అర్ధరాత్రి వరకూ హోటళ్లు, రెస్టారెంట్లు..

23 May, 2015 22:13 IST|Sakshi

హైదరాబాద్: తెలంగాణలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసే లక్ష్యంతో హోటళ్లు, రెస్టారెంట్లు ఉదయం 5 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు తెరిచి ఉంచేలా ఉత్తర్వులు జారీ చేసినట్లు రాష్ట్ర హోం, కార్మిక శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. శనివారం ఆయన సచివాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇప్పటి వరకు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకే హోటళ్లలో ఆహార పదార్థాలు లభించేవని, ఇక నుంచి ఆ పరిస్థితి ఉండదని చెప్పారు.

రాత్రి 12 గంటల వరకు తెరిచి ఉంచే హోటళ్లు, రెస్టారెంట్ల వద్ద గొడవలు జరగకుండా చూసుకోవలసిన బాధ్యత యజమానులదేనని అన్నారు. ఈ హోటళ్లలో తెలంగాణ వంటకాలను అందుబాటులో ఉంచాలని సూచించారు. అంతకు ముందు హోటల్స్, రెస్టారెంట్స్ యజమానులతో సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర హోటళ్ల సంఘం అధ్యక్షుడు సద్ది వెంకట్‌రెడ్డి, కార్యదర్శి బి. జగదీష్‌రావు పాల్గొని ప్రభుత్వ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలను హోటళ్లలో ఘనంగా నిర్వహించనున్నట్లు చెప్పారు.

మరిన్ని వార్తలు