ఇల్లెక్కడో చెప్పరూ!

10 Feb, 2018 08:10 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

గ్రేటర్‌లో గజిబిజిగా ఇంటి నెంబర్లు

40 ఏళ్లనాటి పాత నెంబర్లతో గందరగోళం

చిరునామాలు కనుక్కోలేక ప్రజల అవస్థలు

ఆధునిక నెంబర్ల పేరిటదశాబ్ద కాలంగా రూ.2 కోట్లు వృథా

గ్రేటర్‌లో ‘ఇంటి చిరునామా’ చిక్కడం లేదు. ఏదైనా వీధికి వెళ్లి ఓ ఇంటి అడ్రస్‌ పట్టుకోవడం గగనమవుతోంది. ఇంటి నెంబర్‌తో సహా పూర్తి చిరునామా ఉన్నా...ఆ ఆనవాళ్లు మాత్రం ఆయా
ప్రదేశాల్లో దొరకడం లేదు. గజిబిజి గల్లీలు.. క్రమపద్ధతిలో లేని వీధి నెంబర్లు, గందరగోళం కాలనీలు, ఒక్క డోర్‌ నెంబరుతోనే ఎన్నోఆబ్లిక్‌లను చేర్చుతూ పెరిగిపోయిన అదనపు ఇళ్లే ఇందుకు కారణం. 40 ఏళ్ల క్రితం నాటి డోర్‌ నెంబర్లే ఇంకా కొనసాగిస్తుండడం..కొత్తపద్ధతుల్లో ఇంటి నెంబర్లు వేయక పోవడం వల్ల సిటీజనులు నానా పాట్లు పడుతున్నారు.  

సాక్షి, సిటీబ్యూరో : విశ్వనగరంగా ఎదుగుతోన్న హైదరాబాద్‌ వివిధ అంశాల్లో నెంబర్‌వన్‌గా నిలుస్తోంది. అయినప్పటికీ.. నగరంలో చిరునామా తిప్పలు మాత్రం తప్పడం లేదు. ఇంటి నెంబరుతో సహా పూర్తి చిరునామా ఉన్నా గ్రేటర్‌లో కావాల్సిన ఇంటిని వెతుక్కోలేక ప్రజలు పడుతున్న అవస్థలు అన్నీ ఇన్నీ కావు. నలభయ్యేళ్ల నాటి ఇంటినెంబర్ల తీరులో ఇంతవరకు మార్పురాలేదు. ఈ దుస్థితి తప్పించేందుకు ఆధునిక ఇంటి నెంబర్లను అమలు చేసేందుకు దశాబ్దం క్రితమే ప్రయత్నాలు ప్రారంభించినా, ఆ ప్రాజెక్టు అర్ధాంతరంగా ఆగిపోయింది. పూర్తిస్థాయి సర్వేనే జరగలేదు. కొత్త రాష్ట్రం ఏర్పాటయ్యాక..అందివచ్చిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని డిజిటల్‌ ఇంటినెంబర్లను తెరపైకి తెచ్చారు. టెండర్ల దశ వరకొచ్చినా ఇవి టెండరుదార్లలో ఒకరు కోర్టుకెళ్లడంతో పెండింగ్‌లో పడింది. తాజాగా తిరిగి టెండర్లు పిలిచేందుకు సిద్ధమవుతున్నారు. టెండర్లు పూర్తయి, ఎంపికైన సంస్థ గ్రేటర్‌లోని 21 లక్షల ఇళ్ల సర్వే పూర్తిచేసి..కొత్త డిజిటల్‌ ఇంటినెంబర్లు అందుబాటులోకి తేవడానికి దాదాపు రెండేళ్లు పట్టే అవకాశం ఉందని సంబంధిత అధికారులు చెబుతున్నారు. 

