ఎంబీఏ ఎంసీఏ బీటెక్‌ బీఈడీ పట్టా ఏదైనా అడ్డాకూలీయే!

2 Sep, 2017 02:27 IST|Sakshi
ఎంబీఏ ఎంసీఏ బీటెక్‌ బీఈడీ పట్టా ఏదైనా అడ్డాకూలీయే!

పల్లెల్లో పెరిగిపోతున్న నిరుద్యోగులు
జాబుల్లేక ‘జాబ్‌ కార్డు’తో ఉపాధి పనులకు పయనం


పెద్దపల్లి, సాక్షి:...ఒక్కరిద్దరు కాదు.. అనేక పల్లెల్లో ఇలాంటివారెందరో కనిపిస్తున్నారు! ఉన్నత చదువులు చదివి కొలువుల్లోనే కూలీ పనులకు వెళ్తున్నారు. జిల్లా కేంద్రం పెద్దపల్లిలో కూలీల అడ్డాపై బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ, డిగ్రీ చదివిన పట్టభద్రులు కనిపిస్తున్నారు. ఉపాధి కోసం తట్ట పట్టుకొని లేబర్‌గా మారుతున్నారు.

హైదరాబాద్‌లో ఉద్యోగం కోసం ప్రయత్నించినా దొరకలేదని, కుటుంబానికి భారంగా మారడం ఇష్టం లేక కూలీబాట పట్టినట్టు వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేటు విద్యాసంస్థల్లో పని చేస్తే రూ.ఐదారు వేలకు మించి ఇవ్వడం లేదని, కూలీ పనికి వెళ్తే నెలకు రూ.7 వేల నుంచి రూ.8 వేలు వస్తున్నాయని పలువురు పేర్కొన్నారు. ఇళ్ల నిర్మాణంతోపాటు ప్లాట్లలో చెట్లు, పిచ్చి మొక్కలు తొలగించడం, చిన్న చిన్న కందకాలు తవ్వడంలాంటి పనులు చేస్తున్నామని చెప్పారు.

ఆ ఊరి నిండా నిరుద్యోగులే..
పెద్దపల్లి జిల్లా కేంద్రానికి సమీపంలోని హన్మంతునిపేట గ్రామం లో ఎంటెక్‌ ఆరుగురు, బీటెక్‌ 18, ఎంబీఏ 26, ఎంసీఏ 21, డిగ్రీ 55, ఇంటర్‌ 100 మందికిపైగా, టెన్త్‌ 200 మందికి పైగా చదివారు. వారిలో కేవలం తొమ్మిది మందికే ఉద్యోగాలు వచ్చాయి. బీటెక్‌ చదివినవారిలో నలుగురికి, ఎంటెక్‌ చేసిన ఒకరికి, బీఈడీ పూర్తి చేసిన నలుగురికి ఉద్యోగాలు వచ్చాయి.

ఈ ఒక్క ఊరిలోనే కాదు.. చాలా గ్రామాల్లో నిరుద్యోగుల సంఖ్య పెరిగిపోతోంది. మరికొందరు చదువులకు సంబంధం లేని కొలువుల్లో చాలీచాలని జీతాలతో పనిచేస్తున్నారు. బీటెక్‌ పట్టభద్రులు అక్కడక్కడ సాఫ్ట్‌వేర్, కాల్‌సెంటర్లలో పని చేస్తున్నారు. ఎంబీఏ, ఎంసీఏ చదివినవారిలో చాలామంది ఖాళీగానే ఉంటున్నారు. ‘చదువులు జీవితాన్ని నిలబెట్టలేక పోతున్నాయి. అందుకే తీరిక వేళలో ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పని చేస్తున్నా’ అని బీటెక్‌ చదివిన నవీన్‌ చెప్పాడు.

