హామీ ఇచ్చి తప్పించుకుంటారా?

5 Aug, 2017 01:48 IST|Sakshi
కాకినాడ కార్పొరేషన్‌ ఎన్నికల్లో జాప్యంపై హైకోర్టు ఆగ్రహం
 
సాక్షి, హైదరాబాద్‌: కాకినాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌కు ఎన్నికలు నిర్వహించాలన్న ఉత్తర్వుల విషయంలో తప్పును తమపై తోసేయడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒకవేళ తాము తప్పుగా ఉత్తర్వులు ఇచ్చి ఉంటే... ఆ విషయాన్ని తమ దృష్టికి తీసుకొచ్చి, తప్పును సరిదిద్దే ప్రయత్నం ఎందుకు చేయలేదని పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి కరికాళ వలవన్, రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ను నిలదీసింది. 2016 నవంబర్‌ నాటికి ఎన్నికలు పూర్తి చేస్తామంటూ హామీ ఇచ్చి, ఇప్పుడేమో జాప్యానికి బాధ్యులం మేం కాదంటూ తప్పించుకోవడం సరికాదని హితవు పలికింది.

మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల నిర్వహణకు గురువారం నోటిఫికేషన్‌ జారీ చేశామని ఎన్నికల కమిషనర్‌ తరపు న్యాయవాది డి.వి.సీతారామ్మూర్తి కోర్టుకు నివేదించారు. దీనికి ధర్మాసనం తీవ్రంగా స్పందిస్తూ... ఇరువురు అధికారులను కోర్టుకు పిలిపిస్తే తప్ప నోటిఫికేషన్‌ జారీ చేయరా? అని వ్యాఖ్యానించింది. ఈ కోర్టు ధిక్కార వ్యాజ్యాన్ని మూసివేసే ప్రసక్తే లేదని, తమ ఉత్తర్వులను ఉద్దేశపూర్వకంగానే ఉల్లంఘించారా? లేదా? అన్న విషయాన్ని తేలుస్తామని ధర్మాసనం తేల్చి చెప్పింది. తదుపరి విచారణను సెప్టెంబర్‌ 1కి వాయిదా వేసింది.
మరిన్ని వార్తలు