పెళ్లింట పరేషానీ

10 Nov, 2016 10:45 IST|Sakshi
పెళ్లింట పరేషానీ

  చేతిలో చిన్ననోట్లు లేవు.. పెద్దనోట్లు చెల్లవు
  పెళ్లి సామాన్లు కొనలేక జనం నానా అవస్థలు
  ఈ నెల 24 వరకు మంచి ముహూర్తాలు
  తెలుగు రాష్ట్రాల్లో 10 వేల పెళ్లిళ్లు

 
 సాక్షి, హైదరాబాద్  :  రాజయ్య... ఈయనది గద్వాల సమీపంలోని ఓ కుగ్రామం..ఈ నెల 11న కూతురి పెళ్లి.. ఇందుకు తెలిసినవారివద్ద అప్పు చేసి డబ్బు సమకూర్చుకున్నాడు రాజయ్య.. గురువారం బంగారం కొనేందుకు కర్నూలు వెళ్లాడు.. అక్కడ డబ్బు చెల్లించే సమయంలో పెద్ద నోట్లు తీసుకోబోమని నగల షాపు యజ మాని చెప్పటంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయాడు! బ్యాం కులో చిల్లిగవ్వ లేనందున ఆన్‌లైన్ చెల్లింపు వెసులుబాటూ లేదు. దీంతో బంగారం కొనకుండానే వెనుదిరిగాడు! బంగా రం లేకుండా పెళ్లి ఎలా? ఇప్పుడు ఆ కుటుంబాన్ని వేధిస్తున్న ప్రశ్న ఇది!
 
 మెహిదీపట్నంలో నివసించే సుధీర్ కుటుంబంలో ఈ నెల 10న పెళ్లి. వంటకు కూరగాయలు లేవు. చేతిలో చిన్న నోట్లు లేవు. ఉన్న పెద్ద నోట్లు చెల్లవు. ఎంత గాలించినా వంద నోట్లు చిక్కలేదు. ఇప్పుడేం చేయాలా? అని ఆ కుటుంబం తల పట్టుకుంది!!
 ...ఇవి ఒక్కరిద్దరి సమస్యలు కాదు.. రాష్ట్రంలో అనేక కుటుంబాల్లో ఇప్పుడు ఇలాంటి చిక్కులే వచ్చిపడ్డాయి.
 
 పెద్ద నోట్ల రద్దు పెళ్లిళ్లకు పెద్ద కష్టాన్నే తెచ్చిపెట్టింది. కార్తీకమాసం మంచి ముహూర్తాలుండటంతో తెలంగాణ, ఏపీలో విసృ్తతంగా పెళ్లిళ్లు జరగబోతున్నారుు. ముహూర్తాలు దగ్గరపడటంతో అంతా షాపింగ్‌లో బిజీగా ఉన్నారు. ఆహ్వాన పత్రికలు ఇస్తూనే బంగా రం, వస్త్రాలు, ఇతర సామగ్రి కొనే పనిలో పడిపోయారు. కానీ వారికి ఊహించని ఉపద్రవం ఎదురైంది. బంగారం మొదలు కూ రగాయల వరకు ఎక్కడా ఏదీ కొనలేని పరిస్థితి. చేతిలో కావల్సినంత డబ్బు ఉన్నా వస్తువులు కొనలేని పరిస్థితి నెలకొనడంతో పెళ్లింట అయోమయం నెలకొంది. కొందరు ఆ డబ్బును బ్యాం కులో డిపాజిట్ చేయొచ్చులే అనుకుని ప్లాస్టిక్ కరెన్సీతో పని కాని చ్చేందుకు సిద్ధపడ్డారు. వీరికి పెద్దగా ఇబ్బంది లేకున్నా... అప్పుసొప్పు చేసి చేతిలో డబ్బు ఉంచుకున్న పేదల పరిస్థితే గందరగోళంగా మారింది. బ్యాంకు నిల్వ లేకపోవటంతో కార్డుల ద్వారా ఆన్‌లైన్ చెల్లింపులు చేయలేక తలలు పట్టుకున్నారు.
 
 దాదాపు 10 వేల పెళ్లిళ్లు..: ఇటీవలే ఆషాఢం, మూఢాలు... ముహూర్తాలు లేక పెళ్లిళ్లు వాయిదా పడ్డ ఇళ్లల్లో కార్తీకమాస వేళ బాజాలు మోగుతున్నాయి. 10, 11, 12, 13, 16, 17, 23, 24 ఇలా వరసగా మంచి ముహూర్తాలుండటంతో మంగళవాయిద్యాలు మారుమోగుతున్నాయి. కృష్ణా పుష్కరాల వేళ శుభకార్యాలు వద్దనుకున్నవారు కూడా ఇప్పుడు వివాహాలకు సిద్ధమయ్యారు. ఇలా తెలంగాణ, ఏపీలో 10 వేల పెళ్లిళ్లున్నాయి. ఇప్పుడు ఈ పెళ్లిళ్లలో తీవ్ర గందరగోళం నెలకొంది. ముఖ్యంగా షాపింగ్ విషయంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చేతినిండా డబ్బున్నవారు చిన్న నోట్లు అందుబాటులో లేకున్నా ఆన్‌లైన్‌తో పనికానిచ్చేస్తున్నా.. దిగువ మధ్య తరగతి, పేద కుటుంబాలు మాత్రం అష్టకష్టాలు పడుతున్నాయి. పోనీ చేతిలో సొమ్మును బ్యాంకులో వేసి తర్వాత తీసుకుందామంటే... రోజుకు రూ.పది వేలు, వారానికి గరిష్టంగా రూ. 20 వేలకు మించి విత్‌డ్రా చేసుకునే పరిస్థితి లేకపోవటంతో అయోమయంలో పడిపోయారు.
 
 ఉన్న డబ్బు ఖర్చు చేయలేక, చేబదులుగా చిన్న నోట్లు తెచ్చుకోలేక, ఆన్‌లైన్ చెల్లింపులు జరిపే వెసులుబాటు లేక విలవిల్లాడుతున్నారు. ఫంక్షన్ హాళ్లు, డెకరేషన్, క్యాటరింగ్, బ్యాండ్‌మేళాలు.. ఇలా అన్నింటికీ స్పాట్ పేమెంట్ ఇవ్వాలి. పెద్దనోట్లు వారు తీసుకోరు. దాంతో పెళ్లింట పెద్ద చిక్కే వచ్చిపడింది. ‘పెళ్లి’ల్లో పెద్దనోట్ల కష్టాలకు బంగారం కూడా తోడైంది. బుధవారం ఒక్కసారిగా 10 గ్రాముల బంగారానికి రూ.4 వేల మేర పెరగడంతో పెళ్లిళ్లు ఉన్న కుటుంబాలు తలలు పట్టుకున్నాయి.

>
మరిన్ని వార్తలు