ సమర్పించి వికలాంగుల కోటా కింద ఉత్తీర్ణత సాధించి ర్యాంకు పొందారని తెలిపారు. దీనిపై పత్రికల్లో కూడా కథనాలు  వచ్చాయన్నారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ... పత్రికా కథనాలను పరిగణనలోకి తీసుకోబోమని స్పష్టం చేసింది.

గోపాలకృష్ణ ఓబీసీకి చెందిన వారని, ఈ కేటగిరీ కింద 110.66 అర్హత మార్కులని మురళీకృష్ణ తెలిపారు. గోపాలకృష్ణ కేవలం 91.34 మార్కులు సాధించారని, వికలాంగుల కోటాలో 75.34 అర్హత మార్కులని తెలిపారు. ఓబీసీ కింద అర్హత మార్కులు సాధించలేని గోపాల కృష్ణ తప్పుడు అంగవైకల్య ధ్రువీకరణ పత్రంతో వికలాంగుల కోటాలో అర్హత సాధించారని, తద్వా రా జాతీయ స్థాయిలో మూడో ర్యాంకు వచ్చిందని వివరించారు. వికలాంగుల కోటాలో పరీక్ష రాసేం దుకు అదనపు సమయం సైతం పొందారని తెలిపా రు. వాదనలు విన్న ధర్మాసనం, ఈ వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న యూపీఎస్‌సీ జాయింట్‌ సెక్రటరీ, కేంద్ర సిబ్బంది శిక్షణ వ్యవహారాలశాఖ కార్యదర్శి, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు గోపాలకృష్ణకు నోటీసులు జారీ చేసింది. ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి వివరాలను తమ ముందుంచాలంటూ విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. 
Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా