రేపే గణేష్‌ నిమజ్జనం.. భారీ ఏర్పాట్లు!

14 Sep, 2016 18:27 IST|Sakshi
రేపే గణేష్‌ నిమజ్జనం.. భారీ ఏర్పాట్లు!

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో వినాయక నిమజ్జనానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్‍ ఖైరతాబాద్ గణపతిని ఈసారి ముందుగానే నిమజ్జనం చేయనున్నారు. ఖైరతాబాద్ వినాయక నిమజ్జనం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. బుధవారం అర్ధరాత్రి వరకు భక్తులకు దర్శనం కోసం అనుమతినిస్తారు. గురువారం 12గంటల లోపు ఖైరతాబాద్ గణపతిని నిమజ్జనం చేస్తారు. గతానికి భిన్నంగా ఈ సారి ఖైరతాబాద్ వినాయకుడిని ముందుగానే నిమజ్జనం చేయనున్నారు.

విగ్రహాల నిమజ్జనం కోసం ఎన్టీఆర్ మార్గ్లో 10 క్రేన్లు, అప్పర్ ట్యాంకు బండ్పై 24 క్రేన్లను ఏర్పాట్లు చేశారు. నిమజ్జనం కోసం నగరంలో 12వేల సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. నిమజ్జనం రూట్లో 2వేలు, సాగర్ చుట్టూ 44 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. గణేష్ నిమజ్జనానికి 5వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు వెస్ట్ జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు తెలిపారు. బంజారాహిల్స్, ఫిలింనగర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపంలో ఆయన పూజలు నిర్వహించారు. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని వినాయక నిమజ్జన ప్రాంతాలను జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ పరిశీలించారు. 14వ మైలు వద్ద ఉన్న ఎడమ కాల్వ వద్ద వినాయక నిమజ్జన ప్రాంతాన్ని వారు పరిశీలించారు. నల్గొండ నుంచి 2500 విగ్రహాలు ఇక్కడ నిమజ్జనం కోసం వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

కర్నూలు నగరంలో వినాయక నిమజ్జనం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్, జిల్లా కలెక్టర్, ఎస్పీ తదితరులు పాల్గొన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో నిమజ్జనానికి హాజరయ్యారు. మరోవైపు హైదరాబాద్ బాలాపూర్ వినాయక నిమజ్జనానికి ఉత్సవకమిటీ నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. బాలాపూర్ లడ్డూ వేలం అనంతరం స్వామివారిని నిమజ్జనానికి తరలిస్తారు. ఈసారి ఖైరతాబాద్ వినాయక నిమజ్జనం అనంతరం బాలాపూర్ వినాయక శోభాయాత్ర ప్రారంభంకానుంది.

మరిన్ని వార్తలు