దశాబ్దానికి పైగా..
దాదాపు దశాబ్దం క్రితమే నగరంలోని ఇళ్లు, రోడ్లు, వీధుల పేర్లు, నెంబరింగ్‌కోసం ప్రత్యేకంగా ఒక విభాగాన్ని  ఏర్పాటు చేశారు. వివిధ నగరాల్లోని ఇంటినెంబర్ల తీరును పరిశీలించిన ఈ విభాగం నగరానికి అనుకూలమైన విధానానికి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా వీధి ప్రారంభంలో ఇంటినెంబర్లను సూచించే సైన్‌బోర్డులు వాటిపై ప్రాంతం(లొకాలిటీ)పేరు, వీధినెంబరు, వీధిలో ఎన్ని ఇళ్లున్నాయో తెలిసే ఏర్పాట్లు చేశారు. అప్పట్లో 647 లొకాలిటీలను గుర్తించినప్పటికీ,  కేవలం 3 లొకాలిటీల్లో మాత్రం కొత్త ఇంటినెంబర్లు  వేశారు. ఇంటినెంబర్ల పేరిట దాదాపు రూ.2 కోట్లు ఖర్చు చేశారు. పథకాన్ని అర్ధంతరంగా ఆపివేశారు. ఆ తర్వాత  దాదాపు రెండేళ్ల క్రితం ఆధునిక డిజిటల్‌ నెంబర్ల కోసం టెండర్లు పిలిచారు. టెండరుదార్లలో ఒకరు కోర్టుకెళ్లడంతో ఆ ప్రక్రియ అంతటితో నిలిచిపోయింది. తిరిగి మరోమారు కొత్త టెండర్లను ఆహ్వానించేందుకు జీహెచ్‌ఎంసీ సిద్ధమైంది. అంతలోనే ప్రపంచబ్యాంకు నిధులతో తెలంగాణ రాష్ట్రం మొత్తానికి ఇంటినెంబర్ల ప్రక్రియకు ప్రభుత్వం సిద్ధమైనట్లు సంబంధిత అధికారి తెలిపారు. అందులో భాగంగానే జీహెచ్‌ఎంసీలోనూ సర్వే చేపట్టనున్నారు. డిజిటల్‌ నెంబర్లు అందుబాటులోకి వస్తే నగరంలోని ఏ ఇంటి చిరునామానైనా తేలిగ్గా కనుక్కోవచ్చు.

ఉపయోగాలెన్నో..
డిజిటల్‌ ఇంటినెంబర్ల విధానం విద్యుత్, జలమండలి, పోస్టల్, కొరియర్‌ తదితర సంస్థలకు ప్రయోజనకరం. సులభంగా చిరునామాకు చేరుకోవచ్చు. ఆయా సంస్థలందించే ఆధార్‌తో సహా అనుసంధానిస్తే బకాయిదారులు ఎక్కడికీ  తప్పించుకోలేరని జీహెచ్‌ఎంసీలోని ఓ అధికారి పేర్కొన్నారు. తద్వారా జీహెచ్‌ఎంసీ ఆస్తిపన్ను, ట్రేడ్‌లైసెన్సుల ఫీజుల్ని నూరు శాతం వసూలు చేసే వీలుంది. ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు పోలీసు, ఫైర్‌ సర్వీసు, అంబులెన్సులు త్వరితంగా చేరుకోవచ్చు.  
దేశంలో బెంగళూరు, విజయవాడల్లో మాత్రమే ఇప్పటి వరకు డిజిటల్‌ నెంబర్ల ప్రక్రియ ప్రారంభమైంది.  
జీహెచ్‌ఎంఈలో ఆధునిక ఇంటినెంబర్ల ప్రక్రియను ప్రారంభించినప్పుడు  18 సర్కిళ్లుండగా, 30కి పెరిగాయి. ఇళ్లు కూడా లక్షల సంఖ్యలో పెరిగాయి. ప్రస్తుతమున్న 5 జోన్లు ఇంకా పెరగనున్నాయి.

