హోర్డింగ్స్ తొలగించి.. ఇనుము తీసుకెళ్లండి

20 Sep, 2013 03:02 IST|Sakshi

 సాక్షి, సిటీబ్యూరో: వివిధ పనులకు ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు సంస్థలపై ఆధారపడుతున్న జీహెచ్‌ఎంసీ.. చివరకు అక్రమ హోర్డింగ్‌ల కూల్చివేతలను సైతం  కాంట్రాక్టుకిచ్చేందుకు సిద్ధమైంది. కుప్పలు తెప్పలుగా వెలుస్తున్న అక్రమ హోర్డింగులు పలు ప్రమాదాలకు కారణమవుతున్న విషయం తెలిసిందే. కొద్దినెలల క్రితం నిజాం కాలేజీ వద్ద హోర్డింగ్ కుప్పకూలడంతో, హోర్డింగ్‌ల సామర్ధ్యంపై కళ్లు తెరచిన అధికారులు.. అదే సమయంలో అక్రమ హోర్డింగ్‌లపైనా దృష్టి పెట్టారు.

అక్రమ హోర్డింగ్స్‌లో ఇప్పటికే కొన్ని తొలగించగా.. ఇంకా 162 ఉన్నట్లు గుర్తించారు. వీటి ని తొలగించే పనులను కాంట్రాక్ట్‌కు ఇవ్వడంతో పాటు సదరు హోర్డింగుల ఇనుమును కూడా వారికి ఇవ్వాలని నిర్ణయించారు. ఆ ఇనుము విక్రయించగా వచ్చే ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకొని..  కాంట్రాక్టర్లు జీహెచ్‌ఎంసీకి ఎంతమేర తిరిగి చెల్లించగలరో కోరుతూ టెండర్లను  ఆహ్వానించేందుకు సిద్ధమయ్యారు. ఇనుము విలువ పెరిగిపోవడంతో..ఒక్కో హోర్డింగ్ ఏర్పాటులో ఎంత ఇనుము వినియోగించారనేది తెలుసుకునేందుకు ఇటీవల సర్వే నిర్వహించారు.

ఒక్కో హోర్డింగ్‌కు వినియోగించిన ఇనుము రెండున్నర నుంచి మూడు మెట్రిక్ టన్నుల వరకు  ఉన్నట్లు గుర్తించారు. ఈ అంచనాతో హోర్డింగ్స్ తొలగింపు పనుల్ని కాంట్రాక్టుకిస్తే.. తమకు వాటిని తొలగించే శ్రమ తప్పడంతో పాటు జీహెచ్‌ఎంసీకి అంతో ఇంతో ఆదాయం వస్తుందని అంచనా వేశారు. ఈ నేపథ్యంలోనే టెండర్లకు సిద్ధమవుతున్నారు. అధికారుల ఈ ఆలోచన ఏ మేరకు ఫలితాలిస్తుందో వేచి చూడాల్సిందే.

 ఇది ఫలితమిస్తే.. భవిష్యత్తులో అక్రమ భవనాల కూల్చివేతలకు సైతం జీహెచ్‌ఎంసీ అధికారులు ఇలాంటి ఆలోచనలే చేస్తారేమోననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి
 

>
మరిన్ని వార్తలు