పని ఇవ్వకున్నా జీతం చెల్లించాల్సిందే

14 Feb, 2016 00:47 IST|Sakshi

ఏపీ, తెలంగాణ ఆర్టీసీలకు హైకోర్టు ఆదేశం
 
 సాక్షి, హైదరాబాద్: అనారోగ్య కారణాలతో డ్రైవర్‌గా విధులు నిర్వర్తించలేని వారికి ప్రత్యామ్నాయ ఉద్యోగం చూపేంతవరకు పక్కన పెడితే ఆ కాలానికి కూడా జీతభత్యాలు చెల్లిం చాల్సిందేనని హైకోర్టు తేల్చి చెప్పింది. ప్రత్యామ్నాయంగా మరో ఉద్యోగం ఇచ్చినప్పటికీ, వారికి డ్రైవర్ హోదాలో వచ్చిన జీతభత్యాలను ఇవ్వాల్సిందేనంది.ప్రత్యామ్నాయ ఉద్యోగానికి ఎంతిస్తారో అంతే ఇస్తామంటే కుదరదంది. ఖాళీలు లేకపోతే సూపర్ న్యూమరరీ పోస్టులు సృష్టించాలని ఆదేశించింది. ఏపీ, తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యాలు ఇప్పటికైనా పద్ధతి మార్చుకొని, ఇలాంటి వివాదాలకు ముగింపు పలకాలని మందలించింది.

ఆనారోగ్య కారణాలవల్ల పని కల్పించకుండా పక్కన పెట్టిన మొత్తంకాలానికి డ్రైవర్‌కు జీతభత్యాలు చెల్లిం చాలని, 8శాతం వడ్డీతో బకాయిలను కూడా ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. తీర్పు కాపీ అందుకున్న నాటి నుంచి 8 వారాల్లోపు దీన్ని అమలు చేయాలంది. ప్రత్యామ్నాయ ఉద్యోగం ఇవ్వలేకపోతే, ఖాళీలు ఏర్పడే వరకు లేదా పదవీ విరమణ వయస్సు వరకు అతడిని సూపర్ న్యూమరరీ పోస్టులో ఉంచాలంది. ఈమేరకు న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావు తీర్పునిచ్చారు.

 ఉద్యోగిని గౌరవంగా చూడాలి
 ‘‘ఓ ఉద్యోగి విధులు నిర్వర్తించాలని భావిస్తున్నప్పుడు అతడిని సెలవుపై వెళ్లాలని ఆదేశించడానికి వీల్లేదు. అనారోగ్య కారణాలతో డ్రైవర్ గా పనిచేయలేరని మెడికల్ బోర్డు తేల్చిన నాటి నుంచి ఆ వ్యక్తి ప్రత్యామ్నాయ ఉద్యోగం పొం దే వరకు లేదా పదవీ విరమణ వరకు విధి నిర్వహణలో ఉన్నట్లే. ప్రతికూల పరిస్థితుల మధ్య పనిచేసే డైవర్లు అనారోగ్యం పాలవుతుంటారు. డ్రైవర్ కంటి చూపు సక్రమంగా లేకపోతే ప్రయాణికులకు ప్రమాదం సంభవించే అవకాశం ఉండటంతో అతడు విధులు నిర్వర్తించలేడని మెడికల్ బోర్డు తేలుస్తుంది. అయితే, ఈ వైకల్యం డ్రైవర్ విధులు మినహా మిగిలిన విధులు నిర్వర్తించడానికి అడ్డుకాదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ వ్యక్తికి డ్రైవర్ హోదా ఉండే మరో ఉద్యోగం ఇవ్వాలి. ఉద్యోగిని గౌరవంగా చూడాల్సిన బాధ్యత యజమానిది. ఆ గౌరవాన్ని యజమాని నుంచి ఆశించే హక్కు ఉద్యోగికి ఉంది. ఈ తీర్పుతో భవిష్యత్తులో ఇలాంటి వివాదాలు పునరావృతం కావని ఆశిస్తున్నా’’ అని న్యాయమూర్తి పేర్కొన్నారు.  
 
 ఇదీ వివాదం..

 అనారోగ్య కారణాల వల్ల విధులు నిర్వర్తించలేరని మెడికల్ బోర్డు తేల్చిన డ్రైవర్లను ఆర్టీసీ అధికారులు పక్కన పెడుతున్నారు. వారిని సెలవుపై వెళ్లాలని ఆదేశిస్తున్నారు. పక్కన పెట్టిన కాలానికి జీతభత్యాలు చెల్లిం చడం లేదు. ప్రత్యామ్నాయంగా తక్కువస్థాయి ఉద్యోగం ఇస్తూ, డ్రైవర్ హోదాలో ఇచ్చిన జీతభత్యాలను చెల్లించడం లేదు. వీటన్నింటినీ సవాలు చేస్తూ పలువురు ఆర్టీసీ డ్రైవర్లు 2013లో హైకోర్టును ఆశ్రయించారు. వాదనలు విన్న జస్టిస్ నవీన్‌రావు గతవారం తీర్పు వెలువరించారు.

మరిన్ని వార్తలు