‘సదావర్తి’లో సర్కారుకు షాక్‌

4 Jul, 2017 01:22 IST|Sakshi
‘సదావర్తి’లో సర్కారుకు షాక్‌
సర్కారు సవాల్‌కు సై అన్న ఎమ్మెల్యే ఆర్కేకు అనుకూలంగా హైకోర్టు ఆదేశాలు
 
- అదనంగా రూ.5 కోట్లు చెల్లిస్తే భూములు వారికే ఇస్తామంటూ సర్కారు సవాల్‌
దీనికి హైకోర్టు సాక్షిగా సై అన్న ఎమ్మెల్యే ఆర్కే
రూ.5 కోట్లు చెల్లించేందుకు ఓ వ్యక్తి సిద్థంగా ఉన్నారని,
ఆ వ్యక్తి మొత్తం రూ.27.44 కోట్లు చెల్లిస్తారని వెల్లడి
పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం
మొత్తం డబ్బు జమ చేసేందుకు నాలుగు వారాల గడువు
వరుస పరిణామాలతో బిత్తరపోయిన బాబు సర్కార్‌
 
సాక్షి, హైదరాబాద్‌: సదావర్తి భూములను వేలంపాటల్లో దక్కించుకున్న మొత్తానికి ఎవరైనా అదనంగా రూ.5 కోట్లు చెల్లిస్తే వారికే కేటాయిస్తామని రాష్ట్ర ప్రభుత్వం విసిరిన సవాల్‌కు వైఎస్సార్‌ సీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సోమవారం ఉమ్మడి హైకోర్టు వేదికగా సై అన్నారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు ఈ రూ.5 కోట్లతో కలిపి మొత్తం రూ.27.44 కోట్లు చెల్లించడానికి ఆర్కేకు నాలుగు వారాల గడువిచ్చింది. దీంతో వరుస పరిణామాలతో రాష్ట్ర ప్రభుత్వం బిత్తరపోయింది. వేల కోట్ల రూపాయల విలువ చేసే సదావర్తి భూములను కావాల్సిన వారికి నామమాత్రపు ధరకు కట్టబెట్టిన చంద్రబాబు సర్కార్‌ను ఉమ్మడి హైకోర్టులో సోమవారం నాటి పరిణామాలు ఉక్కిరిబిక్కిరి చేశాయి. రూ.5 కోట్లు తాను చెల్లించే పరిస్థితుల్లో లేకపోయినా, ఆ మొత్తాన్ని చెల్లించేందుకు వ్యక్తిని తీసుకొస్తానని రామకృష్ణారెడ్డి కోర్టుకు తెలిపారు. రూ.5 కోట్లతో సహా మొత్తం రూ.27.44 కోట్లు చెల్లించేందుకు ఓ వ్యక్తి సిద్ధంగా ఉన్నారని హైకోర్టుకు నివేదించారు. ప్రభుత్వం ఏం జరుగుతోందో తెలుసుకునే లోపే ధర్మాసనం నాలుగు వారాల గడువు కూడాఇవ్వడంతో ప్రభుత్వం దిమ్మతిరిగింది. 
 
హైకోర్టులో జరిగిందిదీ..
తమిళనాడులో సదావర్తి సత్రానికి చెందిన 83 ఎకరాల భూమికి వేలంలో వచ్చిన రూ.22.44 కోట్లకు అదనంగా మరో రూ.5 కోట్లు చెల్లించేందుకు ఒకరు సిద్ధంగా ఉన్నారని ఆళ్ల రామకృష్ణారెడ్డి తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి సోమవారం ఉమ్మడి హైకోర్టుకు నివేదించారు. అదనంగా చెల్లించాల్సిన రూ.5 కోట్లతో సహా మొత్తం రూ.27.44 కోట్లను నాలుగు వారాల్లో జమ చేస్తామని ఆయన తెలిపారు. అలా అయితే మొదట విడత కింద రూ.10 కోట్లను రెండు వారాల్లోపు, మిగిలిన రూ.17.44 కోట్లను ఆ తర్వాతి రెండు వారాల్లో చెల్లించాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్‌ తెల్లప్రోలు రజనీలతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. సదావర్తి భూముల వేలం వ్యవహారంలో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయని, దీనిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై పలుమార్లు విచారణ జరిపిన ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం, గత వారం విచారణ సమయంలో వేలంలో వచ్చిన రూ.22.44 కోట్లకు అదనంగా రూ.5 కోట్లు ఇచ్చిన వారికి భూములు ఇచ్చేస్తామని ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో ఆ అదనపు మొత్తాన్ని చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నారా? అంటూ రామకృష్ణారెడ్డిని ప్రశ్నించింది. అంత స్థోమత లేకపోతే ఆ మొత్తాన్ని చెల్లించే వారిని తీసుకొచ్చినా ఫర్వాలేదని తెలిపింది. ఈ నేపథ్యంలో సోమవారం ఈ వ్యాజ్యం మరోసారి విచారణకు రాగా, ఆళ్ల తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, వేలంలో వచ్చిన రూ.22.44 కోట్లకు అదనంగా రూ.5 కోట్లు చెల్లించేందుకు ఓ వ్యక్తి  సిద్ధంగా ఉన్నారని తెలిపారు. నాలుగు వారాల్లో మొత్తం డబ్బును జమ చేస్తామని వివరించారు.

ఈ సమయంలో ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) డి.రమేశ్‌ స్పందిస్తూ, రూ.5 కోట్లు జమ చేసేందుకు సిద్ధంగా ఉన్నారన్న వ్యక్తి రేపు ఆ మొత్తం జమ చేయకపోతే ఎలా అంటూ సందేహం వ్యక్తం చేశారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ, అనుకున్న సమయానికి డబ్బు జమ చేయకపోతే పిటిషనర్‌ రామకృష్ణారెడ్డికి రూ.కోటి జరిమానా విధించే అంశాన్ని పరిశీలిస్తామని వ్యాఖ్యానించింది. ‘మీరు (పొన్నవోలు సుధాకర్‌రెడ్డి) చెప్పిన వాదనలను రికార్డ్‌ చేస్తాం. ఒకవేళ రేపు డబ్బు కడతానన్న వారు ముందుకు రాకపోతే మిమ్మల్ని పట్టుకోవాల్సి ఉంటుంది.’ అని తెలిపింది. 
 
ముందు నుయ్యి.. వెనుక గొయ్యి..
కోర్టు సాక్షిగా అదనంగా ఐదు కోట్లు ఇస్తే 83 ఎకరాల భూమిని ఇచ్చేస్తామని సర్కారే చెప్పింది. ఇప్పుడు ఆ మాట నుంచి వెనక్కి వెళ్లలేదు. చెప్పినట్లు ఆ వ్యక్తి రూ.27.44 కోట్లు కడితే 83 ఎకరాలు అతనికి అప్పజెప్పాలి. ఇదే జరిగితే సొంత మనుషుల చేతిలో నుంచి వేల కోట్ల విలువైన భూములు జారిపోవడం ప్రభుత్వానికి కళ్ల ముందు కనిపిస్తోంది. దీంతో ప్రభుత్వ పరిస్థితి ముందు నుయ్యి.. వెనుక గొయ్యి అన్నట్లుగా తయారైంది.
మరిన్ని వార్తలు