‘సాగర్’ మథనం!

10 Sep, 2014 04:36 IST|Sakshi
‘సాగర్’ మథనం!

సాక్షి, సిటీబ్యూరో: గణనాథుని నిమజ్జనోత్సవం ముగిసింది. నగరంలోని వేలాది వినాయక విగ్రహాలు హుస్సేన్ సాగర్‌లో జలప్రవేశం చేశాయి. వీటి వ్యర్థాలను తొలగించేందుకు ‘సాగర్’ వడపోత కార్యక్రమానికి హెచ్‌ఎండీఏ శ్రీకారం చుట్టింది. ఈ ఏడాది చిన్నా, పెద్దవి కలిపి సుమారు 60 వేల వినాయక ప్రతిమలు నిమజ్జనమైనట్టు అధికారుల అంచనా. వీటిని సత్వరం వెలికితీసి సాగర్‌ను కాలుష్యం నుంచి కాపాడేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. ఎలాంటి ప్రతికూల పరిస్థితి ఎదురైనా ఈ నెల 12కల్లా నిమజ్జన  పూడిక తొలగింపు పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు.
 
ప్రత్యేకించి ఎన్టీఆర్ మార్గ్‌లోని 9 ప్లాట్‌ఫారాల వద్ద నిమజ్జనం చేసిన గణేశ్ విగ్రహాల అవశేషాలు, పూలు, పత్రి తదితర వ్యర్థాలను ఒడ్డుకు చే రుస్తున్నారు. వాటిని కవాడీగూడలోని జీహెచ్‌ఎంసీ డంపింగ్ యార్డ్‌కు తరలించే పనులను మంగళవారం రాత్రి నుంచి ముమ్మరం చేశారు. ప్రధానంగా ఎన్టీఆర్ మార్గ్‌లోని క్రేన్ నెం.4 వద్ద సాగర్‌లో పెద్ద మొత్తంలో వినాయక విగ్రహాలు పోగవ్వడంతో ఖైరతాబాద్ భారీ వినాయకుడి నిమజ్జనానికి అడ్డంకిగా మారాయి. ఈపరిస్థితిని గమనించిన హెచ్‌ఎండీఏ అధికారులు మంగళవారం ఉదయం 150 మంది కూలీలు, యంత్రాలను నియమించి 3 గంటల వ్యవధిలో వాటిని పక్కకు తొలగించారు.
 
అనంతరం పోలీసుల సహకారంతో ట్రాఫిక్‌ను నియంత్రించి, సుమారు 170 టన్నుల వ్యర్థాలను జీహెచ్‌ఎంసీ డంపింగ్ యార్డ్‌కు తరలించారు. ఈ పనులన్నీ ఖైరతాబాద్ భారీ వినాయకుడు సాగర్‌కు చేరుకునే లోగానే పూర్తవడంతో పోలీసులు, ఇతర అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. లేదంటే భారీ గణేశుడి నిమజ్జనం మరింత ఆలస్యమయ్యేది. భారీ విగ్రహాన్ని నీటిలో కాకుండా గట్టున వేస్తే భక్తుల మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉన్నందున అధికారులు క్షణాల్లో చర్యలు చేపట్టి నిమజ్జనానికి మార్గం సుగమం చేశారు. మిగతా ఫ్లాట్ ఫారాల వద్ద నిమజ్జనమైన విగ్రహాలను కూడా నీటిలోకి జారిపోకుండా ఎప్పటికప్పుడు గట్టుకు చేర్చి జాగ్రత్తలు తీసుకున్నారు.
 
నిరంతరాయంగా పరిశుభ్రత
వినాయక నిమజ్జన వ్యర్థాలను తొలగించే పనులను నిరంతరాయంగా కొనసాగించే విధంగా అధికారులు చర్యలు చేపట్టారు. ఇందుకోసం 200 మంది కూలీలు, 10 టిప్పర్లు, 2 డీయూసీలు, 3 జేసీబీలు, 1 పాంటూన్ ఎక్స్‌కవేటర్‌లను వినియోగిస్తున్నట్లు బీపీపీ ఓఎస్‌డీవి.కృష్ణ, ఎస్‌ఈ బీఎల్‌ఎన్.రెడ్డిలు తెలిపారు. షిఫ్టుల వారీగా ఏకధాటిగా ప్రక్షాళన పనులు నిర్వహించి, 12వ తేదీలోగా పూర్తి చే స్తామని వారు ధీమా వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ మార్గ్ వైపు నిమజ్జనమైన విగ్రహాలను ఇప్పటికే గట్టుకు చేర్చామని, వీటిని రెండు రోజుల్లో పూర్తి స్థాయి లో తొలగిస్తామని తెలిపారు. ఖైరతాబాద్ భారీ వినాయకుడికి సుమారు 10 టన్నుల వరకు ఇనుము వినియోగించారని, దీన్ని సేకరించేందుకు గణేశ్ ఉత్సవ సమితికి ఈ నెల 11వరకు సమయమిచ్చి, 12న ఆ విగ్రహ శకలాలను కూడా పూర్తిగా తొలగిస్తామని వారు వెల్లడించారు.
 
స్క్రాప్ కోసం ఆరాటం
నిమజ్జన విగ్రహాల ఇనుము (స్క్రాప్)ను చేజిక్కించుకొనేందుకు కొందరు పడుతున్న ఆరాటం చూపరులను విస్మయానికి గురిచేస్తోంది. పీకలోతు నీటిలోకి వెళ్లి విగ్రహాల నుంచి వీలైనంత స్క్రాప్‌ను పోగు చేసుకొనేందుకు కొందరు యువకులు పోటీలు పడ్డారు. గట్టుకు చేర్చిన ఇనుమును కూడా చేతనైనంత వరకు తీసుకెళ్లడం కనిపించింది. వీరితోపాటు అక్కడి క్రేన్ వద్ద పనిచేస్తున్న కూలీలు, వివిధ బస్తీల నుంచి వచ్చిన నిరుపేదలు కూడా ఇనుమును సేకరించేందుకు తీవ్రంగా శ్రమించారు. వీటివల్ల వచ్చే ఆదాయమే పలువురు నిరుపేదలకు జీవనాధారం కావడంతో అధికారులు కూడా వారికి అడ్డు చెప్పకుండా వదిలేశారు.

మరిన్ని వార్తలు