హెచ్‌ఎండీఏ సర్వర్ ఢమాల్

30 Dec, 2015 09:54 IST|Sakshi
హెచ్‌ఎండీఏ సర్వర్ ఢమాల్

ఎల్‌ఆర్‌ఎస్/బీఆర్‌ఎస్ దరఖాస్తుదారుల్లో అయోమయం
 

 సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ) ఆన్‌లైన్ వ్యవస్థ ఒక్కసారిగా స్తంభించింది. సామర్థ్యానికి మించి లోడ్ పడటంతో సర్వర్లు మొరాయించాయి. దీంతో హెచ్‌ఎండీఏలో సోమ, మంగళవారాల్లో క్రమబద్ధీకరణ కార్యకలాపాల్లో గందరగోళం నెలకొంది. ఎల్‌ఆర్‌ఎస్/బీఆర్‌ఎస్‌ల కింద అక్రమ భవనాలు, లేఅవుట్లను క్రమబద్ధీకరించుకొనేందుకు తుది గడువు ఈ నెల 31తో ముగియనుండటంతో దరఖాస్తుదారులు విరా మం లేకుండా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొనేం దుకు ప్రయత్నించారు. మంగళవారం అధిక సంఖ్యలో ఆల్‌లైన్‌లో దరఖాస్తులు అప్‌లోడ్ కావడంతో హెచ్‌ఎండీఏలోని సర్వర్లకు సామర్థ్యానికి మించి లోడ్ పడడంతో12 గంటల తర్వాత మొండికేశాయి.

సుమారు 3-4గంటల సేపు కార్యకలాపాలన్నీ స్తంభించాయి. దీంతో రోజూ ఆన్‌లైన్‌లో దాఖలయ్యే దరఖాస్తుల సంఖ్య సగానికి తగ్గి మంగళవారం 2వేలకు పడిపోయింది. సోమవారం కూడా ఇదే పరిస్థితి తలెత్తింది.  ఇప్పటివరకు ఎల్‌ఆర్‌ఎస్/బీఆర్‌ఎస్ కింద 44వేల దరఖాస్తులే హెచ్‌ఎండీఏకు అందాయి. చివరి రోజుల్లో అత్యధిక సంఖ్యలో దరఖాస్తులు వస్తాయని అధికారులకు తెలి సినా... ఆ మేరకు జాగ్రత్తలు తీసుకోకపోవడంతో హెచ్‌ఎండీఏకు వచ్చే ఆదాయం కూడా అందకుండా పోయింది. మంగళవారం రాత్రి కూడా సర్వర్లు మొరాయించాయి.

 మాన్యువల్‌గా అసాధ్యమే..
 ఆన్‌లైన్‌లో సమస్యల కారణంగా దరఖాస్తు చేసుకోలేని వారు మాన్యువల్‌గా దరఖాస్తులను అందజేయవచ్చని హెచ్‌ఎండీఏ కమిషనర్ టి.చిరంజీవులు చేసిన ప్రకటన కంటితుడుపు చర్యగానే మిగిలింది. నేరుగా దరఖాస్తు చేయాలన్నా... ప్రాథమిక సమాచారాన్ని హెచ్‌ఎండీఏ వెబ్‌సైట్‌లోని ఆన్‌లైన్ దరఖాస్తును నింపి, ఆ ఫారాన్ని డౌన్‌లోడ్ చేసుకుని మిగతా డాక్యుమెంట్లు, రూ.10 వేల డీడీ దానికి జతచేసి హెచ్‌ఎండీఏలో లేదా మండల కార్యాలయంలోని సేవా కేంద్రంలో అందజేయాలని కమిషనర్ సూచించారు.

ప్రాథమిక సమాచారాన్ని హెచ్‌ఎండీఏ వెబ్‌సైట్‌లోని దరఖాస్తులో నమోదు చేసేందుకూ సాధ్యంకాక చాలామంది దరఖాస్తుదారులు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. కొందరు వివరాలను ఆన్‌లైన్ దరఖాస్తులో నింపి సబ్మిట్ చేసే తరుణంలో సర్వర్లు పనిచేయక డేటా మొత్తం పోయింది. మరి కొందరు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వారు ఆ కాపీకి మిగతా డాక్యుమెంట్లు జతచేసి తార్నాకలోని హెచ్‌ఎండీఏ ప్రధాన కార్యాలయంలో ఇచ్చేందుకు ప్రయత్నించగా... పలు రకాల మెలిక పెడుతూ తిప్పిపంపుతున్నారు. అయితే... దళారులు తెస్తున్న దరఖాస్తులను మాత్రం వెంటనే స్వీకరించి రశీదు చేతిలో పెడుతుండడం గమనార్హం. ఒక్కో దరఖాస్తుకు రూ.3 వేల చొప్పున వసూలు చేస్తూ అన్నీ తామే చక్కబెడతామని నమ్మబలుకుతున్నారు. కొందరు దళారులు ముందే జాగ్రత్తపడి డీడీలు తీసిపెట్టుకుని గడువు మీరాక కూడా తాము మీ దరఖాస్తులు హెచ్‌ఎండీఏలో సబ్మిట్ చేస్తామంటూ బేరం కుదుర్చుకొంటున్నారు. అక్రమాలకు అవకాశం లేకుండా క్రమబద్ధీకరణ గడువును మరో 2నెలలు పెంచాలని దరఖాస్తుదారులు డిమాండ్ చేస్తున్నారు.
 
 సీఐవో ఏమయ్యారు?
 హెచ్‌ఎండీఏలో ఏ అధికారి వస్తున్నారు? ఏ అధికారి బయటకు వెళుతున్నారో? తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. హెచ్‌ఎండీఏలో సర్వర్లు మొరాయించడంతో వాటిని సరిదిద్దే అధికారి లేకపోవడం విధుల పట్ల అధికారులకున్న చిత్తశుద్ధికి అద్దంపడుతోంది. హెచ్‌ఎండీఏలో ఆన్‌లైన్ దరఖాస్తుల వ్యవస్థను పర్యవేక్షించేందుకు ప్రత్యేక కన్సల్టెంట్‌గా చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ (సీఐవో)ను నియమించారు. సోమవారం సర్వర్లు పనిచేయకపోవడంతో కాస్త హడావుడి చేసిన సదరు అధికారి మంగళవారం ఏకంగా సెలవులో వెళ్లడంపై ఆరోపణలు విన్పిస్తున్నాయి. నిజంగా ఆ అధికారికి ఐటీ పై పట్టు ఉందా...? హెచ్‌ఎండీఏ వెబ్‌సైట్‌లో దరఖాస్తుల ఎంట్రీ పెరిగితే... అందుకు తగ్గట్లు సర్వర్ల స్థాయిని ఎందుకు అప్‌గ్రేడ్ చేసుకోలేక పోయారు..? ఎవరి అనుమతితో సెలవు పెట్టారు..? వంటి ప్రశ్నలు హెచ్‌ఎండీఏ సిబ్బంది నుంచి వ్యక్తమవుతున్నాయి. సీఐఓ అసలు డ్యూటీలో ఉన్నారో...? లేరో..? కూడా హెచ్‌ఎండీఏ కమిషనర్‌కు సమాచారం లేదంటే అధికారులపై పర్యవేక్షణ ఎలా ఉందో ఇట్టే తెలుస్తోంది.

మరిన్ని వార్తలు