సీటొచ్చి చేరకపోతే మరొకరికి నష్టమేగా?

27 Apr, 2018 01:39 IST|Sakshi

పీజీ మెడికల్‌ సీటు వ్యవహారంలో హైకోర్టు

సాక్షి, హైదరాబాద్‌: పీజీ మెడికల్‌ సీటు వచ్చాక తుది కౌన్సెలింగ్‌లో నచ్చిన కాలేజీలో సీటు రాలేదనో, మరే కారణంగానో సంబంధిత కాలేజీలో చేరకపోతే మరో విద్యార్థి నష్టపోతారు కదా అని హైకోర్టు ప్రశ్నించింది. దీని వల్ల సీటు కోల్పోయే ఇతర విద్యార్థుల ప్రాథమిక హక్కు దెబ్బతింటుందని అభిప్రాయపడింది. గతేడాది పీజీ మెడికల్‌ సీటు పొందిన కృష్ణా జిల్లాకు చెందిన ఓ మెడికల్‌ విద్యార్థి నచ్చిన కాలేజీలో సీటు రాలేదని చేరలేదు.

దీంతో ఏపీ ప్రభుత్వం సదరు విద్యార్థిపై మూడేళ్ల నిషేధం విధించింది. దీన్ని సవాల్‌ చేస్తూ కృష్ణా జిల్లాకు చెందిన ఓ మెడికల్‌ విద్యార్థి దాఖ లు చేసిన రిట్‌ను గురువారం ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్‌ కొంగర విజయలక్ష్మిల ధర్మాసనం విచారించింది. సీటొచ్చాక చేరాలో లేదో విద్యార్థి ఇష్టమని, చేరకపోతే మూడేళ్లు నిషేధం విధించడం చెల్లదని, ఈ ఏడాది జరిగే పీజీ మెడికల్‌ కౌన్సెలింగ్, ప్రవేశాలకు పిటిషనర్‌ను అనుమతించాలని విద్యార్థి తరఫు న్యాయవాది వాదించారు.

సీటొచ్చినా చేరకపోతే మరో విద్యార్థి ఆ సీటు పొందే హక్కు కోల్పోతారని, చేరని కారణంగా సీటుకు సంబంధించి రెండేళ్ల రుసుము చెల్లించేందుకు పిటిషనర్‌ సిద్ధంగా ఉన్నారా అని ధర్మాసనం ప్రశ్నించింది. విచారణను శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.

>
మరిన్ని వార్తలు