వారు నిధులిస్తారు.. మీరు చెల్లించండి

7 Jan, 2016 01:37 IST|Sakshi
వారు నిధులిస్తారు.. మీరు చెల్లించండి

అంబేడ్కర్, తెలుగు వర్సిటీల రిజిస్ట్రార్లకు హైకోర్టు ఆదేశం
 
 సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం 92 సేవా కేంద్రాలు, శ్రీపొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 3ప్రాంతీయ పీఠాల్లో పనిచేస్తున్న, పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు జీతాలు, పెన్షన్ల చెల్లింపులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఇచ్చే నిధులను స్వీకరించి, వాటిని ఉద్యోగులు, పెన్షనర్లకు చెల్లించాలని హైకోర్టు బుధవారం ఇరు యూనివర్సిటీల రిజిస్ట్రార్లను ఆదేశించింది. ఇదే సమయంలో 92 సేవా కేంద్రాలు, 3 ప్రాంతీయ పీఠాల్లో పరిపాలనా సౌలభ్యం కోసం ప్రత్యేక అధికారిని నియమించాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.

ఏపీలో ఉన్న ప్రాంతీయ కేంద్రాలకు అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం తన సేవలను నిలిపేసిందని, దీనివల్ల 3.5 లక్షల మంది విద్యార్థులు ఇబ్బంబ దులు పడుతున్నారంటూ ‘సాక్షి’లో ప్రచురితమైన కథనాన్ని హైకోర్టు సుమోటోగా తీసుకుని విచారణ ప్రారంభించిన సంగతి విదితమే. ఇదే సమయంలో ఏపీలోని క్యాంపస్‌లకు తమ సేవలను నిలిపేస్తూ తెలుగు విశ్వవిద్యాలయం జారీ చేసిన నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ ఏపీ ఉన్నత విద్యాశాఖ హైకోర్టును ఆశ్రయించింది. ఈ రెండు వ్యాజ్యాలను బుధవారం ధర్మాసనం మరోసారి  విచారించింది. ఏపీలోని స్టడీ సెంటర్లు, ప్రాంతీయ పీఠాల్లో ప్రస్తుతం ఎంత మంది పనిచేస్తున్నారు.. ఎంత మంది పదవీ విరమణ చేశారు.. వారికి చెల్లించాల్సిన మొత్తం ఎంత? తదితర వివరాలను ఏపీ ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శికి ఇవ్వాలని 2 యూనివర్సిటీల రిజిస్ట్రార్లను ఆదేశించింది. వాటి ఆధారంగా నిధులకు సంబంధించిన చెక్కులను రిజిస్ట్రార్లకు అందచేయాలని ముఖ్య కార్యదర్శికి తెలిపింది. చెక్కులు అందుకున్న తరువాత ఆ మొత్తాలను ఉద్యోగులకు చెల్లించాలంది.

మరిన్ని వార్తలు