బి కేటగిరీ సీట్లపై మాదే అధికారం!

26 Sep, 2014 01:59 IST|Sakshi

* తెలంగాణ, ఏపీ ఉన్నత విద్యా మండళ్ల తకరారు
* విభజన చట్టం ప్రకారం తమదే అధికారమంటున్న ఏపీ  
* మా సీట్లను మేమే భర్తీ చేస్తామంటున్న తెలంగాణ
* అనుమతులపై ప్రైవేటు కాలేజీల్లో తీవ్ర అయోమయం
* ఆన్‌లైన్‌తో సంబంధం లేకుండానే సీట్లు భర్తీ చేసేసిన కాలేజీలు
* గడువులోపే పూర్తి చేసినట్లు పాత తేదీలతో కౌన్సిళ్లకు

 
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, ఫార్మసీతో పాటు అన్ని ప్రొఫెషనల్  కోర్సుల కాలేజీల్లోని ‘బి’ కేటగిరీ సీట్ల భర్తీ వ్యవహారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉన్నత విద్యామండళ్ల మధ్య వివాదాస్పదంగా మారుతోంది. తెలంగాణ ప్రాంతంలోని కాలేజీల్లో బి కేటగిరీ సీట్ల భర్తీ వ్యవహారం తామే చేపడతామని తెలంగాణ ఉన్నత విద్యామండలి ఇంతకుముందు ప్రకటించిన సంగతి తెలిసిందే. కాలేజీలు పూర్తిచేసే సీట్ల భర్తీని ఆమోదించే అధికారం తమదేనని స్పష్టంచేసింది. అయితే దీనిపై ఏపీ ఉన్నత విద్యామండలి తన అభ్యంతరాన్ని తెలియచేసింది.
 
రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఉమ్మడిగా జరిగే ఉన్నత విద్యావ్యవహారాలపై ఏపీ ఉన్నత విద్యామండలికే సర్వాధికారాలుంటాయని ఏపీ మండలి వాదిస్తోంది. ఈ అభ్యంతరాలను తోసిపుచ్చిన తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఆ ప్రాంత కాలేజీల్లోని బి కేటగిరీ సీట్ల భర్తీకి ఆమోదం తెలిపే అధికారం తమదేనని ఇటీవల జేఎన్‌టీయూ, ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలకు లేఖలు రాసింది. తెలంగాణ ప్రాంతంలోని బి కేటగిరీ సీట్ల భర్తీకి సంబంధించిన నివేదికలన్నీ తమకే నివేదించాలని స్పష్టంచేసింది.
 
తెలంగాణ ప్రాంతంలోని ప్రయివేటు ప్రొఫెషనల్ కాలేజీల్లోని బీటెక్, ఎంటెక్ కోర్సులే కాకుండా ఎంబీఏ, ఎంసీఏ, లా, ఫార్మసీ, బీఈడీ, బీపీఈడీ కోర్సులకు సంబంధించి 2014-15 విద్యాసంవత్సరానికి సీట్ల భర్తీకి ఆమోదం తమనుంచే తీసుకోవాలని పేర్కొంది. ఆయా  యూనివర్సిటీల రిజిస్ట్రార్ల పేరిట తెలంగాణ ఉన్నత విద్యామండలి ఈనెల 9వ తేదీన వేర్వేరు లేఖలు రాసింది. ఈ లేఖలతో రెండు మండళ్ల మధ్య నెలకొన్న వివాదం మరింత ముదిరింది. ఈ వివాదంతో ఎవరినుంచి అనుమతి తీసుకోవాలన్నది ప్రయివేటు కాలేజీల్లో తీవ్ర అయోమయానికి దారితీస్తోంది.  తెలంగాణ మండలి ప్రకటనతో ఆ ప్రాంతంలోని కొన్ని కాలేజీలు బి కేటగిరీ సీట్ల భర్తీ ఫైళ్లు ఏపీ మండలికి కాకుండా తెలంగాణ మండలికి సమర్పించారు. కొన్ని కాలేజీలు ఏపీ మండలికి కూడా పంపించాయి. చట్టం ప్రకారం అంతిమ అధికారం తమదేనని, తెలంగాణ మండలి ఆమోదం చెల్లదని ఏపీ మండలి అంటోంది.
 
ఆన్‌లైన్‌తో సంబంధం లేకుండానే...
మరోవైపు ప్రైవేటు ప్రొఫెషనల్ కాలేజీల్లోని మేనేజ్‌మెంటు కోటా (బి కేటగిరీ) సీట్ల భర్తీని కూడా మెరిట్ ప్రాతిపదికన భర్తీచేస్తామని అధికారులు ముందు ప్రకటించారు. ఆమేరకు ఆన్‌లైన్‌లోనే బి కేటగిరీ సీట్లకు దరఖాస్తు చేసుకోవాలని ప్రకటించారు. కానీ చాలా కాలేజీలు మేనేజ్‌మెంటు కోటా సీట్లను ఆన్‌లైన్ దరఖాస్తులతో సంబంధం లేకుండా ఇష్టానుసారం భర్తీ చేసేశాయి. సీట్లను అమ్ముకున్నాయన్న ఆరోపణలున్నాయి. మెరిట్ విద్యార్థులు ఆయా కాలేజీలకు వెళ్లినా బి కేటగిరీ సీట్ల గురించి సమాచారం కూడా ఇవ్వకుండా వెనక్కు పంపేశాయి.

మరిన్ని వార్తలు