రాష్ట్రంలో మొదలైన వడగాడ్పులు

23 Mar, 2016 04:22 IST|Sakshi
రాష్ట్రంలో మొదలైన వడగాడ్పులు

♦ సాధారణం కంటే నాలుగైదు డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు
♦ భద్రాచలం, మహబూబ్‌నగర్, నల్లగొండల్లో 42 డిగ్రీలు
♦ ఖమ్మంలో సాధారణం కంటే ఐదు డిగ్రీలు అధికం
♦ విపత్తు నిర్వహణశాఖ సూచనలు బేఖాతరు
♦ 12-4 గంటల మధ్య స్కూళ్లు నడపొద్దన్నా పట్టించుకోని వైనం
 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వడగాడ్పులు మొదలయ్యాయి. కనీసం 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడంతోపాటు సాధారణం కంటే నాలుగైదు డిగ్రీలు అధికంగా ఉంటే వడగాడ్పుల కింద లెక్కిస్తారు. దీని ప్రకారం రాష్ట్రంలో వడగాడ్పులు మొదలయ్యాయని హైదరాబాద్ వాతావరణ శాఖ స్పష్టం చేసింది. గత 24 గంటల్లో భద్రాచలం, మహబూబ్‌నగర్, నల్లగొండల్లో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ ప్రాంతాల్లో సాధారణం కంటే 4 డిగ్రీలు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఖమ్మంలో 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సాధారణం కంటే ఇక్కడ ఐదు డిగ్రీలు అధికంగా రికార్డు అయినట్లు వాతావరణశాఖ తెలిపింది. రాష్ట్రంలోని 80 శాతం ప్రాంతాల్లో 41 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణశాఖ అధికారి ఒకరు తెలిపారు. ఆయా ప్రాంతాల్లో వడగాడ్పులు ప్రారంభ దశలో ఉన్నట్లుగా చెప్పారు. వడగాడ్పుల నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలని తాము జిల్లా కలెక్టర్లు, వివిధ శాఖల అధిపతులకు లేఖలు రాసినా పట్టించుకోవడంలేదని రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం అధికారులు కొందరు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

 ఈ జాగ్రత్తలు తప్పనిసరి...
 తీవ్ర ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రజారోగ్య రక్షణకు సంబంధించి రాష్ట్ర విపత్తు నిర్వహణశాఖ, అహ్మదాబాద్ వేసవి కార్యాచరణ ప్రణాళికను ఆధారం చేసుకొని రాష్ట్రంలో కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. దీని ప్రకారం అత్యంత తీవ్రమైన వడగాడ్పులుంటే రెడ్ అలర్ట్ జారీచేయాలి. తీవ్రమైన ఎండలుంటే ఆరెంజ్ అలర్ట్ జారీచేయాలి. సాధారణ ఎండలుంటే ఎల్లో అలర్ట్ జారీచేయాలి. అలాగే రాష్ట్రవ్యాప్తంగా నగరాలు, పట్టణాల్లో ఎల్‌ఈడీ స్క్రీన్లు పెట్టి ఉష్ణోగ్రతల వివరాలు ప్రదర్శించాలి.

పాఠశాలల వేళలను మార్పు చేయాలి. మధ్యాహ్నం 12 నుంచి 4 గంటల మధ్య పాఠశాలలను, ఆర్టీసీ బస్సులను నడపకూడదు. ఎఫ్‌ఎం రేడియో ద్వారా ప్రజలను అప్రమత్తం చేయాలి. ఐస్ ప్యాక్స్, ఐవీ ఫ్లూయిడ్స్, 108 సర్వీసును అందుబాటులో ఉంచాలి. ఆరు బయట శారీరక శ్రమ చేసే వారికి తగు నీడ కల్పించాలి. ఫ్యాక్టరీల్లో ఏసీ వసతి కల్పించాలి. వడదెబ్బకు గురైన వారికోసం ఆసుపత్రుల్లో ప్రత్యేకంగా వార్డులను ఏర్పాటు చేయాలి. చలివేంద్రాలు ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ కార్యాలయాలు, గుడులు ఇతర అన్నిచోట్లా నీడ వసతి కల్పించాలి. కాగా, ఈ మార్గదర్శకాలను విపత్తు నిర్వహణశాఖ అన్ని జిల్లాలకు పంపించినా అందుకు తగ్గ చర్యలు తీసుకోలేదన్న విమర్శలున్నాయి.

మరిన్ని వార్తలు