రాష్ట్రం వద్దన్నా ఏఐసీటీఈ అనుమతివ్వొచ్చా?

11 Jul, 2017 01:44 IST|Sakshi
రాష్ట్రం వద్దన్నా ఏఐసీటీఈ అనుమతివ్వొచ్చా?
ఈ వ్యవహారాన్ని విస్తృత ధర్మాసనానికి నివేదించిన ద్విసభ్య ధర్మాసనం
 
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్త ఇంజనీరింగ్‌ కాలేజీలకు అనుమతివ్వొద్దని రాష్ట్ర ప్రభుత్వం కోరినా అనుమతిచ్చే అధికారం అఖిల భారత సాంకేతిక విద్యా మండలికి (ఏఐసీటీఈ) ఉందా.. లేదా.. అన్న సందేహం సోమవా రం హైకోర్టు ద్విసభ్య ధర్మాసనానికి వచ్చింది. దీంతో ఈ కేసును విస్తృత ధర్మాసనానికి నివేదించింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్‌ తెల్లప్రోలు రజనీలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. విస్తృత ధర్మాసనం ఏర్పాటుపై ఏసీజే పరిపాలనాపరమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఘట్‌కేసర్‌ వద్ద కేశవ మెమోరియల్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషనల్‌ సొసైటీకి కొత్త ఇంజనీరింగ్‌ కాలేజీ ఏర్పాటుకు ఏఐసీటీఈ అనుమతిచ్చినా.. రాష్ట్ర ప్రభుత్వం అనుమతివ్వలేదు.

కేశవ మెమోరియల్‌ సొసైటీ హైకోర్టును ఆశ్రయించింది. విచారణ జరిపిన సింగిల్‌ జడ్జి ఇంజనీరిం గ్‌ కాలేజీకి అనుమతివ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆదేశాలను సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్‌ దాఖలు చేసింది. ఈ అప్పీల్‌ పై సోమవారం ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరి పింది. ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్‌ జనరల్‌ (ఏఏజీ) జె.రామచంద్రరావు వాదనలు వినిపిస్తూ రాష్ట్రంలో ఇప్పటికే భారీ సంఖ్యలో ఇంజనీరింగ్‌ కాలేజీలున్నాయని వీటిలో పెద్ద సంఖ్యలో సీట్లు ఖాళీగా మిగిలిపోతున్నాయని తెలిపారు. కొత్త కాలేజీలకు అనుమతినివ్వొద్దని ఏఐసీటీఈని కోరినా ఏఐసీటీఈ తమ అభ్యర్థనను తోసిపుచ్చి వారికి అనుమతిచ్చిందని వివరించారు.

ఏఐసీటీఈ తరఫు న్యాయవాది కె.రమాకాంత్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ కళాశాలల ఏర్పాటుకు అనుమతిచ్చే అధికారం తమకు ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, ఏఐసీటీఈల మధ్య అభిప్రాయభేదం వచ్చినప్పుడు ఏఐసీటీఈ మాటే నెగ్గుతుందన్నారు. ధర్మాసనం స్పందిస్తూ, రాష్ట్రం అనుమతివ్వొద్దని కోరినా, ఏఐసీటీఈకి అనుమతినిచ్చే అధికారం ఉందా.. లేదా అన్న ది విస్తృత ధర్మాసనం విచారించడమే మేలని పేర్కొంది.  
మరిన్ని వార్తలు