ఒక చేతిలో తట్ట..మరో చేతిలో గడ్డపార పట్టుకున్న ఈయన రవికిశోర్‌. పెద్దపల్లి. ఇంజనీరింగ్‌ చదివాడు. కొలువు కోసం ప్రైవేటు కంపెనీల చుట్టూ తిరిగాడు.  ఎంత ప్రయత్నించినా జాబ్‌ దొరకలేదు. ప్రభుత్వ ఉద్యోగంపై ఆశల్లేక చివరికి కూలీ అవతారమెత్తాడు.

ఈయన పేరు గుర్రాల రాజు. హన్మంతునిపేట. ఎంసీఏ చదివాడు. పెళ్లయింది. ఓ కూతురు. ఉద్యోగం కోసం ఎంతో యత్నించాడు. ఎక్కడా జాబ్‌ రాకపోవడంతో తనకున్న ఎకరం పొలంలోనే వ్యవసాయం చేసుకుంటూ, ఉపాధి పనికి వెళ్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.

ఈయన పేరు తీగల సతీశ్‌. పెద్దపల్లి సమీపంలోని హన్మంతునిపేట. 2010లో ఎంబీఏ పూర్తిచేశాడు. హైదరాబాద్‌లో నాలుగేళ్లు ఉద్యోగం కోసం ప్రయత్నించాడు. లాభం లేకపోయింది. కాల్‌సెంటర్‌లో కొలువు దొరికినా నెలకు రూ.5 వేలు ఇస్తామన్నారు. ఆ జీతంతో జాబ్‌ చేయలేక తిరిగొచ్చాడు. ఉపాధి హామీ పథకం కింద ‘జాబ్‌’ కార్డు సంపాదించి ఊరిలోనే పనికి వెళ్తున్నాడు.

మా పొలగానికి పిల్లనిస్తలేరు
మా కొడుకు ఎంబీఏ చదివాడు. కానీ ఉద్యోగం దొరకలేదు. పిల్లనివ్వమని అడిగితే పొలగాడు  (కొడుకు) ఏం చేస్తుండని అడుగుతున్నరు. చివరికి ఉపాధి హామీ పనికి నా వెంటే వస్తుండు. దాంతోపాటు ఇంట్లో కులవృత్తి ఇస్త్రీ కూడా చేస్తూ నాలుగు పైసలు సంపాదించి ఆసరైతాండు.
– కంది లక్ష్మీరాజమ్మ, హన్మంతునిపేట

ఐదు సదివితేనే నౌకరచ్చింది
మా కాలంలో ఐదు సదివితేనే నౌకరచ్చింది. పది సదివినోళ్లను సూడనేలేదు. గిప్పుడైతే ఇంటికి ముగ్గురు 20 ఏండ్లు బడికివోయి సదువుతాండ్రు. కానీ ఎవరికి నౌకరచ్చినట్టు కనిపిస్తలేదు. ఇద్దరు మనవలు, ఇద్దరు మనవరాండ్లు 18 ఏండ్లు పుస్తకాలతోనే తిరిగిండ్రు. ఇంట్ల నలుగురుంటే ఒక్కలకు నౌకరు లేదు. ఏం సదువులో ఏమో?
– కందుల పోశాలు, హన్మంతునిపేట

పట్టా దాచి పనికి పోతున్న
నేను బీఈడీ చదివా. ప్రైవేటు స్కూల్‌కు వెళ్తే నెలకు రూ.4 వేలు ఇస్తామన్నారు. అవి ఎటూ చాలవు. కుటుంబ పోషణ భారమై బీఈడీ పట్టా బీరువాలో దాచి బజారులో కూలీ పని చేస్తున్నా.
– భాస్కర్, శాంతినగర్‌

చదువుకున్నోళ్లకు పనిలేదు
చదువుకున్నోళ్లమని చెబితే పని దొరకదేమోనన్న బాధ కూడా తమను వేధిస్తోందని విద్యావంతులు చెబుతున్నారు. చదువుకున్న వారు పని చేయలేరనే భావనతో పని ఇచ్చేందుకు వెనకాడుతున్నారన్నారు. కొందరు పాత దుస్తులు ధరించి, కూలీల మాదిరిగా అడ్డాపైకి వస్తున్నారు.

>
మరిన్ని వార్తలు