మానవహక్కులు అణచివేస్తే సహించం

9 Sep, 2017 03:49 IST|Sakshi
మానవహక్కులు అణచివేస్తే సహించం
గౌరీ లంకేశ్‌ హత్యపై నినదించిన ప్రముఖులు
 
సాక్షి, హైదరాబాద్‌: సీనియర్‌ పాత్రికేయురాలు గౌరీ లంకేశ్‌ హత్యపై ప్రజా, హక్కుల సంఘాలు, కవులు, కళాకారులు, జర్నలిస్టులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని నడివీధిలో హత్య చేస్తుంటే సహించేది లేదని హెచ్చరించారు. మతం, కులం పేరుతో మానవ హక్కులను అణచివేస్తే సమాజం చూస్తూ ఊరుకోదన్నారు. శుక్రవారం ట్యాంక్‌బండ్‌పై నిర్వహించిన కార్యక్రమంలో కర్ణాటకలో హత్యకు గురైన పాత్రికేయురాలు గౌరీ లంకేశ్‌కు వందలాది మంది నివాళులర్పించారు. నేను సైతం గౌరి... గౌరీ లంకేశ్‌ హంతకులను కఠినంగా శిక్షించాలి... మతోన్మాదం నశించాలి.. అంటూ నినదించారు. ‘మతోన్మాదంపై ఒంటరిగా పోరాడి మరణించినా.. అక్షరాలను ఆయుధాలుగా మలిచి గెలిచింది గౌరీ లంకేశ్‌. ఆమె ఇప్పుడు గతం కాదు. వర్తమానం, భవిష్యత్తు కూడా’అంటూ ప్రముఖులు శ్లాఘించారు.

ఆమె మరణాన్ని జయించిన కలం యోధురాలని కొనియాడారు. దాడులు, బెదిరింపులు, హత్యలతో భావ ప్రకటనా స్వేచ్ఛని, ప్రజాస్వామ్యాన్ని హరించలేవన్నారు. అసహనాన్ని అంతం చేద్దాం.. హత్యారాజకీయాలను తిప్పికొడదాం అంటూ గౌరీ లంకేశ్‌ తన చివరి శ్వాసతో ప్రజల్లో కొత్తశ్వాస నింపారని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యావేత్త చుక్కారామయ్య, విరసం నేత వరవరరావు, సీపీఐ నేత కె.నారాయణ, జర్నలిస్టు నాయకుడు అమర్, ప్రెస్‌ అకాడెమీ చైర్మన్‌ అల్లం నారాయణ, మల్లేపల్లి లక్ష్మయ్య, ఎన్‌.వేణుగోపాల్‌ తదితరులు పాల్గొన్నారు. 
 
12న చలో బెంగళూరు..
గౌరీ లంకేశ్‌ హత్యకు నిరసనగా ఈ నెల 12న చలో బెంగళూరు నిర్వహిస్తున్నట్టు తెలంగాణ యూనియన్‌ ఆఫ్‌ వర్కింగ్‌ జర్నలిస్టుల సంఘం అధ్యక్షుడు అల్లం నారాయణ చెప్పారు. బెంగళూరులో జరిగే నిరసన ప్రదర్శనలో పాత్రికేయులంతా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. 
 
గౌరీ లంకేశ్‌ హంతకులను కఠినంగా శిక్షించాలి 
న్యాయవాదుల డిమాండ్‌  
ప్రముఖ పాత్రికేయురాలు గౌరీ లంకేశ్‌ హత్యను ఉమ్మడి హైకోర్టు న్యాయవాదులు తీవ్రంగా ఖండించారు. గౌరి హత్యపై న్యాయవాదులు శుక్రవారం భోజన విరామ సమయంలో హైకోర్టు బయట నిరసన తెలియచేశారు. హంతకులను కఠినంగా శిక్షించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ నినాదాలు చేశారు. ఐలు, ఐఏఎల్, ఏపీసీఎల్‌సీ, ఏపీసీఎల్‌ఏ తదితర సంఘాల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో న్యాయవాదులు పాటిబండ్ల ప్రభాకరరావు, కె.పార్థసారథి, వి.రఘునాథ్, ఎన్‌.మాధవరావు, పి.సురేశ్‌కుమార్, బొమ్మగాని ప్రభాకర్, తిరుమలశెట్టి కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని వార్తలు