ఆయన ఆస్తి.. దేశ బడ్జెట్ కంటే రెట్టింపు

15 Mar, 2016 05:02 IST|Sakshi
ఆయన ఆస్తి.. దేశ బడ్జెట్ కంటే రెట్టింపు

సాక్షి, హైదరాబాద్: ఆయన ఆస్తి భారతదేశ బడ్జెట్‌కు రెండింతలు.. సొంత విమానాశ్రయం, సొంత రైల్వే, సొంత బ్యాంకు.. అప్పట్లో ప్రపంచంలోనే అత్యధిక ధనవంతుడు..మిలమిలా మెరిసే 185 కేరెట్ల జాకబ్ వజ్రం ఆయన బల్లపై పేపర్ వెయిట్..1937లో ఫిబ్రవరి 22న టైం మేగజైన్ కవర్‌పేజీపై ‘రిచెస్ట్ మెన్ ఇన్ ది వరల్డ్’ పేరుతో ప్రచురితమైన కథనం ఆయనదే... ఆయనే ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్. అసఫ్‌జాహీ వంశంలో చివరి రాజు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన సమయంలో హైదరాబాద్ స్టేట్‌ను పాలిస్తున్న రాజు. 1940వ దశకంలో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా రికార్డుపుటల్లోకి ఎక్కిన ఏడో నిజాం.. ప్రపంచ నలుమూలలకూ మేలిమి వజ్రాలను సరఫరా చేసినవాడిగా కూడా రికార్డు సాధించారు.

అదే ఆయనను ప్రపంచ ధనికుడిని చేసింది. అమెరికా మొత్తం సంపదలో రెండు శాతంతో సమంగా మీర్ ఉస్మాన్ అలీఖాన్ సంపద ఉండేది. అప్పట్లోనే ఆయన సంపద విలువ రెండు బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ. అప్పుడు భారతదేశ వార్షికాదాయం ఒక బిలియన్ డాలర్లు మాత్రమే. అంతేకాదు హైదరాబాద్ సంస్థానం బడ్జెట్ అప్పట్లోనే రూ.కోట్లలో ఉండేది. మొత్తం బడ్జెట్‌లో 11 నుంచి 15 శాతం దాకా విద్యా రంగానికే కేటాయించే వారు. ఇళ్లకు విద్యుత్ వెలుగులు, నిజాం విశ్వవిద్యాలయం, హైకోర్టు, ఉస్మానియా ఆసుపత్రి భవనం, నిజాం చక్కెర కర్మాగారం.. ఇవన్నీ ఆయన బడ్జెట్ కానుకలే. ప్రస్తుతం ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్’గా కొనసాగుతున్న బ్యాంకు మీర్ ఉస్మాన్ అలీఖాన్ సొంతంగా స్థాపించిన బ్యాంకే.

మరిన్ని వార్తలు