క్లౌడ్‌బేస్డ్‌ టెక్నాలజీతో డిజిటల్‌ నెంబర్లు
యూనిక్‌ స్మార్ట్‌ అడ్రసింగ్‌ సొల్యూషన్‌ ఫర్‌ అర్బన్‌ డ్వెలింగ్స్‌ (యూఎస్‌ఏఎస్‌యూడీ)గా పిలిచే ఈ ప్రాజెక్ట్‌లో క్లౌడ్‌ బేస్డ్‌ టెక్నాలజీని వినియోగించుకుంటారు.  
మొబైల్‌ ఫోన్‌/ ఆన్‌లైన్‌  ద్వారా సైతం ఈజీగా చిరునామా తెలిసేలా స్మార్ట్‌ విధానంలో డిజిటల్‌ ఇంటినెంబర్లను వినియోగంలోకి తేవడం లక్ష్యం.
అన్ని ఇళ్ల æ అడ్రస్‌లు  తేలిగ్గా తెలుసుకునేలా,  జీపీఎస్‌ ,గూగుల్‌ మ్యాప్స్‌ ద్వారా నేవిగేషన్‌ ఉండేలా ప్రాజెక్ట్‌ పూర్తిచేయాలి.
పైలట్‌ ప్రాజెక్టుగా ఒక ఏజెన్సీ దాదాపు ఏడాదిన్నర క్రితం గగన్‌మహల్‌లోని 500ఇళ్లకు డిజిటల్‌ ఇంటినెంబర్లను ఇచ్చింది. నగరవ్యాప్తంగా అమలు చేసేందుకు జీహెచ్‌ఎంసీ టెండర్లు పిలిచేలోగా రాష్ట్రమంతా చేపట్టేందుకు ప్రభుత్వం నిర్ణయించడంతో బ్రేక్‌పడింది.  
జీహెచ్‌ఎంసీ విస్తీర్ణం దాదాపు 625 చ.కి.మీలు కాగా 21 లక్షల ఇళ్లున్నట్లు అంచనా.  
సర్వే కోసం ఒక్కో ఇంటికి దాదాపు రూ.40 అంచనాతో టెండర్లు అహ్వానించనున్నట్లు సమాచారం. 

21 లక్షల ఇళ్ల చిరునామాలు..  
అన్ని రహదారులు, వీధులు, తదితరమైన వాటిని  శాటిలైట్‌ చిత్రాలతో సహా బేస్‌ మ్యాప్‌ను రూపొందించాల్సి ఉంటుంది. ఇందుకుగాను సమగ్ర సర్వే నిర్వహిస్తారు. సర్వేలో భాగంగా , ఇంటికి  దగ్గర్లోని ప్రముఖ ప్రాంతం, వీధిపేరు, సబ్‌లొకాలిటీ, లొకాలిటీలతో పాటు పిన్‌కోడ్‌ నెంబర్‌ కూడా సేకరించాలి.
ఖాళీ ప్లాట్లను సైతం గుర్తించి నెంబర్లు ఇస్తారు.

ఇంటి నెంబర్లు అస్తవ్యస్తం
జీహెచ్‌ఎంసీ అధికారులు కేటాయించిన ఇంటినెంబర్లు పూర్తిగా అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఇంటి నెంబర్ల ఆధారంగా చిరునామా కనుక్కోవడం ఇబ్బందికరంగా పరిణమించింది. ఎంసీహెచ్‌ హయాంలో కేవలం 4 నెంబర్లతో కూడిన నెంబర్ల కేటాయింపు మాత్రమే సహేతుకంగా ఉండేది. 1970 నుంచి జరుగుతున్న ఇంటినెంబర్ల కేటాయింపులో ఎంతమాత్రం క్రమపద్ధతి లేదు.
– నగరపు శ్యాం, అధ్యక్షుడు ఇందిరానగర్‌ కాలనీ సంక్షేమ సంఘం (సీతాఫల్‌మండి డివిజన్‌) 

మరిన్ని వార్తలు