‘హై రిస్క్‌’లో ఆమె

13 Oct, 2016 20:13 IST|Sakshi
‘హై రిస్క్‌’లో ఆమె

గర్భిణి అయ్యాక ప్రసవానికి అననుకూల పరిస్థితులు
రాష్ట్రంలో ఏడాదిలో సుమారు 8.50 లక్షల ప్రసవాలు
31 శాతం మంది గర్భిణుల్లో పౌష్టికాహారలోపం
సకాలంలో సరిగ్గా జరగని వైద్య పరీక్షలు
రక్తపోటు, రక్తహీనతలను గుర్తించలేని పరిస్థితి
చాలా కేసుల్లో బిడ్డ ప్రాణాలకు ముప్పు


సాక్షి, హైదరాబాద్‌: తల్లి కావడమనేది ప్రతి స్త్రీ ఒక వరంగా భావిస్తుంది. కానీ ఆ స్త్రీని తల్లిని చేసే ప్రసవ ప్రక్రియ చాలా కేసుల్లో బిడ్డ ప్రాణాలకు పలు సందర్భాల్లో తల్లి ప్రాణాల మీదకు సైతం తెస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రసవానికి అననుకూల పరిస్థితులు ఎదుర్కొంటున్న గర్భిణుల (హైరిస్క్‌ ప్రెగ్నెంట్‌ ఉమెన్‌) సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. వేలాది మంది గర్భిణులు ప్రసవానికి అనుకూల పరిస్థితులు లేక కొన్నిసార్లు నవ మాసాలు నిండినా.. బిడ్డను కడుపులోనే కోల్పోతున్నారు. పండంటి బిడ్డతో సంతోషంగా ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్లాల్సిన మహిళలు బిడ్డను చూడకుండా కన్నీటితో తిరిగి వెళ్లాల్సి వస్తోంది.

కడుపులోని బిడ్డలో ఎదుగుదల లేకపోవడంతో ఐదో నెల నుంచి ఏడో నెలలోపే పురిటి నొప్పులు రావడం, బిడ్డ చనిపోయి పుట్టడం వంటివి జరుగుతున్నాయి. ఈ కారణంగా తల్లులు సైతం మృత్యువుకు చేరువవుతున్నారు. ఇందుకు అనేక కారణాలున్నాయి. ప్రధానంగా పౌష్టికాహార లోపం కలిగిన గర్భిణులు అత్యధిక సంఖ్యలో ఉంటున్నారు. గర్భిణికి సరైన పోషకాహారం అందితేనే కడుపులోని బిడ్డ కూడా ఆరోగ్యంగా ఎదిగేందుకు అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో ఏడాదిలో సుమారు 8.50 లక్షల ప్రసవాలు జరుగుతున్నాయి. ఇందులో 31 శాతం మంది మహిళలకు సరైన పోషకాహారం అందనట్టు తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

40 శాతం మందికి.. గర్భం దాల్చిన తర్వాత ప్రసవం వరకు క్రమం తప్పకుండా జరగాల్సిన పరీక్షలు (యాంటీనేటల్‌ చెకప్స్‌) సరిగా జరగడం లేదు. దీనివల్ల గర్భిణిలో ఏవైనా లోపాలు ఉంటే తెలియడం లేదు. రక్తపోటు, రక్తహీనత వంటి సమస్యలను గర్భిణులు ఎదుర్కొంటున్నారు. మెజారిటీ మహిళల్లో హిమోగ్లోబిన్‌ 5 శాతం కంటే తక్కువగా ఉంటోంది. గర్భందాల్చిన తర్వాత గుండె జబ్బులు సైతం మహిళలను చుట్టుముడుతున్నాయి. తీరా ప్రసవ సమయంలో బయటపడినా బిడ్డను కోల్పోవాల్సిన పరిస్థితి నెలకొంటోంది. గ్రామీణ ప్రాంతాల్లోని పలు ప్రభుత్వాసుపత్రుల్లో సరైన వైద్యసేవలు అందక పోవడం కూడా ఈ పరిస్థితికి కారణమని గణాంకాలు చెబుతున్నాయి.

గుంటూరులో అత్యధికం
గుంటూరులో మెరుగైన వైద్యసేవలు అందుబాటులో ఉన్నప్పటికీ.. ఆ జిల్లాలోనే అత్యధికంగా అననుకూల పరిస్థితులున్న గర్భిణులుండటం గమనార్హం. ప్రతి 100 మందిలో 19.62 మంది ఇలాంటివారే ఉన్నారు. ఆ తర్వాతి స్థానంలో శ్రీకాకుళం జిల్లా (18.27 శాతం) ఉండగా కర్నూలు జిల్లా చివరి స్థానంలో ఉంది. కేంద్రం నుంచి వందల కోట్ల నిధులొస్తున్నా రాష్ట్రంలో గర్భిణులకు గానీ, నవజాత శిశువులకు గానీ సరైన సేవలు అందించలేని దుస్థితి రాష్ట్రంలో నెలకొని ఉంది.

మరిన్ని వార్తలు