రియల్టర్లు, బిల్డర్లకు చుక్కెదురు

29 Aug, 2015 01:19 IST|Sakshi
రియల్టర్లు, బిల్డర్లకు చుక్కెదురు

భూ వినియోగ మార్పిడి ఫీజు చెల్లించాల్సిందే
తేల్చి చెప్పిన హైకోర్టు ధర్మాసనం
సింగిల్ జడ్జి తీర్పులో తప్పేం లేదు
270 అప్పీళ్లు కొట్టివేత

హైదరాబాద్: భూవినియోగ మార్పిడి ఫీజు చెల్లింపు వ్యవహారంలో ఇరు రాష్ట్రాల్లోని రియల్టర్లు, బిల్డర్లు, డెవలపర్లకు హైకోర్టు ధర్మాసనం ముందు చుక్కెదురైంది. వ్యవసాయ భూములను వ్యవసాయేతర కార్యకలాపాల కోసం వినియోగిస్తున్న సందర్భంలో తుది లే అవుట్ పొందాలంటే 2006లో వచ్చిన చట్టం కింద భూవినియోగ మార్పిడి ఫీజు కచ్చితంగా చెల్లించాల్సిందేనని ధర్మాసనం తేల్చి చెప్పింది. ఈ విషయంలో ఇప్పటికే సింగిల్ జడ్జి 2010లో వెలువరించిన తీర్పును ధర్మాసనం సమర్థించింది. సింగిల్ జడ్జి తీర్పును సవాలు చేస్తూ బిల్డర్లు, డెవలపర్లు, రియల్టర్లు పెద్ద సంఖ్యలో దాఖలు చేసిన అప్పీళ్లను ధర్మాసనం తోసిపుచ్చింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించింది.

కేసు పూర్వపరాలివీ..
2006 చట్టప్రకారం తుది లే అవుట్ పొందాలంటే కలెక్టర్, ఆర్డీవోల నుంచి నిరభ్యంతర సర్టిఫికెట్లు తీసుకురావాలంటూ ఆయా పట్టణాభివృద్ధి సంస్థలు జారీచేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ పలువురు రియల్టర్లు, బిల్డర్లు, డెవలపర్లు వేర్వేరుగా హైకోర్టును ఆశ్రయించారు. వీటిని విచారించిన సింగిల్ జడ్జి, ఆయా పట్టణాభివృద్ధి సంస్థలు జారీ చేసిన ఉత్తర్వులను సమర్థిస్తూ 2010లో తీర్పునిచ్చారు. అయితే, 2006 చట్టానికి ముందు వ్యవసాయ భూములను వ్యవసాయేతర కార్యకలాపాల కోసం ఉపయోగించి ఉంటే ఆ భూముల విషయంలో నిరభ్యంతర పత్రం తీసుకురావాల్సిన అవసరం లేదని తేల్చారు. సింగిల్ జడ్జి తీర్పును సవాలు చేస్తూ ఇరు రాష్ట్రాల్లోని బిల్డర్లు, రియల్టర్లు కలిపి మొత్తం 270 అప్పీళ్లను ధర్మాసనం ముందు దాఖలు చేశారు. వీటన్నింటిపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించింది.

ఆంధ్రప్రదేశ్ పట్టణ ప్రాంతాల(అభివృద్ధి) చట్టం 1975 కింద లే అవుట్ అనుమతి కోసం తగిన ఫీజు చెల్లించే అనుమతి పొందుతామని, తిరిగి 2006 చట్టం కింద ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని బిల్డర్లు, రియల్టర్లు చేసిన వాదనలను ధర్మాసనం తోసిపుచ్చింది. 1975 చట్టం పట్టణ ప్రాంతాల్లో అభివృద్ధి ఓ పద్ధతి ప్రకారం చేసేందుకు ఉద్దేశించిందని, 2006 చట్టం వ్యవసాయ భూములను ఇతర వినియోగాలకు ఇష్టారాజ్యంగా ఉపయోగించకుండా ఉండేందుకు తీసుకొచ్చారని, ఈ రెండింటికీ ఏ మాత్రం పొంతన లేదంటూ ఆయా పట్టణాభివృద్ది సంస్థలు చేసిన వాదనను ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పులో ఎటువంటి తప్పులేదంటూ రిట్ అప్పీళ్లను కొట్టేస్తున్నట్లు తీర్పులో పేర్కొంది.

>
మరిన్ని వార్తలు