నిగ్గుతేల్చండి..

23 Feb, 2016 00:13 IST|Sakshi
నిగ్గుతేల్చండి..

బీపీపీలో అక్రమాలపై హెచ్‌ఎండీఏ కమిషనర్ ఆగ్రహం
అద్దె బకాయిల వ్యవహారంపై విచారణకు ఆదేశం

 
సిటీబ్యూరో: హుస్సేన్‌సాగర్ తీరంలోని హెచ్‌ఎండీఏ స్థలాల్లో వ్యాపారాలు నిర్వహిస్తూ అద్దె చెల్లించ ని వ్యాపారులకు సహకరించిన అధికారుల వ్యవహారాన్ని నిగ్గుతేల్చాలని హెచ్‌ఎండీఏ కమిషనర్ టి.చిరంజీవులు ఆదేశించారు. హెచ్‌ఎండీఏ ఖజానాకు రావాల్సిన కోట్లాది రూపాయల ఆదాయాన్ని అడ్డుకొన్న అక్రమార్కులపై లోతైన విచారణ జరిపి బాధ్యులను నిగ్గుతేల్చాలని బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు(బీపీపీ) అధికారులను ఆదేశించారు. సాగర తీరంలో లీజ్ ప్రాతిపదిక స్థలాలు చేజిక్కించుకొని అద్దెలు చెల్లించకుండా పలువురు వ్యాపారులు దర్జాగా ధనార్జన చేస్తున్న వైనాన్ని... భారీ మొత్తంలో  పేరుకుపోయిన అద్దె బకాయిలు,  రాత్రికి రాత్రే దుకాణాలు ఖాళీ చేసి సామగ్రిని తరలిస్తోన్న వ్యాపారుల తీరును బట్టబయలు చేస్తూ ‘చక్కబెట్టేస్తున్నారు..!’ శీర్షికన సోమవారం ‘సాక్షి’ ప్రత్యేక కథనాన్ని  ప్రచురించింది. దీనిపై స్పందించిన హెచ్‌ఎండీఏ కమిషనర్ చిరంజీవులు సోమవారం బీపీపీ అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించి అద్దె బకాయీల్లో అక్రమాలపై ఆరా తీశారు. ‘ లీజ్ అగ్రిమెంట్ ప్రకారం ఒక నెల అద్దె మొత్తాన్ని డిపాజిట్‌గా కట్టించుకొని, 4 నెలల అద్దెకు బ్యాంకు గ్యారెంటీ తీసుకొంటున్నాం. సకాలంలో అద్దె చెల్లించనప్పుడు వెంటనే నోటీసులిచ్చి ఖాళీ చేయించాలి.  అయితే... వ్యాపారులతో కుమ్మక్కై  వారికి సహకరించడం వల్లే  అద్దె బకాయిలు కోట్ల రూపాయల్లో పేరుకుపోయాయి. దీనికి బాధ్యులు ఎవరు..?’ అంటూ కమిషనర్ నిలదీశారు. డాక్టర్ కార్స్, మల్లిగ సంస్థలు కోర్టును ఆశ్రయించినప్పు హెచ్‌ఎండీఏ వైపు నుంచి ఎందుకు కోర్టులో ఫైట్ చేయలేదని ప్రశ్నించారు. ‘పార్టీజోన్ తాలూకు కోటి రూపాయల బకాయి ఉంది.

అలాగే ఎన్టీఆర్ గార్డెన్‌లో డౌన్ టౌన్ లీజ్‌కు తీసుకొన్న వ్యక్తి సుమారు రూ.70 లక్షలు బకాయిలు చెల్లించాల్సి ఉంది. అతను ఖాళీ చేశాక  దీన్ని రెండేళ్ల నుంచి ఎందుకు ఖాళీగా  ఉంచారు.?  సుమారు కోటి రూపాయలు నష్టం వాటిల్లింది. దీనికి ఎవరు బాధ్యులు..’ అంటూ అధికారులను నిలదీశారు. దీనిపై లోతుగా విచారణ జరిపించి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే నోటీసులు జారీ చేసినా బకాయిలు చెల్లించని వ్యాపారులపై  కొరడా ఝలిపించాలని కమిషనర్ సూచించారు.  అద్దె చెల్లించకుండా ఖాళీ చేసి వెళ్లిన వారిపై రెవెన్యూ రికవరీ యాక్ట్‌ను ప్రయోగించి ఆ మొత్తాన్ని ముక్కుపిండి వసూలు చేయాలని బీపీపీ అధికారులను ఆదేశించారు. వెంటనే చర్యలు చేపట్టి ఎన్టీఆర్ గార్డెన్ డౌన్‌టౌన్‌కు, పార్కింగ్ లాట్స్ తదితరాలకు టెండర్లు నిర్వహించాలని సూచించారు.
 
 

>
మరిన్ని వార్తలు