ఔట్‌సోర్సింగ్‌ క్రమబద్ధీకరణపై హైకోర్టు నోటీసులు

22 Jun, 2017 03:12 IST|Sakshi
ఔట్‌సోర్సింగ్‌ క్రమబద్ధీకరణపై హైకోర్టు నోటీసులు

- 25వేల ఉద్యోగాల క్రమబద్ధీకరణను అడ్డుకోవాలన్న పిటిషనర్‌
- ఇంకా నిర్ణయం తీసుకోలేదన్న సర్కార్‌  


సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ విద్యుత్‌ సంస్థల్లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సర్వీసుల్ని  క్రమబద్ధీకరించరాదన్న కేసులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితోపాటు విద్యుత్‌ సంస్థల ఉన్నతాధికారు లకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. 25 వేల ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేసేందుకు వీలుగా ఈనెల 1, 2 తేదీల్లో ట్రాన్స్‌కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్‌ జారీచేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ వరంగల్‌కు చెందిన ఇంజనీరింగ్‌ నిరుద్యోగి ఎం.శ్రావణ్‌కుమార్‌ పిల్‌ దాఖలు చేశారు. ఈ పిల్‌ను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి రమేశ్‌ రంగనాథన్, న్యాయమూర్తి టి.రజనీలతో కూడిన డివిజన్‌ బెంచ్‌ బుధవారం విచారించింది.

‘‘ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సర్వీసుల్ని క్రమబద్ధీకరించడం సుప్రీంకోర్టు ఆదేశాలకు వ్యతిరేకం. పైగా ఆ ఉద్యోగులు కాంట్రాక్టర్‌ అధీనంలో ఉంటారు. 25 వేల ఉద్యోగాలను ఔట్‌సోర్సింగ్‌ స్టాఫ్‌తో భర్తీ చేస్తే లక్ష మంది నిరుద్యోగులపై దాని ప్రభావం పడుతుం ది. కాబట్టి ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సర్వీసు క్రమబద్ధీ కరణను అడ్డుకుని, ప్రొసీడింగ్స్‌ అమలు కాకుండా స్టే ఆదేశాలివ్వాలి’’ అని పిటిషనర్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది సరసాని సత్యంరెడ్డి వాదించారు. కాగా, ఇది ప్రజాప్రయోజన వ్యాజ్యం కాబోదని, ఉద్యోగుల సర్వీసులకు సంబంధించిన కేసు అని, పిల్‌గా పరిగణించరాదని విద్యుత్‌ సంస్థల తరఫు సీనియర్‌ న్యాయవాది జి.విద్యాసాగర్‌ అభ్యంతరాన్ని లేవనెత్తారు.

ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సర్వీసుల్ని క్రమబద్ధీకరించాలనే నిర్ణయం ప్రభుత్వం తీసుకోలేదని, ఇప్పుడే ఏదో జరిగిపోతోందనే ఆందోళనతో ముందే పిటిషనర్‌ కోర్టుకు వచ్చారని అన్నారు. దీనిపై నిర్ణయం తీసుకునే ముందు ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేయాల్సి వుంటుందని, దానికోసం కనీసం వారం సమయం పడుతుందని, నిర్ణయం తుది దశకు చేరుకోనేలేదని, కాబట్టి పిటిషన్‌ చెల్లుబాటు కాదని వాదించారు. వాదనల అనంతరం ప్రతివాదులైన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ట్రాన్స్‌కో, ఎస్పీడీసీఎల్, ఎన్‌పీడీసీఎల్‌ అధికారులు తమ వాదనలతో కౌంటర్‌ పిటిషన్లు దాఖలు చేయాలని, 29న విచారణ జరుపుతామని ధర్మాసనం ప్రకటించింది.

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా