వినిపించే బీపీ.. నిలబెట్టి సర్జరీ..

24 Feb, 2018 01:28 IST|Sakshi

హాస్పిటల్‌ నీడ్‌ ఎక్స్‌పో–18కి విశేష స్పందన

వందకుపైగా కంపెనీలు.. ఐదు వేలకుపైగా ఉత్పత్తులు   

వీక్షించేందుకు తరలివచ్చిన వైద్య, నర్సింగ్‌ విద్యార్థులు  

సాక్షి, హైదరాబాద్‌ :  వైద్య రంగంలో అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఏమిటి..? మార్కెట్‌లో లభిస్తున్న సరికొత్త మెడికల్‌ ఉత్పత్తులు ఏవి? వాటిని ఎలా వినియోగించాలి? ఇలాంటి అనేక అంశాల గురించి భావివైద్యులకు పరిచయం చేసేందుకు ఏర్పాటు చేసిందే ప్రతిష్టాత్మక ‘మెడికాల్‌’హాస్పిటల్‌ నీడ్‌ ఎక్స్‌పో–2018. శుక్రవారం హైటెక్స్‌లో మెడికాల్‌ ఎక్స్‌పో ఘనంగా ప్రారంభమైంది. ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌(ఐఎంఏ) తెలంగాణ అధ్యక్షుడు టి.నర్సింగారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ఎక్స్‌పోను ప్రారంభించారు.

దేశవిదేశాలకు చెందిన సుమారు వంద కంపెనీలు వివిధ రకాల ఆపరేషన్‌ టేబుళ్లు, లైట్లు, సీజర్లు, అనెస్థీషియా యంత్రాలతోపాటు పల్స్‌ ఆక్సోమీటర్లు, వెంటిలేటర్లు, గైనకాలజీ ఎగ్జామినేషన్‌ టేబుళ్లు, ఆర్థో, న్యూరో, ల్యాప్రోస్కోపిక్, కార్డియో థొరాసిక్‌ సర్జికల్, ఈసీజీ మిషన్లు, మానిటర్లు, పీడియాట్రిక్‌ వార్మర్లు, అత్యాధునిక హైడ్రాలిక్‌ పడకలు, రకరకాల డిస్పోజల్స్, మైక్రోస్కోపులు, గ్లౌజులు, మాస్కులు ఇలా ఐదు వేల రకాల సర్జికల్, నాన్‌ సర్జికల్‌ వైద్య పరికరాలను ప్రదర్శించాయి. భావి వైద్యులు, నర్సింగ్‌ విద్యార్థులు ఈ పరికరాలను చూసి.. వాటి వినియోగం గురించి తెలుసుకునేందుకు ఎక్స్‌పోకు భారీగా తరలివచ్చారు.

టేబుల్‌పై నిలబెట్టి సర్జరీ..
సాధారణంగా రోగులను ఆపరేషన్‌ థియేటర్‌లోని టేబుల్‌పై పడుకోబెట్టి సర్జరీ చేస్తారు. కానీ ఊబకాయంతో బాధపడుతున్న రోగులను మాత్రం టేబుల్‌పై నిలబెట్టి బెరియాట్రిక్‌ సర్జరీ చేస్తారు. వీరి కోసం స్టాన్‌ కంపెనీ ప్రత్యేకంగా ఓటీ టేబుల్‌ను తయారు చేసింది. దీన్ని వైద్యుడు తనకు ఎలా కావాలంటే అలా ఉపయోగించుకోవచ్చు. దీని ధర రూ. 8.5 లక్షల వరకు ఉంది.

వైద్యుడి పర్యవేక్షణ అవసరం లేకుండా..
శ్వాస కూడా తీసుకోలేని పరిస్థితుల్లో ఐసీయూలో చికిత్స పొందుతున్న రోగికి వెంటిలేటర్‌ సహాయంతో కృత్రిమ శ్వాసను అందిస్తుంటారు. రోగికి దీనిని అమర్చిన తర్వాత వైద్యులు, నర్సులు అక్కడే ఉండి మానిటర్‌ చేస్తుంటారు. ఇటీవల మార్కెట్‌లోకి వచ్చిన ‘హామిల్టన్‌ సి–3’రోబోటిక్‌ వెంటిలేటర్‌ను ఒకసారి రోగికి అమర్చితే చాలు.. ఆ తర్వాత వైద్యుల పర్యవేక్షణ అవసరం లేకుండా ఆటోమేటిక్‌గా వెంటిలేషన్‌ సపోర్ట్‌ను అందిస్తుంది. రోగి ఆరోగ్య పరిస్థితిపై దానికదే ఓ అంచనాకు వస్తుంది. ఆ మేరకు శ్వాసను అందిస్తుంది. స్విట్జర్లాండ్‌ నుంచి దిగుమతి అవుతున్న ఈ మిషన్‌ ఖరీదు రూ.20 లక్షల వరకు ఉంటుంది.

అంధుల కోసం ప్రత్యేక బీపీ మిషన్‌..
ప్రస్తుతం మార్కెట్లో చాలా రకాల డిజిటల్‌ బీపీ మిషన్లు అందుబాటులో ఉన్నాయి. ఇంట్లోనే ఎప్పటికప్పుడు బీపీ చెక్‌ చేసుకునేందుకు వీలుగా అక్యుర కంపెనీ అందుబాటులోకి తెచ్చిన డిజిటల్‌ బీపీ మిషన్‌.. బీపీని మానిటర్‌పై నమోదు చేయడంతో పాటు ఆ విషయాన్ని వాయిస్‌ రూపంలో ప్రకటిస్తుంది. చదువురాని, కంటి చూపులేని రోగులకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. దీని ధర రూ.4,700.

శ్రమించకుండానే బాడీ మసాజ్‌..
మనిషి పరిపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ శరీరానికి తగిన వ్యాయామం అవసరం. చాలా మంది వాకింగ్, రన్నింగ్, యోగా వంటివి సాధన చేస్తుంటారు. అయితే ఉదయాన్నే నిద్ర లేచి కిలోమీటర్ల కొద్దీ నడిచే ఓపిక, సమయం చాలా మందికి ఉండటం లేదు. ఇలాంటి వారి కోసం ఫుల్‌బాడీ మసాజ్‌ చైర్‌ అందుబాటులోకి వచ్చింది. చైర్‌లో అరగంట కూర్చుంటే చాలు బాడీమసాజ్‌ పూర్తయినట్లే. దీని కోసం రూ.3.5 లక్షల నుంచి రూ.5.5 లక్షల వరకు విలువ చేసే చైర్లు అందుబాటులో ఉన్నాయి.

మరిన్ని వార్తలు