చట్టానికి లోబడి నడుచుకోండి : హైకోర్టు

21 Jun, 2016 08:33 IST|Sakshi

- అసైన్డ్ భూముల సేకరణపై ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
- చట్టవిరుద్ధంగా వెళితే రైతులు కోర్టుకు రావొచ్చని వెల్లడి
- వారి ప్రయోజనాలు కాపాడేందుకు తామున్నామని స్పష్టీకరణ
- ఈ అంశంలో కోర్టుకు వివరణ ఇచ్చిన మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్
- తహసీల్దార్ షోకాజ్ నోటీసులను ఉపసంహరించుకున్నాం
- స్వాధీనం చేసుకున్న భూములను కూడా వెనక్కిచ్చాం
- విధివిధానాలను తహసీల్దార్ పాటించలేదు
- ఆయనపై చర్యలకు ప్రతిపాదించామని నివేదించిన కలెక్టర్

 
సాక్షి, హైదరాబాద్: సోలార్ పరిశ్రమ ఏర్పాటు కోసం అసైన్డ్ భూములను సేకరించాలనుకుంటే.. అందుకు ప్రభుత్వం చట్ట నిబంధనలకు లోబడి వ్యవహరించాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఒకవేళ ప్రభుత్వం చట్టవిరుద్ధంగా భూసేకరణకు దిగితే కోర్టును ఆశ్రయించవచ్చని, రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు తామున్నామని వ్యాఖ్యానించింది. అయితే అసైన్డ్ భూముల నుంచి రైతులను ఖాళీ చేయించేందుకు తహసీల్దార్ జారీ చేసిన షోకాజ్ నోటీసులన్నింటినీ ఉపసంహరించినట్లు మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ టి.కె.శ్రీదేవి నివేదించడంతో.. ఈ వ్యాజ్యంపై విచారించేదేమీ లేదంటూ పిటిషన్‌ను పరిష్కరించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావులతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
 
 మహబూబ్‌నగర్ జిల్లా గట్టులో సోలార్ పార్క్ ఏర్పాటు కోసం ప్రభుత్వం భూసేకరణ చేపట్టిన విషయం తెలిసిందే. సోలార్ పరిశ్రమ కోసం ఏళ్ల తరబడి రైతుల అధీనంలో ఉన్న సాగు భూముల అసైన్‌మెంట్‌ను రద్దు చేసేందుకు తహసీల్దార్ జారీ చేసిన నోటీసులను సవాలు చేస్తూ న్యాయవాది బి.కొండారెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. దీనిపై ఇప్పటికే విచారణ జరిపిన ధర్మాసనం తహసీల్దార్ సత్తయ్య వ్యవహారశైలిని తప్పుపట్టింది. ఆ నోటీసుల్లో తేదీలు లేకపోవడం, భూమి విస్తీర్ణం వంటి వివరాలను పొందుపరచకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై వివరణ ఇవ్వాలని మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. తాజాగా సోమవారం ఈ వ్యాజ్యంపై తిరిగి విచారణ జరిగింది.
 
 ఉపాధి కోసమే సోలార్ పరిశ్రమ
 విచారణ ప్రారంభం కాగానే మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ టి.కె.శ్రీదేవి దాఖలు చేసిన అఫిడవిట్‌ను ప్రభుత్వ న్యాయవాది దుర్గారెడ్డి ధర్మాసనం ముందుంచారు. ఆ జిల్లాలో వర్షాభావ పరిస్థితుల వల్ల పంటలు పండే అవకాశం తక్కువని, రైతులు బతుకు దెరువు కోసం కూలి పనులు చేసుకోవాల్సి వస్తోందని కలెక్టర్ తన అఫిడవిట్‌లో నివేదించారు. గద్వాల ప్రాంతంలోని రైతులు బోర్లపై ఆధారపడి మాత్రమే సాగు చేయగలుగుతున్నారని, కానీ ఆ బోర్లకు తగినంత విద్యుత్ సరఫరా ఉండటం లేదని వివరించారు. ఈ నేపథ్యంలో వ్యవసాయానికి తగినంత విద్యుత్ అందించేందుకు, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం గట్టు మండల పరిధిలో సోలార్ పార్క్ ఏర్పాటు చేయాలని నిర్ణయించిందన్నారు.
 
  ప్రభుత్వ ఆదేశాల మేరకే గట్టు మండల పరిధిలో ప్రభుత్వ, అసైన్డ్ భూములను గుర్తిస్తున్నామని... గద్వాల ఆర్డీవో మొదట 6,401 ఎకరాల ప్రభుత్వ, అసైన్డ్ భూములను గుర్తించారని తెలిపారు. తర్వాత గట్టు తహసీల్దార్ 3,071 ఎకరాల సాగుకు పనికిరాని ప్రభుత్వ, అసైన్డ్ భూములను గుర్తించి.. అసైన్డ్ భూముల స్వాధీనానికి నోటీసులు జారీ చేశారని వివరించారు. అయితే ఈ సందర్భంగా తహసీల్దార్ చట్ట నిబంధనల మేర అనుసరించాల్సిన విధివిధానాలను పాటించలేదని.. జిల్లాకు భారీ సోలార్ పరిశ్రమ వస్తే రైతులు, కూలీల ఇబ్బందులు తొలగుతాయన్న భావనతోనే తహసీల్దార్ ఈ విధంగా వ్యవహరించారని నివేదించారు. అయినా తహసీల్దార్‌ది తొందరపాటేనని కలెక్టర్ అంగీకరించారు. ఆయనపై తగిన చర్యలకు ప్రతిపాదించామని తెలిపారు. తహసీల్దార్ జారీ చేసిన షోకాజ్‌లను ఉపసంహరించామని, స్వాధీనం చేసుకున్న భూములను తిరిగి వెనక్కి ఇచ్చామని వివరించారు.  
 
 చట్ట ప్రకారం చేస్తే ఎలా అడ్డుకోగలం?
 తాము ఏం చేసినా కూడా చట్టప్రకారమే చేస్తామని కలెక్టర్ తరఫున ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు నివేదించగా.. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ చట్ట ప్రకారం వెళితే ఎవరికీ అభ్యంతరం ఉండదని వ్యాఖ్యానించింది. దీనికి పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది సరసాని సత్యంరెడ్డి జోక్యం చేసుకుంటూ... సోలార్ పరిశ్రమ ఏర్పాటు కోసం 6,400 ఎకరాలను గుర్తించారని, అందులో రైతులకిచ్చిన అసైన్డ్ భూములు కూడా ఉన్నాయని, వాటిని ఎప్పుడైనా తీసుకునే అవకాశం ఉందని కోర్టుకు వివరించారు.
 
 దీనికి ధర్మాసనం స్పందిస్తూ.. ‘‘చట్ట ప్రకారం భూసేకరణ జరిపితే దానిని కోర్టు ఎలా అడ్డుకోగలదు? ప్రభుత్వం ఏం చేసినా కూడా చట్ట ప్రకారమే చేయాలి. ఏం చేయాలో ప్రభుత్వానికి మేం చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవేళ ప్రభుత్వం చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తే, మా వద్దకు వచ్చేందుకు కోర్టు తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు మేమున్నాం..’’ అని స్పష్టం చేసింది. షోకాజ్ నోటీసులను ఉపసంహరించిన నేపథ్యంలో ఈ వ్యాజ్యంలో విచారించేందుకు ఏమీ లేదన్న ధర్మాసనం.. దానిని పరిష్కరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు