‘రియల్’ ప్లాన్!

13 Mar, 2016 23:53 IST|Sakshi
‘రియల్’ ప్లాన్!

ఆదాయం పెంపుపై హెచ్‌ఎండీఏ దృష్టి
వెంచర్ల అభివృద్ధి, ప్లాట్ల వేలానికి నిర్ణయం
‘ఉప్పల్ భగత్’  ప్లాట్ల విక్రయానికి సన్నాహాలు

 
భవిష్యత్ నగరాభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తూ కొత్త కొత్త ప్రాజెక్టులతో దిశా నిర్దేశం చేయాల్సిన హెచ్‌ఎండీఏ ఇప్పుడు తన పంథాను మార్చుకుంటోంది. ఆర్థికంగా పరిపుష్టి సాధించేందుకు రియల్ ఎస్టేట్ రంగంవైపు మళ్లీ దృష్టి సారిస్తోంది. నాగోలు వద్ద ఉప్పల్ భగత్‌లో అభివృద్ధి చేసిన లే అవుట్‌లో తన వాటాగా వచ్చే ప్లాట్లను వేలం ద్వారా విక్రయించేందుకు అధికారులు సమాలోచనలు చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ రావడంతో నగర శివార్లలో ల్యాండ్ పూలింగ్ చేయడం ద్వారా భారీ వెంచర్లు అభివృద్ధి చేసేందుకు సైతం హెచ్‌ఎండీఏ సన్నద్ధమైంది.    - సాక్షి, సిటీబ్యూరో
 
సిటీబ్యూరో: ఇటీవల మూసీనది పరిశీలన సందర్భంగా మంత్రి  కేటీఆర్ చేసిన సూచనలు కూడా హెచ్‌ఎండీఏకు పూర్వవైభవం తెచ్చే విధంగా ఉన్నాయి. ‘గతంలో జరిగిన కొన్ని తప్పిదాల వల్ల హెచ్‌ఎండీఏ అభాసుపాలైంది. ఇకపై ఏం చేసినా... పక్కాగా చేస్తాం. ప్రజలకు  క్లియర్ టైటిల్ ప్లాట్లను అందజేస్తాం. రియల్ ఎస్టేట్ రంగంలో ప్రైవేటు నిర్మాణ సంస్థ ఎలా పని చేస్తుందో...  హెచ్‌ఎండీఏ కూడా అదే స్థాయిలో పనిచేసేలా చర్యలు తీసుకొంటున్నాం ’ అంటూ మునిసిపల్ శాఖ మంత్రి కె.తారకరామారావు మూసీ పరిశీలన సందర్భంగా స్పష్టం చేశారు. దీంతో హెచ్‌ఎండీఏ కొత్త వెంచర్ల అభివృద్ధికి ల్యాండ్ పూలింగ్ వైపు దృష్టి సారించింది. ఇప్పటికే   ఉప్పల్-నాగోల్ మార్గంలోని ఉప్పల్  భగత్‌లో 413.32 ఎకరాల్లో సుమారు రూ.93 కోట్ల వ్యయంతో భారీ లే అవుట్‌ను అభివృద్ధి చేసిన విషయం తెలిసిందే. ఈ లేఅవుట్‌ను అభివృద్ధి చేసినందుకు గాను 9,25,000 చదరపు గజాల విస్తీర్ణం ప్లాట్లు హెచ్‌ఎండీఏ వాటాగా రానున్నాయి.

అయితే... ఉప్పల్ భగత్‌లో  భూములు కోల్పోయిన రైతులకు ప్లాట్లు ఇవ్వగా ఇంకా సుమారు 1,75,000 చ.గ. విస్తీర్ణం మిగులుతోంది. దీన్ని వేలం ద్వారా విక్రయించి నిధులు సేకరించాలని హెచ్‌ఎండీఏ ఉవ్విళ్లూరుతోంది. త్వరలో రైతులకు ప్లాట్లు ఇస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించడంతో మిగిలిన ప్లాట్లను వేలం ద్వారా విక్రయానికి పెట్టాలని అధికారులు భావిస్తున్నారు. ఆ ప్రాంతంలో ఇప్పుడున్న ధరల ప్రకారం ఒక చ.గ. ధర రూ.20 వేలకు అమ్మినా... 1,75,000 చ.గ.ల  ప్లాట్లకు సుమారు రూ.350 కోట్లు ఆదాయం రానుంది. అయితే... ఉప్పల్ భగత్ లేఅవుట్‌లో ఇంకా నీటి సరఫరా పైపులైన్ వ్యవస్థ, ఓవర్ హెడ్ ట్యాంకులు, సంపులు, ఫెన్సింగ్ వంటివి నిర్మిం చాల్సి ఉంది. ఇందుకోసం మరో రూ.10 కోట్లు వెచ్చిం చాల్సి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అన్ని ఖర్చులు పోయినా... ఇక్కడి ప్లాట్లు అమ్మడం ద్వారా  రూ.340-350 కోట్లు ఆదాయం రానుంది.

రూ.వెయ్యి కోట్లు ఆదాయం
ఉప్పల్ భగత్ సమీపంలోనే 150 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. దాన్ని కూడా అభివృద్ధి చేస్తే ఈ లేఅవుట్ మరింత విస్తరించవచ్చని, తద్వారా ఖర్చు తగ్గడంతో పాటు నీరు, డ్రైనేజీ, రోడ్డు సదుపాయాలు సులభమవుతాయని అధికారులు  ప్లాన్ చేస్తున్నారు. ఆ 150 ఎకరాల్లో లేఅవుట్ అభివృద్ధి చేస్తే సుమారు 3.50 లక్షల చ.గ. విస్తీర్ణంలో ప్లాట్లు రూపొందుతాయని, ఒక చదరపు గజం రూ.20 వేల ప్రకారం విక్రయించినా రూ.700 కోట్లు ఆదాయం వస్తుం దని అంచనా. అయితే...ఈ లేఅవుట్‌ను అభివృద్ధి చేయడానికి రూ.45-50 కోట్లు వెచ్చించాల్సి ఉంటుందని ఆ మొత్తా న్ని తీసేస్తే రూ.650 కోట్లు ఆదాయం రానుంది. కొత్త లేఅవుట్ అభివృద్ధి చేయడం వల్ల రూ.650 కోట్లు, ఉప్పల్ భగత్‌లో తమ వాటాగా వచ్చిన 1,75,000 చ.గ. ప్లాట్లను విక్రయించడం ద్వారా రూ.350 కోట్లు.. మొత్తం రూ.1000 కోట్లు ఆదాయం రానుందని ప్రాథమిక అంచనాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ ఆదాయంతో హెచ్‌ఎండీఏ ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కడమే గాక, నగరాభివృద్ధికి సంబంధించి కొత్త ప్రాజెక్టులు చేపట్టేందుకు వెసులుబాటు కలగనుంది. అయితే... గతంలో ప్రభుత్వ భూములు అమ్మిపెట్టినందుకు గాను రూ.470 కోట్లు ఆదాయపన్ను కింద చెల్లిం చాలని ఐటీ శాఖ చాలాకాలంగా హెచ్‌ఎండీఏను వెంటాడుతోంది. దీంతో కొత్త వెంచర్లపై ఆ సంస్థ ఆచితూచి అడుగులేస్తోంది. కొత్త వెంచర్ల అభివృద్ధి విషయమై హెచ్‌ఎండీఏ కమిషనర్ టి.చిరంజీవులును ‘సాక్షి’ వివరణ కోరగా తర్వాత వెల్లడిస్తామంటూ ఆయన దాటవేశారు.
 

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా